Saturday, July 26, 2025
E-PAPER
Homeజాతీయంముంబై పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

ముంబై పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

- Advertisement -

న్యూఢిల్లీ : ముంబై బాంబు పేలుళ్ళ కేసులో ఇచ్చిన తీర్పు అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 2006లో జరిగిన ముంబై రైలు పేలుళ్ళ కేసులో నిందితులుగా వున్న 12మందినీ నిర్దోషులుగా విడిచిపెడుతూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్‌ చేసింది. ఆ అప్పీల్‌ను విచారించిన సుప్రీం, ఈ కేసులో ఇచ్చిన తీర్పును ఇతర కేసుల్లో చట్టపరమైన ఉదాహరణగా చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్ర సంఘటిత నేరాల నియంత్రణా చట్టం (మోకా) కింద నమోదైన కేసులపై విచారణ సాగుతున్న సందర్భంలో ఈ కేసు తీర్పును ఉదాహరణగా చూపరాదని పేర్కొంది. అలాగే ఇప్పుడు బాంబే హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చినందున జైలునుండి విడుదలైన నిందితులందరూ మళ్ళీ లొంగిపోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా సుప్రీం స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన బెంచ్‌ ముందు మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ, తీర్పు అమలుపై తాత్కాలికంగా స్టే విధించాలని కోరారు. బాంబే హైకోర్టు తీర్పులోని న్యాయపరమైన తప్పులు మోకా కింద ఇతర కేసుల విచారణను ప్రభావితం చేయరాదని అందువల్ల ఆ తీర్పు అమలుపై స్టే విధించాలని కోరుతున్నామన్నారు.
”వారిని వెనక్కి జైలుకు తీసుకురావడానికి మేం స్టే కోరడం లేదు. అది మా ఉద్దేశ్యం కూడా కాదు, కానీ చట్టానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన కొన్ని నిర్ధారణలు మోకా కింద సాగుతున్న విచారణలను ప్రభావితం చేస్తున్నాయని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు.
”నిర్దోషులందరూ విడుదలయ్యారు, వారిని వెనక్కి జైలుకు తీసుకువచ్చే ఉద్దేశ్యం లేదు.” అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సుప్రీం కోర్టు తన ఇంటీరియమ్‌ ఉత్తర్వుల్లో నమోదు చేసింది.
”అయితే చట్టానికి సంబంధించి సొలిసిటర్‌ జనరల్‌ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏ పెండింగ్‌ ట్రయల్స్‌లోనూ ఉదాహరణగా పరిగణించరాదని పేర్కొంటున్నాం. అందువల్ల ఈ తీర్పు అమలుపై స్టే విధిస్తున్నాం.” అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -