– ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– హెల్త్ స్క్రీనింగ్ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభం
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లాను దక్షిణ తెలంగాణ వైద్య రంగానికి కేంద్రంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో రిఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ అన్నారు. ప్రజాపాలన- ప్రగతి పాలన ఆరోగ్య అవగాహన వారోత్సవాలలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వచ్ఛంద మెగా రక్తదాన శిబిరం, పాత పాలమూరు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో మహిళా స్వయం సంఘాల సభ్యుల కోసం హెల్త్ స్క్రీనింగ్ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజ్‌లో సీట్ల పెంపు, పీజీ కోర్సుల విస్తరణ, విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ సదుపాయాలు, ఆడిటోరియం నిర్మాణం వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కొత్త టీచింగ్ ఆస్పత్రి భవనం నిర్మాణ పనులు త్వరలో పూర్తిచేసి, జూన్ నెలలో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హాస్టల్స్ భవనం ఆడిటోరియం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు మహబూబ్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రిఫరల్ సెంటర్‌గా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మేయర్ గుమ్మాల మమత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్‌బి హరిప్రియ, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగ అజ్మీర తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ రిఫరల్ సేవలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



