- సెమీస్‌లో అడుగుపెట్టిన టాప్ సీడ్
- ఇగా స్వైటెక్‌కు ఆమంద చెక్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
వరల్డ్ నం.1, వింబుల్డన్ చాంపియన్ జానిక్ సినర్ (ఇటలీ) యూఎస్ ఓపెన్ టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. సహచర ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెటిపై వరుస సెట్లలో సాధికారిక విజయం సాధించిన సినర్.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరేట్ ఇగా స్వైటెక్‌కు (పొలాండ్)కు క్వార్టర్‌ఫైనల్లో షాక్ తగిలింది. అమెరికా అమ్మాయి ఆమంద అనిషిమోవ వరుస సెట్లలో స్వైటెక్‌పై విజయం సాధించింది.
నవతెలంగాణ-న్యూయార్క్
ఇటలీ స్టార్ జానిక్ సినర్ జోరు కొనసాగుతుంది. ఫిట్‌నెస్ సమస్యలతో న్యూయార్క్‌కు వచ్చిన వరల్డ్ నం.1 జానిక్ సినర్ తొలి రౌండ్ నుంచీ అదరగొడుతున్నాడు. పురుషుల సింగిల్స్‌లో జానిక్ సినర్ అలవోక విజయంతో సెమీఫైనల్లో కాలుమోపాడు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెటిపై 6-1, 6-4, 6-1తో జానిక్ సినర్ వరుస సెట్లలో విజయం సాధించాడు. రెండు గంటల్లోనే లాంఛనం ముగించిన సినర్ 10 ఏస్‌లు, ఐదు బ్రేక్ పాయింట్లతో రెచ్చిపోయాడు. పాయింట్ల పరంగా 85-56తో ముసెటిపై పైచేయి సాధించాడు. రెండు ఏస్‌లు కొట్టిన ముసెటి.. సినర్ సర్వ్‌ను బ్రేక్ చేయటంలో విఫలమయ్యాడు. సినర్ 18 గేమ్ పాయింట్లు గెల్చుకోగా.. ముసెటి 7 గేమ్ పాయింట్లతో సరిపెట్టుకున్నాడు. సింగిల్ సెట్ కోల్పోకుండా జానిక్ సినర్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో కెనడా ఆటగాడు ఫెలిక్స్ ఆగర్ 4-6, 7-6(9-7), 7-5, 7-6(7-4)తో అలెక్స్ (ఆస్ట్రేలియా)పై నాలుగు సెట్ల మహా పోరులో గెలుపొందాడు. రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీయగా.. ఒత్తిడిలో మెరిసిన ఫెలిక్స్ ఆగర్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. మెన్స్ సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా), కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) తలపడనుండగా.. రెండో సెమీస్‌లో జానిక్ సినర్‌తో ఫెలిక్స్ ఆగర్ పోటీపడనున్నాడు.
స్వైటెక్‌కు షాక్
మహిళల సింగిల్స్ వరల్డ్ నం.2, వింబుల్డన్ చాంపియన్ ఇగా స్వైటెక్ (పొలాండ్) టైటిల్ వేటకు క్వార్టర్‌ఫైనల్లోనే తెరపడింది. ఎనిమిదో సీడ్ అమెరికా అమ్మాయి ఆమంద అనిషిమోవతో మ్యాచ్‌లో 4-6, 3-6తో స్వైటెక్ పరాజయం పాలైంది. 96 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో ఆమంద 3 ఏస్‌లు, నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించగా.. స్వైటెక్ 2 ఏస్‌లు, రెండు బ్రేక్ పాయింట్లతో సరిపెట్టుకుంది. ఆమంద 23 విన్నర్లు కొట్టగా.. స్వైటెక్ 13 విన్నర్లే సాధఙంచింది. పాయింట్ల పరంగా 67-54తో ఆమంద పైచేయి సాధించింది. మరో క్వార్టర్‌ఫైనల్లో జపాన్ స్టార్ నవొమి ఒసాక 6-4, 7-6(7-3)తో కరొలినా ముచోవ (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. 4 ఏస్‌లు, రెండు బ్రేక్ పాయింట్లతో ముచోవ మెరిసినా.. ఐదు ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో ఒసాక అదరగొట్టింది. పాయింట్ల పరంగా 71-64తో ఒసాక పైచేయి సాధించింది. కీలక రెండో సెట్లో గట్టి పోటీ ఇచ్చిన ముచోవ.. సెట్‌ను టైబ్రేకర్‌కు తీసుకెళ్లింది. టైబ్రేకర్‌లో 7-3తో ఆధిక్యం సాధించిన ఒసాక మరో సెట్ అవసరం లేకుండానే సెమీఫైనల్లో స్థానం దక్కించుకుంది. నేడు మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో అరినా సబలెంక (బెలారస్), జెస్సికా పెగులా (అమెరికా) తలపడనుండగా.. రెండో సెమీఫైనల్లో నవొమి ఒసాక, ఆమంద అనిషిమోవ పోటీపడనున్నారు.
యూకీ బాంబ్రి అదరహో
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రి (33) సంచలన ప్రదర్శనతో సత్తా చాటాడు. న్యూజిలాండ్ ఆటగాడు మైకల్ వీనస్‌తో జట్టుకట్టిన యూకీ బాంబ్రి.. మెన్స్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో యూకీ బాంబ్రి సెమీస్‌కు చేరుకోవటం ఇదే ప్రథమం. క్వార్టర్‌ఫైనల్లో 11వ సీడ్ నికోల మెక్టిక్, రాజీవ్ రామ్‌లపై 6-3, 6-7, 6-3తో బాంబ్రి, మైకల్ జోడీ మెరుపు విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరో సీడ్ ఇంగ్లాండ్ జోడీ నీల్, జోలతో బాంబ్రి, మైకల్ తలపడనున్నారు. మెన్స్ డబుల్స్‌లో వరల్డ్ నం.32 ర్యాంక్‌లో కొనసాగుతున్న యూకీ బాంబ్రి.. ఈ విభాగంలో భారత అత్యుత్తమ ఆటగాడు. చివరగా యుఎస్ ఓపెన్‌లో లియాండర్ పేస్, సానియా మీర్జాలు 2015లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత యుఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచేందుకు యూకీ బాంబ్రి తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడేమో చూడాలి.