నవతెలంగాణ – శంకరపట్నం
జీవితం ఒక ప్రయాణం. ఇందులో సుఖాలు, సంతోషాలు ఉన్నట్లే, కష్టాలు, సవాళ్లు కూడా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఒత్తిడి, ఒంటరితనం, కుటుంబ సభ్యుల ప్రేమకు దూరం కావడం… ఇలాంటి కారణాల వల్ల కొందరు ఆత్మహత్య అనే తీవ్రమైన నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు, అది కేవలం బాధను అంతం చేస్తుంది తప్ప, సమస్యను కాదు అని శంకరపట్నం స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య ఆలోచనతో ఉన్న వారిని గుర్తించడం చాలా ముఖ్యం.
ఎవరైనా ఒంటరిగా ఉంటున్నా, చావు గురించి మాట్లాడుతున్నా.. నిరాశగా, దుఃఖంగా ఉన్నా, లేదా ఆత్మహత్యకు సంబంధించిన వస్తువులను సమకూర్చుకుంటున్నా… వెంటనే అప్రమత్తం కావాలి. కుటుంబ సభ్యులు వారిని ప్రేమగా పలకరించాలి, దగ్గరకు తీసుకోవాలి, మానసిక వైద్యులను సంప్రదించాలి. సరైన సమయంలో కౌన్సెలింగ్, మెడిటేషన్, మరియు కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు లభిస్తే, ఎంతో మందిని కాపాడుకోవచ్చు.ఆత్మహత్యకు పాల్పడే వారిలో రెండు రకాలు ఉంటారు. కొంతమంది క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వారిని ఆ సమయంలో ఆపగలిగితే, తర్వాత వారు తమ నిర్ణయం పట్ల పశ్చాత్తాపపడతారు. ఇక రెండో రకం… డిప్రెషన్ లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడేవారు. వీరిని ముందుగానే గుర్తించి, కౌన్సెలింగ్ లేదా సరైన మందుల ద్వారా రక్షించుకునే అవకాశం ఉంది.
సమస్యలు ఉన్నప్పుడు మనమే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. మానసికంగా, శారీరకంగా ధైర్యం తెచ్చుకొని, సమస్యను ఎలా అధిగమించాలో ఆలోచించాలి. సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టి జీవితాన్ని ముందుకు నడిపించాలి. ఆత్మహత్యలు ఏ వర్గానికో, ఏ వృత్తి వారికో పరిమితం కాదు. ధనికులు, పేదవారు, విద్యార్థులు, యువత… ఇలా అందరిలోనూ ఈ ఆలోచన కనిపిస్తోంది. ముఖ్యంగా పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలి. యువతకు కూడా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. అలాగే, కుటుంబంలో తలెత్తే గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే, పిల్లలు ధైర్యంగా వారిని మానసిక వైద్యులను సంప్రదించమని చెప్పగలగాలి. జీవితం ఎంతో విలువైనది. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కాబట్టి, సమస్యల ముందు తలవంచకుండా, ధైర్యంగా నిలబడితే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చని ఎస్సై తెలిపారు.
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు: ఎస్సై శేఖర్ రెడ్డి
- Advertisement -
- Advertisement -



