Sunday, July 6, 2025
E-PAPER
Homeసినిమాఅలాంటి వారికి కనువిప్పు..

అలాంటి వారికి కనువిప్పు..

- Advertisement -

ఎంసెట్‌, ఐఐటీల్లో ర్యాంకుల సాధనే లక్ష్యంగా సాగుతున్న కాలేజీల తీరు వల్ల, పిల్లల ఆసక్తిని పట్టించు కోకపోగా, వారిపై మితి మీరిన అంచనాలు పెట్టు కుంటున్న తల్లిదండ్రుల తీరు వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఎంతో మంది స్టూడెంట్స్‌ ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనాన్ని నిత్యమూ మనం వింటూనే ఉన్నాం. అయినప్పటికీ అటు తల్లిదండ్రుల్లోను, ఇటు కాలేజీ యాజమాన్యాల్లోనూ ఎటువంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం. అలాంటివారికి కను విప్పు కలిగేలా ‘ఎఐఆర్‌’ (ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌) వెబ్‌ సిరీస్‌ రూపొందిందా.. లేదా చూద్దాం.
అర్జున్‌ (హర్ష రోషన్‌), ఇమ్రాన్‌ (భాను ప్రకాష్‌), రాజు (జయతీర్థ) విజయవాడ సమీపంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. ఒకరితో ఒకరికి పరిచయం లేని వీరు విజయవాడలోని ‘ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’ కాలేజీలో ఐఐటీ ఇంటిగ్రేటెడ్‌ ఇంటర్‌లో జాయిన్‌ అవుతారు. క్షణం తీరికలేకుండా చెప్పే క్లాసుల వల్ల వీళ్ళకి అక్కడ చదవడం కష్టమని అర్థమవుతుంది. దీంతో
ఆ కాలేజీ నుంచి పారిపోవాలని పలు ప్రయత్నాలు చేసి ఫెయిల్‌ అవుతారు.
ఈ క్రమంలో వాళ్ళు ఓ తప్పు చేస్తారు.
ఆ తప్పు వల్ల వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేదే ఈ వెబ్‌సిరీస్‌. 7 ఎపి సోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌ ఈటీవీ విన్‌లో ఇటీవల విడుదలైంది.
పిల్లల ఆసక్తిని పట్టించుకోని తల్లిదండ్రులను, శక్తికి మించి అప్పులు చేసీ మరీ కాలేజీల్లో జాయిన్‌ చేసే తల్లిదండ్రులను, పబ్లిసిటీ జిమ్మిక్కులతో కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు చేసే మాయలు, ఫీజలు కట్టలేని పేరెంట్స్‌లో వాళ్ళు వ్యవ హరించే తీరు, చదవ లేక తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మ హత్యలు చేసుకునే స్టూడెంట్స్‌, కులాలు, హీరోల కోసం గొడవపడే సూడెంట్స్‌.. ఇలా అన్నింటినీ దర్శకుడు చూపించిన తీరు ఆద్యంతం ఆకట్టు కుంటుంది. అలాగే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య జరిగే సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగాయి. ఈ సిరీస్‌ చూస్తున్నంత సేపూ మనకీ కాలేజీ రోజులూ గుర్తొస్తాయి. కాలేజీ యజమానికిగా సునీల్‌, కాలేజీ హెడ్‌గా దర్శకుడు సందీప్‌రాజ్‌, స్టూడెంట్స్‌గా హర్ష రోషన్‌, భాను ప్రకాష్‌, జయతీర్థ నటన బాగుంది. సంగీతం, ఎడిటింగ్‌, కెమెరా పనితనం సిరీస్‌కి హైలెట్‌గా నిలిచాయి.

– రెడ్డి హనుమంతరావు
నటీనటులు
హర్ష రోషన్‌, భాను ప్రకాష్‌, జయతీర్థ, సునీల్‌, వైవా హర్ష, చైతన్యరావు, సందీప్‌రాజ్‌, రమణ భార్గవ్‌, సమీర్‌, అక్షర.
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం : జోసెఫ్‌ క్లింటన్‌
నిర్మాతలు : సందీప్‌ రాజ్‌, సూర్యవాసుపల్లి
సంగీతం : అన్వీ
కెమెరా : ఎస్‌.ఎస్‌.మనోజ్‌
ఎడిటింగ్‌ : శ్రీకాంత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -