Friday, April 3, 2026
E-PAPER
Homeఆటలుసన్‌రైజర్స్‌ సూపర్‌

సన్‌రైజర్స్‌ సూపర్‌

- Advertisement -

65 పరుగులతో కోల్‌కతాపై గెలుపు
సమిష్టిగా విజృంభించిన బౌలర్లు
సన్‌రైజర్స్‌ 226/8, నైట్‌రైడర్స్‌ 161/10

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. ప్రియ ప్రత్యర్థి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. బ్యాటర్లు, బౌలర్లుగా రాణించటంతో ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. అభిషేక్‌ శర్మ (48), ట్రావిశ్‌ హెడ్‌ (46), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) సహా హెన్రిచ్‌ క్లాసెన్‌ (52) రాణించటంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలుత 226 పరుగులు చేసింది. బౌలర్లు జైదేవ్‌ ఉనద్కత్‌ (3/21), ఈషన్‌ మలింగ (2/14), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1/17) విజృంభించగా 16 ఓవర్లలో 161 పరుగులకు కోల్‌కతా కుప్పకూలింది. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ‘ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

నవతెలంగాణ-కోల్‌కతా
ఐపీఎల్‌ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయం సాధించింది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. 227 పరుగుల ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చతికిల పడింది. 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. యువ బ్యాటర్‌ రఘువంశీ (52, 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పోరాడాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లు సమిష్టిగా రాణించటానికి తోడు నైట్‌రైడర్స్‌ బ్యాటర్ల దూకుడు ఆ జట్టును ఓటమి బాటలో నడిపించింది. జైదేవ్‌ ఉనద్కత్‌, ఈషన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలు ద్వితీయార్థంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కకావికలం చేశారు. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ (28, 7 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే ఊచకోత కోశాడు.

రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో దండయాత్ర చేశాడు. కానీ, అలెన్‌ ఫిన్‌ రెండో ఓవర్లోనే వికెట్‌ కోల్పోయాడు. అజింక్య రహానె (8), కామెరూన్‌ గ్రీన్‌ (2), అనుకూల్‌ రాయ్ (0), రమణ్‌దీప్‌ సింగ్‌ (10), సునీల్‌ నరైన్‌ (12) నిరాశపరిచారు. రింకు సింగ్‌ (35, 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆఖర్లో ఆశలు రేపినా.. నితీశ్‌ కుమార్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో నైట్‌రైడర్స్‌కు రెండో ఓటమి కాగా.. సన్‌రైజర్స్‌కు రెండింట ఇది తొలి విజయం. అంతకుమందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (52, 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో మెరువగా.. అభిషేక్‌ శర్మ (48, 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రావిశ్‌ హెడ్‌ (46, 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ దంచికొట్టారు. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39, 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఓపెనర్ల ఊచకోత!
సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ఫామ్‌లోకి రావటంతో నైట్‌రైడర్స్‌ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ట్రావిశ్‌ హెడ్‌ (46, 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (48, 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) పవర్‌ప్లేలో చెలరేగారు. వైభవ్‌ అరోరా ఓవర్లో హెడ్‌ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఊచకోత షురూ చేశాడు. వరుణ్‌ చక్రవర్తి ఓవర్లో అభిషేక్‌ వర్మ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో మెరవటంతో ఐదు ఓవర్లలోనే హైదరాబాద్‌ 71/0 పరుగులు చేసింది. అర్థ సెంచరీ ముంగిట హెడ్‌ నిష్క్రమించినా పవర్‌ప్లేను సన్‌రైజర్స్‌ 84/1తో అద్భుతంగా ముగించింది. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో జోరందుకున్న అభిషేక్‌ అర్థ సెంచరీకి చేరువైనా.. ముజరబాని ఒకే ఓవర్లో అభిషేక్‌ సహా కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (14)ను అవుట్‌ చేశాడు. 8 ఓవర్లలోనే 110/1తో భారీ స్కోరు దిశగా సాగుతున్న సన్‌రైజర్స్‌కు ముజరబాని బ్రేక్‌ వేశాడు. తొమ్మిదో ఓవర్‌ నుంచి పరుగుల వేట నెమ్మదించింది.

క్లాసెన్‌ అర్థ సెంచరీ
అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌కు తోడు అనికెత్‌ వర్మ (1) డగౌట్‌కు చేరటంతో హెన్రిచ్‌ క్లాసెన్‌ (52) సహజశైలిలో ఆడలేదు. ఇన్నింగ్స్‌ ఆఖరు వరకు క్రీజులో నిలువటంపై దృష్టి నిలిపిన క్లాసెన్‌.. ఆచితూచి ఆడాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39)తో కలిసి విలువైన భాగస్వామ్మం నిర్మించాడు. 1 ఫోర్‌, 4 సిక్స్‌లు కొట్టిన నితీశ్‌.. ఆఖర్లో వికెట్‌ కోల్పోయాడు. అర్థ సెంచరీ తర్వాత క్లాసెన్‌ అవుటైనా.. హర్ష్‌ దూబె (9 నాటౌట్‌), శివాంగ్‌ కుమార్‌ (4) ముగింపు అందించారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు సన్‌రైజర్స్‌ 226 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్లలో బ్లెస్సింగ్‌ ముజరబాని (4/41) నాలుగు వికెట్లు పడగొట్టగా.. వైభవ్‌ అరోరా (2/47), కార్తీక్‌ త్యాగి (1/48), అనుకూల్‌ రాయ్ (1/16) రాణించారు.

బౌలర్లు అదుర్స్‌
సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఎంత బలంగా ఉందో.. బౌలింగ్‌ విభాగం అంత బలహీనంగా ఉంది. భారీ స్కోర్లను సైతం కాపాడుకోలేని పేస్‌, స్పిన్‌ విభాగం సన్‌రైజర్స్‌ది. కానీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్‌ బౌలర్లు సమిష్టిగా మెరిశారు. అరంగ్రేటంలోనే శివాంగ్‌ కుమార్‌ (0/41) 8 డాట్‌ బాల్స్‌తో బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. పవర్‌ప్లేలో పరుగులు ఇచ్చినా.. ద్వితీయార్థంలో మ్యాచ్‌ను గుప్పిట పట్టారు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఈషన్‌ మలింగ, జైదేవ్‌ ఉనద్కత్‌లు పరుగుల నియంత్రణతో పాటు వికెట్ల వేటలో అదరగొట్టారు. ఈడెన్‌గార్డెన్స్‌లో ఈ ప్రదర్శన సన్‌రైజర్స్‌ బౌలర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -