నవతెలంగాణ – కంఠేశ్వర్
జిల్లా అభివృద్ధిని మరిచి పేరు మార్పు వలన ఉపయోగమేమిటి అని, మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను ఆదరించండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శనివారం సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయంలో నిజాంబాద్ నగర ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో జిల్లాలోని వివిధ మున్సిపల్ పట్టణాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రజా సమస్యల పైన సీపీఐ(ఎం) పార్టీగా అనేక ఆందోళనలు పోరాటాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడుతోందని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాడే వారిని రాబోయే ఎన్నికల్లో ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పైన రెండుసార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన ధర్మపురి అరవింద్ అభివృద్ధి నిధులకు ప్రయత్నించకుండా కేవలం పేరును మార్చడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకోవటం ప్రజలను వంచించటమే అవుతుందని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడం ధర్మపురి అరవింద్ విధానంగా కనబడుతుందని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండా సెంటిమెంట్లను రగల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కోవటం మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట రాములు, నగర కార్యదర్శి సుజాత, నగర నాయకులు అనిత, శ్రీదేవి, అంజయ్య అంజయ్య, శుద్ధి తదితరులు పాల్గొన్నారు.



