ఆటపాటలతో పాఠాలు…
ఎంఈవో ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట: ప్రభుత్వాలు మారితే విధానాలు మారతాయి. విధులు మారతాయి. విధి విధానాలు ఏవైనా ప్రజా ప్రయోజనం కోసం అయితేనే ఆదరణ పొందుతాయి. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వేసవి సెలవులు అయినప్పటికి విద్యార్ధుల్లో పఠనాసక్తి, చదువుపై దృష్టి మరల్చడానికి మండలానికి కొన్ని పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మండలంలో అశ్వారావుపేట, నారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసి వేసవి శిబిరాలను సోమవారం ప్రారంభించామని ఎంఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ ఉచిత వేసవి శిక్షణా శిబిరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పరుచూరి హరిత, పద్మావతిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఉచిత శిక్షణా శిబిరం మే 5 వ తేదీ నుండి మే 22 వ తేదీ వరకు నిర్వహించబడుతుంది అని, ఇందులో ఇండోర్, ఔట్ డోర్ ఆటలు, యోగా, మాల్గుడి కథలు, పెయింటింగ్, వివిధ రకాల కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై శిక్షణ ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు ఈ శిక్షణా శిబిరాన్ని వినియోగించుకోవచ్చునని అన్నారు. ఈ శిక్షణ ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహించబడుతుంది అని , శిక్షణా శిబిరంలో పాల్గొన్న వారికి అల్పాహారం కూడా ఏర్పాటు చేయబడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఊడల కిషోర్,సీ హెచ్ నర్సింహారావు, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండలరావు, పి.ఇ.టి రాజు, సి.ఆర్.పిలు ప్రభాకరాచార్యులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.