Saturday, April 11, 2026
E-PAPER
Homeజాతీయంరష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకున్నభారతీయుల దుస్థితిపై విచారించాలి కేంద్రాన్ని కోరిన సుప్రీం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకున్నభారతీయుల దుస్థితిపై విచారించాలి కేంద్రాన్ని కోరిన సుప్రీం

- Advertisement -

న్యూఢిల్లీ : రష్యన్‌ సైన్యంలో భారతీయులను బలవంతంగా రిక్రూట్‌ చేసుకుంటున్నారన్న వార్తలపై చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందిస్తూ, ”ఏది నిజమో, ఏం జరుగుతోందో ఆ పై వాడికే తెలుసు” అంటూ ఆందోళనతో వ్యాఖ్యానించారు. రష్యాలో చిక్కుకుపోయిన 26 మంది భారతీయుల తరపున జోక్యం చేసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. తాము రష్యాలో చిక్కుకుపోయామని, ఇష్టం లేకుండానే ఉక్రెయిన్‌ యుద్ధంలో తాము పోరాడాల్సి వస్తోందని ఆ 26మంది వాపోయారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఇందులో మానవ రవాణా కోణం వున్నట్లుగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ 26మంది పెట్టుకున్న పిటిషన్‌ కాపీని అందజేయాల్సిందిగా చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ పంచోలిలతో కూడిన బెంచ్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది. రష్యా – ఉక్రెయిన్‌ యద్ధంలో చిక్కుకున్న భారతీయుల దుస్థితి గురించి విచారించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.

పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ న్యాయవాది, ఈ విషయంలో అత్యవసరంగా సాయమందాలని కోరారు. ”మేం రష్యాలో చిక్కుకుపోయాం, ఇష్టం లేకపోయినా ఒక విదేశం కోసం పోరాడుతున్నాం. ఈ క్రమంలో మేం చనిపోవచ్చు లేదా గాయపడవచ్చు, చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వున్నాం.” అంటూ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా విదేశాల్లో సాగిన రిక్రూట్‌మెంట్‌లో, రవాణాలో తాము బాధితులమని, భారతీయులను దోపిడీకి గురిచేస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదవలేదని, వారిపై వ్యాపారం పూర్తి స్థాయిలో సాగుతోందని న్యాయవాది పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రష్యాలోని భారత ఎంబసీని, రాజస్థాన్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలను ఈ పిటిషన్‌ ప్రతివాదులుగా చేర్చింది.

ఇది మానవ అక్రమ రవాణా కేసుగా కనిపిస్తోందని జస్టిస్‌ బాగ్చి వ్యాఖ్యానించారు. ఈ దశలో చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ మెహతాను ఉద్దేశించి మాట్లాడుతూ, విదేశాల్లోని అక్రమ రిక్రూట్‌మెంట్‌ రాకెట్లు ఇక్కడి యువతను అధిక వేతనాలతో ప్రలోభపెట్టి, వారిని ఆకర్షిస్తున్నాయని, చివరకు వారి పాస్‌పోస్టులను స్వాధీనం చేసుకుని బలవంతంగా ఇలా వాడుకుంటున్నారని అన్నారు. దిగ్బంధించిన భారతీయులు ఎక్కడున్నారో వారి ఆచూకీ నిర్ధారించేందుకు రష్యాలోని భారత ఎంబసీ ద్వారా తక్షణమే దౌత్య చర్యలు చేపట్టాలని, అందుకు విదేశాంగ శాఖ ద్వారా కేంద్రానికి జ్యుడీషియల్‌ ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌ కోరింది. వారి రక్షణ, సంక్షేమం, సురక్షితంగా స్వదేశానికి తిప్పి పంపడం వంటి చర్యలు చేపట్టడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -