Friday, October 24, 2025
E-PAPER
Homeమానవిఒత్తిడి తగ్గించుకుంటే విజయం మీదే

ఒత్తిడి తగ్గించుకుంటే విజయం మీదే

- Advertisement -

డా. మమతారెడ్డి… సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో మెడిసెన్‌ చదివి, హౌస్‌ సర్జన్‌లో ఇంటర్నిషిప్‌ మొదలుపెట్టింది. ఆ సమయంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయింది. వైద్యం కన్నా ఎంకేదో చేయాలనే తపన ఆమెలో మొదలయింది. అలాంటి వారికి చేయూతనివ్వాలంటే సివిల్స్‌ మంచి మార్గమని ఆవైపుగా అడుగులు వేసింది.

అయితే ఒక్కోసారి జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంటుంది. అలా తాను అనుకున్నది సాధించలేకపోయినా సివిల్స్‌లో కెరీర్‌ ప్రారంభించాలి అనుకుంటున్న వారిలో కొందరికైనా తన అనుభవం ఉపయోగపడుతుందనే ఆలోచనతో రక్షన్‌ ఐఏఎస్‌ అకాడెమీ ప్రారంభించిన ఆమెతో మానవి సంభాషణ…

మీ కుటుంబ నేపధ్యం?
నాన్న పేరు వెంకయ్య, డీజీపీ ఆఫీస్‌లో కార్యనిర్వాహక అధికారిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. నాన్న పనితీరును గుర్తించిన ప్రభుత్వం రిటైర్‌ అయిన తర్వాత కూడా ఆయన సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికీ డీజీపీ ఆఫీసులోనే పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి. నేను కాకతీయ మెడికల్‌ కాలేజ్‌లో 2009 నుండి 2015 వరకు మెడిసెన్‌ పూర్తి చేశాను.

మెడిసెన్‌ చేస్తున్న మీరు సివిల్స్‌ వైపుకు ఎందుకు వచ్చారు?
మొదట్లో ఇనిస్టిట్యూషన్‌ పెట్టాలనే ఆలోచనే లేదు. హౌస్‌ సర్జన్‌ చేస్తున్నప్పుడు నా ఇంటెర్నిషిప్‌లో భాగంగా గ్రామాలకు వెళ్లాను. అక్కడ గ్రామ ప్రజలను కలిసినప్పుడు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? వాళ్ల కష్టాలు పరిష్కరించాలంటే ఏం చేయాలి? అనేది ఆలోచించాను. సాధారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు అందరికీ వస్తూనే ఉంటాయి.

అయితే ప్రభుత్వం వీరి కోసం ఏం చేస్తోంది అనే ఆలోచనలు నాలో మొదలయ్యాయి. నాకు మొదటి నుండి సమాజ సేవ చేయడమంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డాక్టర్‌ కంటే ఐఏఎస్‌ అయితే మంచిది, చేతిలో అధికారం ఉంటే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలవు అన్నారు. దాంతో సివిల్స్‌కి ప్రిపేర్‌ అయ్యాను.

ఐఏఎస్‌ స్టడీ ఇనిస్టిట్యూట్‌ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?
నేను సివిల్స్‌ సాధించలేకపోయాను, కానీ నా ప్రిపరేషన్‌ అనుభవంతో ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించాను. 2023లో మొదటగా రామోజీ ఫిల్మ్‌ సిటీ దగ్గర ఫెమ్‌ పవర్‌ ఐఏఎస్‌ అకాడెమీ పేరుతో ప్రారంభించాను. అది కేవలం అమ్మాయిల కోసమే వసతి గృహంతో పాటు మొదలు పెట్టాను. ఏడాదికి తొంభై మంది విద్యార్థులు అందులో ఉండేవారు. మొదటి బ్యాచ్‌లోనే 183 మందిని చేర్చుకోగలిగాను. దీని కోసం చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేసాను. అయితే దీన్ని ప్రారంభించి నప్పుడు నాతో పాటు భాగస్వాములు కూడా ఉన్నారు.

ప్రిపరేషన్‌లో నేను చూసిన విజన్‌ వారికి ఉండేది కాదు. దాంతో నేను తీసుకున్నంత బాధ్యత వారు తీసుకోలేకపోయేవారు. నన్ను నమ్ముకొని వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకూడదు. అందుకే అశోక్‌నగర్‌లో నేనే సొంతంగా అదే పేరుతో ఇనిస్టిట్యూట్‌ ప్రారంభించాను. ఇక్కడకు వచ్చాక అమ్మాయిలను మాత్రమే కాకుండా మగపిల్లలను కూడా చేర్చుకోండి అంటూ చాలా మంది అభ్యర్ధించడం మొదలు పెట్టారు. అప్పుడు ఇనిస్టిట్యూట్‌ పేరు రక్షన్‌ ఐఏఎస్‌ అకాడమీ అని మార్చుకున్నాను.

మీ దగ్గర కోచింగ్‌ తీసుకున్నవారు సివిల్స్‌లో సెలెక్ట్‌ అయ్యారా?
ఇప్పటివరకు 12 మంది సెలెక్ట్‌ అయ్యారు. గ్రూప్‌ 1 రాసిన వాళ్ళు 18 మంది సెలెక్ట్‌ అయ్యారు.

విద్యార్థుల్లోని ఒత్తిడిని నియంత్రించడం కోసం ఏం చేస్తారు?
ముందుగా ఇక్కడకు వచ్చే ప్రతి విద్యార్థికి ఈ చదువుల ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఐఏఎస్‌ అంటేనే పోటీ ఎక్కువ ఉంటుంది. చాలా సీరియస్‌గా ప్రిపేర్‌ కావల్సి ఉంటుంది. అందుకే వాళ్లను ముందుగానే మానసికంగా సిద్ధం చేస్తాను. అయితే ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉంటే వత్తిడికి గురవుతారు. కనుక ప్రతి రోజూ మేము ఇచ్చే టార్గెట్స్‌ని పూర్తి చేస్తే వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మ విశ్వాసమే ఒత్తిడిని తగ్గిస్తుంది.

మేము పెట్టె పరీక్షలో సమాధానం తప్పు రాసి ఒత్తిడిని పెంచుకునే కంటే, ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఫైనల్‌ పరీక్షల్లో బాగా రాయగలరు అనే నమ్మకాన్ని వాళ్లలో కల్పించేందుకు ప్రయత్నిస్తాము. మరొక విషయం ఏమిటంటే ఐఏఎస్‌లో సక్సెస్‌ అనేది అంత తేలిగ్గా, తొందరగా వచ్చేది కాదు. దీనికి ఎంతో ఓపిక ఉండాలి. ఈ నిజాన్ని గుర్తించిన నాడు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒత్తిడిని తగ్గించుకుంటే విజయం మీదే.

మీ దగ్గర ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు?
ప్రస్తుతం నా దగ్గర ఎనిమిది మంది ఉన్నారు. ప్రస్తుతం గ్రూప్‌ 1 క్లాసులు నడుస్తున్నాయి. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. కొన్ని క్లాసులు నేనే స్వయంగా తీసుకుంటాను. సబ్జెక్ట్‌ పరంగా విద్యార్థులు ఒక బ్యాచ్‌గా ఉంటారు. అందులో 30 మంది ఉండొచ్చు, 90 మంది ఉండొచ్చు. ఒక బ్యాచ్‌లో ఇంతమంది అని చెప్పలేము. నేను ఎంతవరకు కష్టపడగలనో అంత వరకు కష్టపడతాను. నేను సాధించ లేకపోయినా, నా అకాడెమీ ద్వారా సివిల్స్‌ ఎంతమందో సాధించాలని నా ఆకాంక్ష.

సివిల్స్‌ రాయడానికి కావలసిన విద్యార్హత?
ఎవరైతే మేము సివిల్స్‌కి ప్రిపేర్‌ కావాలి అనుకుంటారో వారు డిగ్రీలో దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్‌ ఎంచుకుని చదవితే మంచిది. ఉదాహరణకి పబ్లిక్‌ అడ్మిస్ట్రేషన్‌, సోషియోలజీ, ఆంత్రోపాలజీ, హిస్టరీ, జాగ్రఫీ ఈ సబ్జెక్టులు తీసుకుని చదివితే కనుక కొంచం ఈజీ అవుతుంది. అదే నాలాగా మెడిసెన్‌ చదివి అప్పుడు సివిల్స్‌ రాయాలి అనుకుంటే వాళ్లకు ఈ సబ్జెక్ట్స్‌ కొత్తగా ఉంటాయి.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -