నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహిళా రిజర్వేషన్ చట్టం (నారీశక్తి వందన్ అధినియమ్) సవరణ బిల్లుకు మద్దతు కోరుతూ అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లకు ప్రధాని మోడీ లేఖ రాశారు. వ్యక్తులు, పార్టీలకు అతీతంగా చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేసేందుకు సమయం ఆసన్నమైందని అందులో పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలను 33 శాతం మహిళా రిజర్వేషన్‌తో నిర్వహిద్దామని వివరించారు. విస్తృత సంప్రదింపుల అనంతరం నారీశక్తి వందన్ అధినియమ్ అమలుకు సమయం ఆసన్నమైందనే నిశ్చితాభిప్రాయానికి వచ్చామని, 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ తో నిర్వహించడం అనివార్యమని లేఖలో ప్రధాని పేర్కొన్నారు. మహిళలు, భవిష్యత్ తరాల కోసం బాధ్యత తీసుకోవాలని పార్టీలను కోరారు. ఇందుకోసం పార్లమెంటులో చర్చను స్వాగతిస్తున్నామని వివరించారు. ఎంపీలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ”మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును ఆమోదించే విషయంలో అందరినీ ఒకేతాటిపైకి రావాలని కోరేందుకు ఈ లేఖ రాస్తున్నాను. పార్లమెంటులో ఎక్కువ మంది తమ అభిప్రాయాలను పంచుకోవడం అందరికీ గర్వకారణమవుతుంది.
వ్యక్తులు, పార్టీలకు అతీతంగా, మహిళలు, భవిష్యత్ తరాల పట్ల బాధ్యతను చాటుకునే సందర్భమిది. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చాలాకాలంగా సభ్యులు కోరుతున్నారు. వారి ఆకాంక్షలు కార్యరూపం దాల్చే సమయం ఇప్పుడు వచ్చింది. 140 కోట్ల మంది భారతీయులు, నారీశక్తి సాధించిన విజయం ఇది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు అంతా కలిసికట్టుగా ముందుకు వస్తారనే పూర్తి నమ్మకం నాకు ఉంది” అని మోడీ లేఖలో పేర్కొన్నారు. మహిళలు ఎదిగేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు, ప్రత్యేకించి నాయకత్వం వహించేందుకు ఎంతగా అవకాశమిస్తే అంత గా సమాజం ప్రగతి పథంలోకి వెళ్తుందని వివరించారు. అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా విజన్ సాకారం కావాలంటే ఈ ప్రయాణంలో మహిళలు కీలకమైన, చురుకైన పాత్ర పోషించడం అవసరమని మోడీ పేర్కొన్నారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ప్రారంభించనున్నట్టు లేఖలో ప్రధాని వివరించారు.
ఆదరబాదరగా బిల్లు అమలుకు కేంద్రం యత్నం : ఖర్గే
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును ఆదరబాదరగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకుంటున్న చర్యగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఖర్గే లేఖ రాశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఎలాంటి వివరాలూ వెల్లడిం చకుండా మళ్లీ తమ సహకారం కోరడం సరికాదని, ఈ చట్టంతో ముడిపడిన కీలకాంశా లపై అర్థవంతమైన చర్చ జరగాలని ఖర్గే వివరించారు. ఇందుకోసం ఈ నెల 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ”నారీశక్తి వందన్ అధినయమ్ 2023 సెప్టెంబర్‌లో పార్లమెంటులో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన విషయం మీకు తెలుసు.
ఆ సమయంలో తక్షణం ఈ కీలక చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ తరఫున నేను స్వయంగా కోరాను” అని ఖర్గే గుర్తుచేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన వివరాలు వెల్లడించకుండా విపక్షాల సహకారాన్ని కేంద్రం కోరుతోందని, డీలిమిటేషన్, ఇతర కీలకాంశాలకు సంబంధిం చిన వివరాలు లేకుండా ఈ చారిత్రక చట్టంపై అర్థవంతమైన చర్చ సాధ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిందని ప్రధాని పేర్కొన్నారని, అయితే అది నిజం కాదని ఖర్గే అన్నారు. మిగిలిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 29న ముగుస్తాయని, ఆ తర్వాత ఎప్పుడైనా సరే రాజ్యాంగ సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు, అందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉద్దేశించినదే అయితే నారీశక్తి వందన్ అధినియమ్-2023 సవరణతో ముడిపడిన డీలిమిటేషన్‌పై చర్చ జరిపేందుకు ఈ నెల 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే సూచించారు.
బీజేపీ మూడు లైన్ల విప్ జారీ
ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా ఈ సమావేశాల సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని ఆ విప్‌లో కోరింది. కేంద్రమంత్రులతో సహా ఎంపీలంతా ఈ మూడు రోజులు సభలోనే ఉండాలని, ఎలాంటి సెలవులూ మంజూరు చేసేదిలేదని స్పష్టం చేసింది. హాజరు కచ్చితంగా ఉండాలని విప్ పేర్కొంది. ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుపై దృష్టి పెట్టడం, రిజర్వేషన్ అమలు కాలపరిమితికి సంబంధించి కీలక సవరణలు చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జనాభా గణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు కావాలని నారీశక్తి వందన్ అధినయమ్-2023 చెబుతోంది. అయితే జనగణనలో జాప్యం జరుగుతున్నందున 2011 జనాభా లెక్కల ఆధారంగానే ముందుకు వెళ్లాలని కేంద్రం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి
- Advertisement -
- Advertisement -



