Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రశ్నించేవారిని అణచివేయడం సరిగాదు

ప్రశ్నించేవారిని అణచివేయడం సరిగాదు

- Advertisement -

పోటు రంగారావుకు ఇచ్చిన ఎన్‌ఐఏ నోటీసులను ఉపసంహరించాలి
కేంద్రం విధానాలపై పోరాటాలు చేస్తాం : వామపక్ష పార్టీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఇచ్చిన ఎన్‌ఐఏ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. పోటురంగారావును సంబంధం లేని కేసులో విచారణకు రావాలని కోరుతూ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. శనివారం ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రమ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం, ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర కార్యదర్శి మురహరి, ఆర్‌ఎస్‌పీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌) కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌.రమేశ్‌రాజా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 1967 కేసు విషయంలో విచారించడానికి ఏప్రిల్‌ 22, 2026న మాదాపూర్‌ కార్యాలయానికి హాజరుకావాలని ఎన్‌ఐఏ నోటీసు పంపిందని తెలిపారు. వాస్తవానికి ఈ కేసుతో సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ పార్టీకిగానీ, రంగారావుకుగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కేసు నెంబర్‌ను పరిశీలించగా గాదె ఇన్నయ్యకు సంబంధించినదని తేలిందని తెలిపారు. గాదె ఇన్నయ్యను అరెస్టు చేసే సమయంలో పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలనీ, ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా అరెస్టు చేయడం సరిగాదని పోటురంగారావు పత్రికల ముఖంగా కోరారని గుర్తుచేశారు. ఆయన అరెస్టును ఖండించడం తప్ప పోటు రంగారావుకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించేవారిపై అణచివేతనూ, నిర్బంధాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను రుద్దాలని ప్రయత్నించిందనీ, 29 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపైనా, ప్రజా ఉద్యమాలపైనా కేంద్రం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో వండలాది మంది ఆదివాసులనూ, మావోయిస్టులనూ హత్యచేసిందని పేర్కొన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష పార్టీలుగా ఉద్యమిస్తున్నామనీ, అణచివేతను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మార్చి 31 తర్వాత ఆర్బన్‌ నక్సలైట్ల ఏరివేత ఉంటుందని ప్రధాని మోడీ, అమిత్‌ షా చట్ట విరుద్ధంగా బాహాటంగానే ప్రకటించడాన్ని ఖండించారు. పోటురంగారావుకు అందులో భాగంగానే నోటీసు అందిందని భావిస్తున్నామని తెలిపారు. ఆయనపై నోటీసులను ఉపసంహరించాలనీ, లేనిపక్షంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -