మే 5 నుంచి ప్రారంభం.. చట్టం చెల్లుబాటుపై 250కి పైగా పిటిషన్లు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), దాని నియమావళిపై దాఖలైన 250కి పైగా పిటిషన్ల తుది విచారణను సుప్రీంకోర్టు చేపట్టనున్నది. మే 5 నుంచి విచారణను ప్రారంభించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్.. మే 5 నుంచి మే 7 వరకు వరుసగా మూడురోజులు వాదనలు విని, ఆ తర్వాత మే 12న రిజాయిండర్ వాదనలు స్వీకరించి తీర్పును రిజర్వ్ చేయనున్నది.
ఏమిటీ వివాదం?
సీఏఏ-2019 ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌లోకి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ద, జైన, పార్సీ, క్రైస్తవ మతాలకు చెందిన వలసదారులకు పౌరతసత్వం కల్పించే నిబంధనలు ఉన్నాయి. ముస్లింలను ఈ జాబితా నుంచి మినహాయించడంపై పలువురు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ చట్టం మతం ఆధారంగా వివక్ష చూపుతోందని పిటిషనర్ల వాదన. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు, లౌకికత సూత్రాలను ఉల్లంఘిస్తోందని వారు అంటున్నారు.



