Friday, October 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మద్దతివ్వండి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మద్దతివ్వండి

- Advertisement -

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో కలిసిరండి
సీపీఐ(ఎం)ను కోరిన టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌
20న జరిగే రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకుంటాం
ఈ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం పెట్టండి
అన్ని పార్టీలతో కూడిన బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే కేంద్రంపై ఒత్తిడి తెద్దాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతివ్వాలనీ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వంతో కలిసి రావాలని సీపీఐ(ఎం)ను టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం (ఎంబీ భవన్‌)లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఇతర నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, తదితరాం శాలపై చర్చించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై మహేశ్‌కుమార్‌గౌడ్‌ మద్దతు కోరగా… ఈ విషయంపై హైదరాబాద్‌ నగర కమిటీలో చర్చలు జరుగుతున్నాయనీ, ఈ నెల 20న జరిగే తమ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తామని జాన్‌వెస్లీ హామీనిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత అన్ని పార్టీల నాయకులతో కూడిన బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు. అదే సమయంలో ఢిల్లీలో జాతీయ, ఇతర ప్రధాన పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని కూడా చేయాలన్నారు. అప్పుడే కేంద్రంపై ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి విజయం సాధించగలుగుతామన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి అన్ని పార్టీల నేతల బృందాన్ని తీసుకెళ్లే అంశాలపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామంటూ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సానుకూలత వ్యక్తపరిచారు. సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి.జ్యోతి, టి.సాగర్‌, మల్లు లక్ష్మి, అబ్బాస్‌, బండారు రవికుమార్‌, పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -