Wednesday, September 17, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'సుప్రీం' వ్యాఖ్యలు

‘సుప్రీం’ వ్యాఖ్యలు

- Advertisement -

బీహార్‌లో తమ ఓటు హక్కు కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు, వక్ఫ్‌బోర్డు పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన మైనార్టీలకు అత్యున్నత న్యాయస్థాన వ్యాఖ్యలు కొంత ఊరటనిచ్చాయి. సుప్రీంకోర్టు స్పందించి వక్ఫ్‌బోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలపై స్టే ప్రకటించింది. ‘సర్‌’ (ఓటర్ల జాబితా సవరణ)కైతే హెచ్చరికనే జారీ చేసింది. కేంద్రానికి ఇవి అంత ఘాటుగా తాకకపోయినా ఎప్పటికైనా ప్రజాస్వామ్యం, లౌకికత్వమే వర్ధిల్లుతుందనే భరోసాను కొంతమేరకైనా ప్రజలకు ఇచ్చాయి. రాజ్యాంగ బద్ధంగా, అత్యంత స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ను కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకుంది. ‘సర్‌’ను ప్రయోగించి ఎన్నికల కమిషన్‌ బీహార్‌ ప్రజల ఓట్లను లక్షల్లో గల్లంతు చేసింది. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును లాగేసుకోవడంతో బీహార్‌ ప్రజలు ఆందోళనకు దిగారు. ‘ఓట్‌ చోరీ’ అంటూ వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తున్నారు. చివరకు ఓటు హక్కు కోసం ప్రజలు అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఓట్ల తొలగింపు ఒక్క బీహార్‌ రాష్ట్రంతో ఆగేది కాదు. దేశ వ్యాప్తంగా ‘సర్‌’ను ప్రయోగించి తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ పాలకులు. వారి పాలనలో ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా మారిందనటానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? అందుకే ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు నడుంబిగిస్తున్నాయి.

కాస్త ఆలస్యంగానైనా సుప్రీం కోర్టు దీనిపై స్పందించింది. ఓట్ల తొలగింపు చట్టవిరద్ధమని తేలితే ‘సర్‌’ను రద్దు చేస్తామని హెచ్చరించింది. అలాగే ప్రతి దానికి ఆధార్‌తో లింకు పెడుతున్న ప్రభుత్వం ఓట్ల నమోదులో మాత్రం దాన్ని పక్కన ఎందుకు పెడుతోందంటూ ప్రజలు వేస్తున్న ప్రశ్నకు సైతం కోర్టు బాగానే స్పందించింది. ఇకపై ఆధార్‌ను సైతం పరిగణలోనికి తీసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాదు తమ తుది తీర్పు కేవలం ఒక్క బీహార్‌ రాష్ట్రానికే కాదు, మొత్తం దేశానికే వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే తుది తీర్పు రాజ్యాంగ హక్కులను రక్షించేదిగా ఉండాలని ఆశిద్దాం. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్‌, ఓటర్లు ఉన్నారా లేరా అనే ప్రాధమిక సర్వేనే చేపట్టలేదు. పైగా బతికున్న వారిని కూడా చంపేసింది. ఇటువంటి సాక్షాధారాలను బహిరం గంగా ప్రకటించి రాహుల్‌ గాంధీ ప్రశ్నిం చారు. ‘ఓట్‌ చోరీ’ నినాదం ప్రజలలోనూ కదలిక తెచ్చింది. ఇక నిత్యం పేదరికంలో అల్లాడుతున్న ముస్లింలకు వక్ఫ్‌బోర్డు ద్వారా కొద్దో గొప్పో ఆర్థిక చేయూత అందుతుంది. ఇప్పుడు అది కూడా దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోంది. వక్ఫ్‌బోర్డుపై పెత్తనం చెలాయించేందుకు, దాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది.

ఆ ఉద్దేశంతోనే వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక సవరణలు తీసుకొచ్చింది. ఆ సవరణలను సవాల్‌ చేస్తూ వారూ కోర్టు మెట్లు ఎక్కారు. దాంతో ఆ సవరణల్లో కూడా కొన్ని అంశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. వక్ఫ్‌బోర్డ్‌ సవరణకు సంబంధించి ముఖ్యమైనది సెక్షన్‌ 3 (ఆర్‌). ముస్లిమేతరులు ఎవ్వరూ వక్ఫ్‌బోర్డుకు తమ ఆస్తులను దానం చేయకూడదని ఉంది. అలా దానం చేయాలంటే కనీసం వారు ఐదేండ్లుగా ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నట్టు రుజువు చేసుకోవాలి. ఈ సవరణ ద్వారా వక్ఫ్‌బోర్డుకు ఇతర మతాల నుండి ఎలాంటి దానధర్మాలు రాకుండా నిలిపివేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా ఉన్న మన దేశంలో ఇలాంటి సవరణ సరైనది కాదు. ఇది కేవలం హిందూ ముస్లింల మధ్య విభజన సృష్టించేందుకు కేంద్రం పన్నిన పన్నాగం. అలాంటి సవరణపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం స్వాగతించాల్సిందే.

అలాగే వక్ఫ్‌బోర్డు ఎక్స్‌ అఫీషియో అధికారి ముస్లిం సమా జానికి చెందినవారే ఉండాలని, అలాగే బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లిం వారే ఉండాలని కూడా సుప్రీం చెప్పింది. వీటన్నింటినీ వక్ఫ్‌బోర్డు పరిరక్షణకు, దేశ లౌకికత్వాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడే అంశాలుగా మనం చూడవచ్చు. బీహార్‌ ఓట్ల గల్లంతు విషయంలో కానీ, వక్ఫ్‌బోర్డు చట్ట సవరణకు సంబంధించి కానీ సుప్రీం కోర్టు స్పందించిన తీరు కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలకు కొంతమేరకైనా అడ్డుకట్ట వేసే విధంగా ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేస్తున్న పోరాటానికి సుప్రీం జోక్యం కొంత ధైర్యాన్ని కలిగించింది. హక్కులు కాలరాయబడుతూ, పాలకులే పీడకులవుతున్న వేళ ప్రజలు న్యాయం కోసం ఆశగా, నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవల్సిన బాధ్యత అత్యున్నత ధర్మాసనానికి ఉంది. అందుకే తన తుది తీర్పులో మరింత స్పష్టతను ప్రదర్శిస్తుందని ఆశిద్దాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -