Wednesday, July 23, 2025
E-PAPER
HomeజాతీయంSupreme Court : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ”రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా?“ అన్న అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.

ఈ అంశం రాష్ట్రానికి మాత్రమే కాదని.. దేశానికి సంబంధించిన విషయాన్ని గమనించాలని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ విషయంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులపై నిర్ణయం చెప్పాలని.. మూడు నెలల్లోగా ఆమోదించడమే.. తిరస్కరించడమో చేయాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత సైతం పరిస్థితి ఇలాగే ఉంటే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.

రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం.. న్యాయ సమీక్ష చేసేందుకు సంపూర్ణ అధికారం సుప్రీం కోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, సుప్రీం కాలపరిమితి విధించడంపై రాష్ట్రపతి తీవ్రంగా స్పందించారు. అయితే, రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరిన సంగతీ తెలిసిందే. తాజాగా ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. వారంలోగా ఈ విషయంలో స్పందన చెప్పాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -