Thursday, July 10, 2025
E-PAPER
Homeఆటలుసూపర్‌ స్వైటెక్‌

సూపర్‌ స్వైటెక్‌

- Advertisement -

– లామ్సోనోవపై క్వార్టర్స్‌లో గెలుపు
– వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2025
నవతెలంగాణ-లండన్‌ :

మహిళల సింగిల్స్‌ మాజీ వరల్డ్‌ నం.1, పొలాండ్‌ భామ ఇగా స్వైటెక్‌ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. వింబుల్డన్‌ టైటిల్‌ వేటలో అసమాన ఆటతీరుతో రెచ్చిపోతున్న స్వైటెక్‌.. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో లుడిమిల లామ్సోనోవపై వరుస సెట్లలో విజయం సాధించింది. 6-2, 7-5తో రష్యా అమ్మాయిని చిత్తు చేసిన స్వైటెక్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగించింది. మూడు ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌.. ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. తొలి సెట్‌ను 6-2తో అలవోకగా నెగ్గింది. రెండో సెట్లో 5-5తో సమ్సోనోవ పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 7-5తో మ్యాచ్‌ను రెండో సెట్లోనే ముగించిన స్వైటెక్‌ సెమీఫైనల్‌ బెర్త్‌ బుక్‌ చేసుకుంది. పాయింట్ల పరంగా 75-59తో పైచేయి సాధించిన స్వైటెక్‌.. సొంత సర్వ్‌లో 8 గేములు గెలుపొందింది. ఓవరాల్‌గా స్వైటెక్‌ 13 గేములు నెగ్గగా.. సమ్సోనోవ ఏడు గేమ్‌ పాయింట్లతోనే సరిపెట్టుకుంది. మరో క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో స్విస్‌ అమ్మాయి బెలింద బెన్సిక్‌ సూపర్‌ విక్టరీ నమోదు చేసింది. ఏడో సీడ్‌ రష్యా అమ్మాయి మిరా అండ్రీవను వరుస సెట్లలో టైబ్రేకర్లలో ఓడించింది. 7-6(7-3), 7-6(7-2)తో వరుస సెట్లు టైబ్రేకర్‌కు దారితీశాయి. టైబ్రేకర్‌లో పైచేయి సాధించిన బెన్సిక్‌.. అండ్రీవను ఇంటిదారి పట్టించింది. అండ్రీవ, బెన్సిక్‌ చెరో బ్రేక్‌ పాయింటే సాధించటంతో మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. పాయింట్ల పరంగా 94-85తో బెన్సిక్‌ ఆధిపత్యం చూపించింది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ అరినా సబలెంక (బెలారస్‌), అనిసిమోవ (అమెరికా) తలపడనుండగా.. బెన్సిక్‌, స్వైటెక్‌లు మరో సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -