మానసిక ఆరోగ్యంపై టీచర్లకు అవగాహన కల్పించాలి
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ : సభ్య కార్యదర్శి డాక్టర్ సంజీవ్ శర్మ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశవ్యాప్తంగా పిల్లల్లో ఆత్మహత్యలు పెరిగాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ సభ్య కార్యదర్శి డాక్టర్ సంజీవ్ శర్మ తెలిపారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చి వెళ్లిన తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. దీంతో పోస్ట్ కోవిడ్ కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. జాతీయ బాలల హక్కుల కమిషన్, రాష్ట్ర విద్యాశాఖ సంయుక్తాధ్వర్యంలో సోమవారం బాలల హక్కులపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ శర్మ మాట్లాడుతూ తమ వద్దకు వస్తున్న చిన్నారుల కేసుల్లో ఒక్కో కేసు ఒక్కో కుటుంబం, ఆ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న కథలను చెబుతున్నాయన్నారు.
మునపటి తరంలోని పిల్లల మాదిరిగా నేటి తరం పిల్లల పరిస్థితి లేదని చెప్పారు. మారిన పరిస్థితులను గమనించాలని కోరారు. కమిషన్ 26 వేల బాలల హక్కుల ఉల్లంఘన కేసులను పరిష్కరిం చిందనీ, 2,800 మంది బాలలకు రక్షణ కల్పించిందనీ, 1,800 మంది పిల్లలను వారి సొంత జిల్లాలకు చేర్చిందని తెలిపారు. పిల్లల్లో ఆరోగ్య అవగాహన కల్పించే షుగర్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రయివేటు స్కూళ్లను తనిఖీ చేయండి
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కె.సీతాదయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు పాఠశాలల్లో తగినంతగా తనిఖీలు చేయాలని కోరారు. అవసరమైన వసతులు లేకుండా అదేపనిగా అనుమతులివ్వడం సరికాదని తెలిపారు.
తెలంగాణ విద్యా కమిషన్ గౌరవ సలహాదారు ఆర్.వెంకటరెడ్డి మాట్లాడుతూ పిల్లలు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంలో మనమంతా తోడుగా ఉందామని పిలుపునిచ్చారు. పిల్లల కోసం పెద్దలు మారాలని సూచించారు. పాఠశాల నిర్వచనాన్ని మార్చాలనీ, కేవలం నేర్చుకునే చోటుగానే కాకుండా భద్రతనిచ్చేదిగా నూతన సామాజిక నియమాలతో అభివద్ధి చేయాలని కోరారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ హెల్త్ అండ్ సైకాలజీ సీనియర్ ఎక్స్‌పర్ట్ శాయిస్తా కె.షా మాట్లాడుతూ విద్యాభ్యాసం బాలల ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుచేశారు. ఆ దిశగా వారిని తీర్చిదిద్దాలని కోరారు. ఈ సదస్సులో సమగ్ర శిక్ష స్టేట్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చందన, సరిత, వచన్ కుమార్, ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్త్, రిటైర్డ్ జస్టిస్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



