నవతెలంగాణ లైబ్రేరియన్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ సభలో వక్తలు
ఘనంగా వీడ్కోలు
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
‘గ్రంథాలయమంటే కేవలం ఒక గది కాదు.. అది విజ్ఞాన గని.. పుస్తకాల నిధి’ అని నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్, బుకహేౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి వ్యాఖ్యానించారు. అలాంటి పుస్తకాలను లైబ్రేరియన్ టి.సునీత సొంత బిడ్డలా చూసుకున్నారని వారు ప్రశంసించారు. ప్రజాశక్తి, నవతెలంగాణ దినపత్రికల్లో సుదీర్ఘకాలం సేవలందించిన లైబ్రేరియన్ సునీత స్వచ్చంద పదవీ విరమణ చేశారు. 2003 నుంచి 2026 వరకు సమర్థవంతంగా ఆమె తన సేవలందించారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం ఎమ్‌హెచ్ భవన్‌లో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు.
మొఫిసల్ ఇంచార్జి జి.వేణు మాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎడిటర్ రాంపల్లి రమేశ్ మాట్లాడుతూ.. లైబ్రేరియన్‌గా సునీత ఎంతో నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడైన తన తండ్రి వెంకటరెడ్డి అడుగు జాడల్లో నడిచి, ఆయనిచ్చిన స్ఫూర్తితో పత్రికకు ఎంతోకాలం సేవలందించారని చెప్పారు. వ్యక్తిగత, కుటుంబ బాధ్యతల రీత్యా ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ బాధ్యతలకు పూర్తి న్యాయం చేయాలని ఆకాంక్షించారు. ఆనందాచారి మాట్లాడుతూ… ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుతం సమాజం, కుటుంబాల పరిస్థితులు పూర్తిగా చిన్నాభిన్నమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ అవసరాలరీత్యా ఉద్యోగ విరమణ చేయటం ద్వారా… కుటుంబ, మానవతా విలువలు ఇంకా మిగిలే ఉన్నాయనే విషయాన్ని సునీత చాటి చెప్పారని అన్నారు. తద్వారా సమాజంలో కుటుంబం కూడా ఒక భాగమేనన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారని కితాబిచ్చారు.
నవతెలంగాణ హెచ్‌ఆర్ జనరల్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, స్టేట్ బ్యూరో చీఫ్ బివిఎన్ పద్మరాజు, స్పెషల్ కరస్పాండెంట్ బి.బసవపున్నయ్య, బోర్డు సభ్యులు కె.ఎన్.హరి, అనంతోజు మోహనకృష్ణ, సలీమా తదితరులు, సహచర ఉద్యోగులు, సిబ్బంది సునీతతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. వృత్తిలో ఆమె చూపిన ప్రతిభను గుర్తుచేసుకున్నారు. సునీత మాట్లాడుతూ.. ప్రజాశక్తి, నవతెలంగాణతో తన బంధం వీడదీయలేనిదని చెప్పారు. తన పట్ల సంస్థ చూపిన ఆదరణ, ఆప్యాయత, గౌరవ మర్యాదలు చిరకాలం గుర్తుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాంపల్లి రమేశ్, ఆనందాచారి, వేణుమాధవ్, ఇతర ఉద్యోగులు సునీతకు, ఆమె భర్త భాస్కరరెడ్డికి జ్ఞాపికను అందజేసి శాలువతో సత్కరించారు. అలాగే తోటి ఉద్యోగులు మెమోంటోతో సన్మానించారు. కార్యక్ర మంలో సునీత కుమార్తె నైమిష, కుమారుడు విపిన్ తదితరులు పాల్గొన్నారు.



