ఖండవల్లి మడుగంత కడుపు
తన వేడి తనే తట్టుకోలేక
పిడచకట్టిన నాలుక జాపి
వాడి, వేడి, వాడి బాణాలు సంధించిన వైనమే
యీ వెండిమబ్బుల కదలిక
సముద్రపునీటిని ఔపోసనపట్టాడు కామోసు
నల్ల మబ్బులై కడుపుబ్బరమైన పిదప
ఆగస్త్యుడావహించాడేమో
ఇక తట్టుకోలేక చెవినుండో
హాంగోవరు వాంతులో తెలీదు కాని
భళ్ళుమని కుమ్మరింతలా రూపుదిద్దుకుంది
సమయం, సందర్భం, కాలం మరచి
ఉరుములు, మెరుపులు, వడగళ్ల
క్రమంలో కంటి కొలకులనుండి
చుక్కలు, చినుకులు ఠపఠప రాలుతున్నాయో
వేగాన్ని నియంత్రించలేక
గాలి విసురెక్కువైంది కామోసు
అతలాకుతలం చేయడానికి
పరుగు మొదలైందనుకుంటా
ఆకాశం గుండెలుబాదుకుంటూ
రోదించడం మొదలెట్టింది
అది తుఫానై రూపందాల్చి
ప్రళయ నాట్యం మొదలైంది.
తీరప్రాంతం కకావికలమౌతూ
తోకచివర్లతో మైదానప్రాంతాన్ని సైతం
నీటి తాకకిడి బలిచేస్తున్నది
పొలాలు, తోటలు, ఇండ్ల తలాలు,
పశువులు, పక్షులు,
అడవి తేడాలేకుండా సోషలిస్టులా
నింగినేల మమేకమయ్యేలా
జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది
ఇసుక మేటలు, శవాల దిబ్బలు,
పగిలిన కుండలు, కూలిన గుడిసెలు
అల్లాడుతున్న జనం…
ఓ హదయ విదారక దశ్యం
ఎన్న సహాయక చర్యలు తీసుకున్నా
ఇప్పటిలో సామాన్య పరిస్థితి
ఏర్పడే దాఖలాలు లేవు
పునరావాస కేంద్రాలెన్నిపెట్టినా
సహాయం కోసం ఆర్తనాదాలు
వినపడుతూనే వుంటాయి..
కరుణలేని వరుణుడి దాడి యుద్ధానంతర వాతావరణానికి ప్రతీక
యుద్ధప్రాతిపదికన సర్కారు తో పాటు
స్వచ్ఛంద సంస్థలు పూనుకుంటేనే…సుస్థిరత.
- కపిల రాంకుమార్, 9849535033


