సర్వీసు అనంతరం అవకాశాలపై సందేహం
అగ్నివీరుల మనోగతం
న్యూఢిల్లీ : సాయుధ దళాలలో స్వల్ప కాలిక సేవల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకంపై ఇటీవల నిర్వహించిన ఓ సర్వే అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది. పని ఒత్తిడి అధికంగా ఉంటోందని 72 శాతం మంది అగ్నివీరులు వాపోతున్నారు. ఈ పథకాన్ని ప్రతిపక్షాలతో పాటు యువత కూడా తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. డాక్టర్ శర్మిష్ట సోలంకీ పర్యవేక్షణలో ఎంఎస్ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థి మనీష్ జంగిడ్ ఈ సర్వేను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 50 మంది అగ్నివీరులను ఆయన సర్వే చేశారు. పని ఒత్తిడితో సతమతమవుతున్నామని వారిలో సుమారు మూడో వంతు మంది ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయోనని 52 శాతం మంది ఆందోళన చెందుతున్నారు. అగ్నిపథ్ పథకంపై 60 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేయడం గమనార్హం. నాలుగు సంవత్సరాల సర్వీసు పూర్తయిన తర్వాత దీర్ఘకాలం పనిచేయాలని 54 శాతం మంది కోరుకుంటుంటే 26 శాతం మంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శిక్షణలో నాణ్యతపై 38 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 40 శాతం మంది పెదవి విరిచారు. 22 శాతం మంది ఎటూ చెప్పలేదు. పని ఒత్తిడి ఉన్నదని అగ్నివీరులు కుండబడ్దలు కొట్టారు. 48 శాతం మంది ఓ మాదిరి పని ఒత్తిడికి గురవుతున్నామని చెప్పగా 26 శాతం మంది అది అధికంగా ఉన్నదని చెప్పారు. 12 శాతం మంది మాత్రమే పని ఒత్తిడి లేదని తెలిపారు. సర్వీసు కాలాన్ని నాలుగు సంవత్సరాలకే కుదించడంతో ఉద్యోగంలో సంతృప్తి లోపించిందని మెజారిటీ అగ్నివీరులు అన్నారు. సర్వీసు అనంతరం ఉద్యోగావకాశాలపై 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా ఎనిమిది శాతం మంది తీవ్రంగా కలత చెందుతున్నారు. 34 శాతం మంది మాత్రం ఆశాభావంతో ఉన్నారు.
పని ఒత్తిడితో సతమతం
- Advertisement -
- Advertisement -



