Wednesday, March 11, 2026
E-PAPER
Homeజాతీయంప్రతిపక్షాల గొంతు అణచివేత!

ప్రతిపక్షాల గొంతు అణచివేత!

- Advertisement -

– లోక్‌సభలో సస్పెన్షన్లు బిర్లా కాలంలో అధికం
– గత రెండు దశాబ్దాల్లో దాదాపు సగం ఆయన పీరియడ్‌లోనే
– మోడీ సర్కారుకు అనుకూలంగా స్పీకర్‌ కుర్చీ
– ఈ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : రాజకీయ పరిశీలకులు


ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ ప్రధాన వేదిక. ఇక్కడ ప్రభుత్వం మాత్రమే కాదు.. ప్రతిపక్షం కూడా ప్రజల సమస్యలను ప్రస్తావించే హక్కు కలిగి ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ.. సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో ప్రతిపక్షాలది కీలక పాత్ర. కానీ లోక్‌సభలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. స్పీకర్‌ ఓం బిర్లా కాలంలో ప్రతిపక్ష ఎంపీలే టార్గెట్‌గా అత్యధిక సస్పెన్షన్లు జరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నలు అడిగినా, నిరసనలు వ్యక్తం చేసినా వెంటనే సస్పెన్షన్లు విధించడంతో సభలో చర్చల అవకాశాలూ తగ్గుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్ష ఎంపీలు సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో ఆయన కాలంలో సభలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ గణాంకాలు చర్చనీయాంశమవుతున్నాయి. 2004 నుంచి 2026 వరకు గత రెండు దశాబ్దాల్లో లోక్‌సభలో ఎంపీల సస్పెన్షన్లు గణనీయంగా పెరిగాయి. ఇందులో ప్రస్తుత స్పీకర్‌ ఓం బిర్లా పదవీకాలంలో సస్పెన్షన్లు అత్యధిక స్థాయికి చేరడం గమనార్హం. పార్లమెంటులో అల్లర్లు, నినాదాలు, సభా కార్యక్రమాల అడ్డంకుల పేరుతో.. మోడీ సర్కారుకు అనుకూలంగా ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్‌ జరిగినట్టు గణాంకాలను ఉటంకిస్తూ రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.

రెండు దశాబ్దాల సస్పెన్షన్‌ గణాంకాలు ఇలా
ఒక పరిశోధన ప్రకారం 2004 నుంచి 2026 మధ్య లోక్‌సభలో మొత్తం 245 సస్పెన్షన్‌ చర్యలు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య వివిధ స్పీకర్ల కాలంలో నమోదైన సంఖ్యతో పోల్చి చూస్తే ఓం బిర్లా టైమ్‌లో జరిగినవే అత్యధికంగా ఉన్నాయి. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఉన్నారు. ఆయన కాలంలో ఐదు సస్పెన్షన్లు మాత్రమే జరిగాయి. ఇక 2009 నుంచి 2014 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్‌ వ్యవహరించారు. ఆమె పీరియడ్‌లో 45 సస్పెన్షన్ల జరిగాయి. కేంద్రలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2019 వరకు స్పీకర్‌గా సుమిత్ర మహాజన్‌ ఉన్నారు. ఆమె కాలంలో 73 సస్పెన్షన్లు జరిగాయి. ఇక మోడీ ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓం బిర్లాకు లోక్‌సభ స్పీకర్‌ కుర్చీ దక్కింది. 2019 నుంచి 2024 మధ్య ఆయన కాలంలో అత్యధికంగా 112 సస్పెన్షన్లు జరిగడం గమనార్హం. గత రెండు దశాబ్దాలో నమోదైన మొత్తం సస్పెన్షన్లలో సగం ఓం బిర్లా కాలంలోనే జరగడం పరిస్థితి తీవ్రతను తెలిజేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

2023లో చరిత్రలోనే అతిపెద్ద సస్పెన్షన్‌
2023 శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ భద్రతా లోపంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో ఒకే వారంలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం లోక్‌సభ చరిత్రలోనే అతిపెద్ద సమూహ సస్పెన్షన్‌గా నమోదైంది. స్పీకర్‌ ఈ చర్యను లోక్‌సభ రూల్స్‌లోని 374ఎ ప్రకారం తీసుకున్నారు. ఈ నియమం ప్రకారం సభలో తీవ్ర అల్లర్లు సృష్టించిన ఎంపీలను స్పీకర్‌ వెంటనే సస్పెండ్‌ చేయొచ్చు.

పార్టీల వారీగా మారుతున్న పరిస్థితి
వివిధ స్పీకర్ల కాలంలో సస్పెండ్‌ అయిన ఎంపీలలో పార్టీల ప్రాధాన్యం కూడా మారుతూ వచ్చింది. మీరా కుమార్‌ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జరిగిన నిరసనల కారణంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ఎక్కువగా సస్పెండ్‌ అయ్యారు. సుమిత్రా మహాజన్‌ కాలంలో ఏఐఏడీఎంకే, కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ ఎంపీలు ఎక్కువగా సస్పెండ్‌ అయ్యారు. ఇక ఓం బిర్లా కాలంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ), వామపక్ష పార్టీలు వంటి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఎక్కువగా సస్పెండ్‌ అయ్యారు.

స్పీకర్‌ తటస్థతపై సందేహాలు
స్పీకర్‌ ఓం బిర్లా కాలంలో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్లు రికార్డు స్థాయికి చేరుకోవడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇది మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్ష స్వరాలను అణచివేయడానికి ఉపయోగపడుతున్న సాధనంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. భారత పార్లమెంట్‌ సంప్రదాయంలో స్పీకర్‌ పదవి తటస్థంగా ఉండాలి. స్పీకర్‌ అన్ని పార్టీలను సమదృష్టితో చూడాలి. కానీ ఓం బిర్లా కాలంలో సస్పెన్షన్లలో ఎక్కువ మంది ప్రతిపక్ష ఎంపీలే ఉండటంతో స్పీకర్‌ తటస్థతపై సర్వత్రా అనుమానాలు పెరిగాయి.

పార్లమెంటరీ రాజకీయాల్లో మార్పు
ఈ విధంగా పెరుగుతున్న సస్పెన్షన్లు పార్లమెంటులో మారుతున్న రాజకీయ ధోరణిని చూపిస్తున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తూ సభలో నిరసనలు చేపడుతుంటే, ప్రభుత్వం మాత్రం ఆ నిరసనల నడుమ కూడా చట్టాలు ఆమోదింపజేయడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్‌కు ఉన్న అధికారాలు.. అధికార పక్షానికి అనుకూలంగా, ప్రతిపక్షాలపై ప్రతీకారంగా మారుతున్నాయనే అనుమానాలు, ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి తీరు ఏ మాత్రమూ సరికాదని వారు హితవు పలుకుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -