Thursday, October 9, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఏకపక్షానికి 'సుప్రీం' బ్రేక్‌!

ఏకపక్షానికి ‘సుప్రీం’ బ్రేక్‌!

- Advertisement -

వివాదాస్పదమైన వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టం- 2025లోని కొన్ని కీలక సెక్షన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల వెలువరిం చిన మధ్యంతర తీర్పు ఏకపక్షంగా ముందుకెళుతున్న మోడీ సర్కారుకు గట్టి ముకుతాడు. ముస్లింల మేలు కోసమే ఈ చట్ట సవరణ చేపట్టామని గట్టిగా సమర్థించుకున్న ఎన్డీయే ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గత ఏప్రిల్‌లో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరించి, కేంద్రం నుంచి వివరణ కోరినప్పుడు- ఆ పిటిషన్లకు విచారణార్హతే లేదని మోడీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టం అమలుపై ఎట్టి పరిస్థితుల్లోనూ స్టే ఇవ్వరాదని, అది శాసనాదికారాల్లో కోర్టులు అనవసర జోక్యం చేసుకోవటమే అవుతుందని దూకుడుగా వాదించింది. కానీ, సుప్రీం ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. రెండు వైపులా సుదీర్ఘమైన వాదనలు విన్నది. వక్ఫ్‌ అధికారాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవటానికి వీలున్న కొన్ని కీలకమైన అంశాలపై స్టే విధించింది. ప్రతిపక్ష పార్టీలూ, వక్ఫ్‌ పరిరక్షణ సంస్థలూ ఈ మధ్యంతర తీర్పును స్వాగతించగా, చట్టం మొత్తాన్ని నిలిపివేయకపోవడం ప్రభుత్వ విజయమేనని బీజేపీ చెప్పుకొంది.

అన్ని మతాల వలె ఇస్లాంలోనూ ధార్మిక అవసరాలకు ఉపయోగించటానికి ఆయా కాలాల్లో ప్రజలూ, పాలకులూ భూములను, ఇతర ఆస్తులను దానం (వక్ఫ్‌) ఇవ్వటం ఆనవాయితీగా ఉంది. ఈ విధంగా సమకూరిన ఆస్తులు ముస్లిం పెద్దలతో కూడిన వక్ఫ్‌ బోర్డు సంరక్షణలో ఉంటాయి. ఉద్దేశిత అవసరాలకు వాటిని వినియోగించే పూర్తి హక్కు, అధికారమూ ఆ బోర్డు కలిగి ఉంటుంది. లక్షలాది ఎకరాలు వక్ఫ్‌ బోర్డుల ఆధీనంలో ఉన్నాయని, ఇది చాలా అన్యాయమని బీజేపీ, దాని పరివార సంఘాలూ చాలా ఏండ్లుగా దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం వక్ఫ్‌ చట్ట సవరణ చేపట్టి, కొన్ని అభ్యంతరకరమైన నిబంధనలను చేర్చింది. ఈ చట్ట సవరణలు ఏకపక్షంగానూ, వివక్షతోనూ ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర సంస్థలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. 1923 నుంచి అమల్లో ఉన్న వక్ఫ్‌ బోర్డు చట్టాలను, నిబంధనలను పరిగణనలోకి తీసుకొని మధ్యంతర తీర్పు ఇస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆస్తిని దానం చేసే వ్యక్తి కనీసం ఐదేండ్లు ఇస్లామ్‌ని పాటించి ఉండాలనే నిబంధన మీద సుప్రీం స్టే విధించింది. ఇస్లాం అవలంబనను ఏ విధంగా గుర్తిస్తారో విధి విధానాలు రూపొందించేదాకా దాని అమలు నిలిపేయాలని పేర్కొంది.

వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల సంఖ్య కేంద్ర బోర్డుల్లో నాలుగు, రాష్ట్ర బోర్డుల్లో మూడు మించరాదని చెప్పి, ముస్లిం సభ్యులే మెజారిటీ ఉండాలని స్పష్టపరిచింది, బోర్డు ఛైర్మన్‌గా వీలైనంత మేర ముస్లింనే నియమిస్తే మంచిదని సూచించింది. వక్ఫ్‌ వివాదాల్లో సవరణ చట్టం జిల్లా కలెక్టరుకు దఖలు పర్చిన అధికారాలను ధర్మాసనం పూర్తిగా నిలిపివేసింది. ఏ కార్యనిర్వాహక అధికారీ తీర్పులు ఇవ్వజాలడని, అది అధికారాల విభజన చట్టానికి విరుద్ధమని నొక్కి వక్కాణించింది. తద్వారా, వక్ఫ్‌ భూముల వివాదాలు చాలాచోట్ల ప్రభుత్వంతోనే ముడిపడి ఉన్నందున, కలెక్టరుకు నిర్ణయాధికారాలు అప్పగిస్తే అది అన్యాయానికి తావిస్తుందన్న పిటిషనర్ల వాదనను బలం చేకూరింది. వక్ఫ్‌ భూములు లేదా ఇతర ఆస్తులు కొన్ని సందర్భాల్లో ఎలాంటి అధికార పత్రాలూ లేకుండానే బోర్డుకు దఖలు పడతాయి. అన్నింటినీ రిజిస్ట్రేషన్‌ పరిధిలోకి తీసుకురావాలన్న సవరణ చట్టం నిబంధనను ధర్మాసనం బలపర్చింది. వక్ఫ్‌ బై యూజ్‌ తొలగింపును సమర్ధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఆగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌ ల ధర్మాసనం వెలువరించిన ఈ 128 పేజీల మధ్యంతర తీర్పు.. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని, పక్షపాత వైఖరిని వేలెత్తి చూపిందనటంలో సందేహం లేదు. గత ఏప్రిల్‌ రెండో తేదీన వాదోపవాదాల మధ్య అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో బిల్లును ఆమోదించటం, వెంటనే రాష్ట్రపతి గెజిట్‌ విడుదల చేసి, అమల్లోకి తేవటం, చట్టంపై ఊరూరా ప్రచారం చేయాలని పిలుపునివ్వటం ద్వారా రాజకీయ ఎజెండాగా దానికి బీజేపీ ఎంతటి ప్రాధాన్యాన్ని ఇస్తున్నదో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పు ప్రజాస్వామ్యవాదులకు, సెక్యులర్‌ శక్తులకు కొత్త బలాన్నిచ్చింది. తుది తీర్పు కూడా ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆశిద్దాం.

ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -