Friday, April 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇంత అల్పత్వమా..!

ఇంత అల్పత్వమా..!

- Advertisement -

కేరళ ఎన్నికల ప్రచారం ఈసారి ఒక అసాధారణ, విచిత్ర రాజకీయ ప్రదర్శనగా మారింది. విధానాలు, అభివృద్ధి నమూనాలు, ప్రజా సమస్యలపై సీరియస్‌ చర్చలు జరగాల్సిన వేదిక.. ఇప్పుడు ”వింత సూత్రీకరణల సర్కస్‌”గా మారిపోవడం విస్తుగొలుపుతోంది. ఈ సర్కస్‌లో పుట్టిన తాజా సూత్రం ”ఎల్డీఎఫ్+బీజేపీ = రెండూ ఒకటే!” ఈ మహత్తర సూత్రావిష్కరణకు శిల్పులుగా నిలిచిన రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి గార్లు, రాజకీయ తత్వశాస్త్రానికే కొత్త నిర్వచనం రాస్తున్నామన్న భ్రమల్లో ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. మార్క్స్‌ నుంచి లెనిన్‌ వరకు, అంబేద్కర్‌ నుంచి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు.. మహామహులెవరికీ సాధ్యంకాని రీతిలో ”విరుద్ధాలను సమానాలుగా” ప్రకటించే వీరి ”వింత గణితం” నిజంగా ఆశ్చర్యమే! ఆశ్చర్యమే కాదు, వారి అల్పత్వానికీ నిదర్శనం.

వీరి రాజకీయ గణిత సూత్రం ప్రకారం.. అగ్గి రాజేసినవాడూ, దాన్ని ఆర్పేవాడూ ఒకటేనట. ఇదే ఈ కొత్త రాజకీయ తర్కం! ఈ తర్కాన్ని ఇంకాస్త సూటిగా చెప్పాలంటే, ”ఎల్డీఎఫ్‌కు ఓటేస్తే బీజేపికి వేసినట్టే” అన్న నినాదంగా మార్చేశారు. అంతటితో ఆగకుండా ఈ వింత గణితాన్ని వ్యక్తులకూ విస్త రించి ”మోడీకి విజయన్‌కు తేడాలేదు” అనేదాకా చేరుకున్నారు. ఇదివింటే నవ్వొస్తుంది, కానీ విచిత్రంగా ఇదే ఇప్పుడు తీవ్రమైన రాజకీయ వాదనగా వినిపిస్తోంది. ఒకవైపు బీజేపీని మత రాజకీయాల కేంద్రంగా చూపిస్తూ, మరోవైపు ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరంతరం నిబద్ధతతో పోరాడుతున్న ఎల్డీఎఫ్‌ను కూడా అదే గాడిన కట్టడం అంటే, వాస్తవానికి అద్దం పట్టడం కాదు, అద్దాన్నే వంకరగా తిప్పడం. ఈ వంకర అద్దంలో చూస్తే నిజం కూడా అబద్ధంలా కనిపిస్తుంది. బహుశా అదే వీరి సరికొత్త రాజకీయ గణితశాస్త్ర పరమార్థం కాబోలు!

రాహుల్‌గాంధీ గారైనా, రేవంత్‌రెడ్డి గారైనా చెప్పే ఈ ”ఎల్డీఎఫ్‌ – బీజేపీ” సమీకరణం, వాస్తవానికి వారి రాజకీయ బలహీనతను దాచుకునే ఒక దిగజారుడు వ్యూహం మాత్రమే. ఎందుకంటే కేరళలో ఎల్డీఎఫ్‌ (Left Democratic Front) నిర్మించిన అభివృద్ధి నమూనాను.. విద్య, వైద్యం, సామాజిక భద్రత, స్థానిక ఆర్థిక వ్యవస్థలలో సాధించిన ప్రగతిని చర్చించడానికి వారు సిద్ధంగా లేరు, చర్చించి గెలవలేరు కూడా. అందుకే ఈ విధమైన వక్రీకరణలకు పాల్పడుతున్నారు. ఈ సూత్రీకరణను నిజంగానే అంగీకరిస్తే, దాని తుదిఫలితం ప్రమాదకరంగా ఉంటుంది. మతతత్వాన్ని ప్రోత్సహించే శక్తి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి, ఈ రెండూ ఒకటే అయితే, ఇక రాజకీయ విధానాలకే అర్థం ఉండదు. పోరాటాలకు విలువ ఉండదు. సిద్ధాంతాలకు ప్రాముఖ్యత ఉండదు. అందువల్ల ఇది కేవలం ఒక తప్పుడు పోలిక మాత్రమే కాదు, ఒక చారిత్రక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్‌ ‘మహా మేధావుల’ వైఫల్యం. లేదంటే ఆ సత్యాన్నే చెరిపేయాలనే ప్రమాదకర ప్రయత్నం. అంతిమంగా ఇది ఎవరికి లాభం? నిస్సందేహంగా బీజేపీకే లాభం.

ఎందుకంటే, ప్రత్యామ్నాయాన్ని మసక బారిస్తే ప్రజలముందు ఎంపికలే మాయమవుతాయి. కానీ, ప్రజాస్వామ్యంలో ఈ తప్పుడు వాదనలు ఎప్పటికీ నిలబడవు. ఎందుకంటే.. రెండు పరస్పర వ్యతిరేక ధ్రువాలను ఒకటిగా చూపడం తర్కం కాదు, మోసం. ఎల్డీఎఫ్‌, బీజేపీల మధ్య ఉన్న వ్యత్యాసం సాధారణ విధాన భేదం కాదు, అది సిద్ధాంతపరమైన విరోధం. వర్గ పోరాటం, లౌకికత్వం, సమానత్వం, సామాజిక న్యాయం ఎల్డీఎఫ్‌ విధానాలకు ఆధారం. మతాధారిత జాతీయత, సాంస్కృతిక ఆధిపత్యం, విభజన రాజకీయాలు, కార్పొరేట్‌ అనుకూల విధానం బీజేపీది. ఆరెస్సెస్‌ హిందూత్వ భావజాలానికి రాజకీయ ప్రతినిధి బీజేపీ. దానికి ప్రత్యామ్నాయమైన సామ్యవాద భావజాలానికి ప్రతినిధి ఎల్డీఎఫ్‌. ఇవి రెండు విధానాలు మాత్రమే కావు-రెండు విరుద్ధ దిశలు. రెండూ ఒకటేనని చెప్పడమంటే.. విషాన్నీ ఔషధాన్ని సమానమని చెప్పడమే. ఈ మాత్రం సోయిలేని నేతలు దేశానికి ప్రత్యామ్నాయం నిర్మిస్తారట! కేరళం ప్రజలు ఇది తెలుసుకోలేనంత అమాయకులను కోవడం కాంగ్రెస్‌ నేతల అవివేకం.

అందుకే వారి రాజకీయ చైతన్యాన్ని అవమానించే దుస్సాహసానికి పూనుకుంటున్నారు. కేరళంలో లెఫ్ట్‌ విధానం ఇప్పటిది కాదు. ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ కాలం నుండీ ఒక ప్రత్యామ్నాయ విధానంతో నిర్మించిన ప్రజా నమూనా అక్కడ అమలవుతోంది.విజయన్‌ దాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఎల్డీఎఫ్‌ పాలనలో కేరళ సమాజం ఒక స్పష్టమైన అభివృద్ధిని చూసింది. ప్రభుత్వవిద్యలో నాణ్యత, వైద్యంపై నమ్మకం, సామాజిక భద్రత ద్వారా భరోసా, స్థానిక ఉపాధి అవకాశాల్లో స్థిరత్వం, సామరస్యం-సమతాభావం, నిజాయితీ నిబద్ధతతో కూడిన పాలన.. ఇవన్నీ కేవలం విధానాలుగా కాదు, ప్రజల జీవితాల్లో అనుభవాలుగా నిలిచాయి. ఆ అనుభవాన్ని తప్పుడు సూత్రాలతో చెరిపేయ లేరు. జీవితం నేర్పిన సత్యాన్ని వీరి అబద్ధాల రాజకీయ గణితం మార్చలేదు. ”విరుద్ధాలు ఎప్పటికీ సమానాలు కావు” అనే సార్వత్రిక సత్యం కేరళం ప్రజలకు బాగా తెలుసు. అయినా రాహుల్‌, రేవంత్‌ లాంటి మరుగుజ్జులు తిమ్మిని బమ్మిగా మార్చి ప్రచారం చేద్దామనుకుంటే చెల్లదు. కాంగ్రెస్‌ లా ఎన్నికల కోసం వామపక్షాలు తమ విధానాలు మార్చుకోవు. అసత్యాలూ అర్థసత్యాలు వల్లించవు. గెలిచినా, ఓడినా విధానమే వెన్నెముకగా సత్యం కోసం నిలబడే బలం కమ్యూనిస్టులది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -