తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ప్రకటించండిి
19 లోపు వెబ్‌సైట్‌లో పెట్టాలి
తొలగింపునకు గల కారణాలూ ప్రచురించాలి
22 నాటికి దానిపై నివేదికను ఇవ్వాలి : బీహార్ ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే కాంక్షతో ‘సర్’ కుట్రకు కేంద్రం తెరలేపిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకొని, ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డతోవల్ని తొక్కేందుకు మోడీసర్కార్ సిద్ధమైంది. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే పార్లమెంటు వేదికగా నిరసన గళం ఎత్తి దేశానికి వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ దశలో అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ‘సర్’పై అనేక సందేహాలను లేవనెత్తింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలతో పాటు తొలగింపు కారణాలను వెల్లడిస్తూ వెబ్‌సైట్‌లో వివరంగా పెట్టాలని సీఈసీని ఆదేశించింది. ఇప్పటికే ఆ జాబితాలో మరణించిన ఓటర్లుగా పేర్లు తొలగించబడిన కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టు ఎదుట హాజరై, తాము బతికే ఉన్నామనీ, మా ఓట్లు ఎందుకు తీసేశారో తెలీదని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ‘సుప్రీం’ ఆదేశాల అమల్లో సీఈసీ ఇంకేం జిమ్మిక్కులు చేస్తుందో వేచిచూడాలి!!
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. బీహార్‌లో ‘సర్’ పేరుతో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. ఏ కారణాలతో వారిని జాబితా నుంచి తొలగించారో స్పష్టం చేయాలనీ, వీటన్నింటినీ ఈనెల 19వ తేదీలోపు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టాలని చెప్పింది. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 22 న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అలాగే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు ఆధార్ కార్డు సమర్పించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణను జరిపింది. ఈ సందర్భంగా ఈసీ తన వాదనలు వినిపించింది. ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి అధికారాలు ఉన్నాయని తెలిపింది. పార్టీల పోరు మధ్యలో చిక్కుకున్నామనీ, గెలిస్తే ఈవీఎంలు మంచివనీ, ఓడిపోతే చెడ్డవనే ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఈసీ వివరిం చింది. ఓటర్ల జాబితాలో మరణించిన, వలసవెళ్లిన, ఇతర నియోజకవర్గాలకు తరలిన ఓటర్ల పేర్లను ఎందుకు వెల్లడించలేరని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆ పేర్లను ఎందుకు బహిర్గతం చేయకూడదని ఆదేశించింది. చనిపోయారన్న కారణంతో 22 లక్షల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించినట్టు కథనాలు వచ్చిన విషయం విదితమే.
అయితే బూత్‌లెవల్ స్థాయిలో దీనిని ఎందుకు బహిర్గతం చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ప్రశ్నించింది. రాజకీయ పార్టీలపై పౌరుల హక్కులు ఆధారపడటం తమకు ఇష్టం లేదని తెలిపింది. ఐతే తొలగించిన ఓట్ల జాబితాను రాజకీయపార్టీలకు ఇచ్చినట్టు ఈసీ వెల్లడించింది. జిల్లా స్థాయిలో ఈ వివరాలను పంచుకునేందుకు సిద్ధమని తెలిపింది. ఈ క్రమంలోనే ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలను ఆగస్టు 19 నాటికి బహిర్గతం చేయాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. తొలగింపునకు కారణాలు కూడా ప్రచురించి.. జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. వార్తాపత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచా రం కల్పించాలని సూచించింది. తన ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఆగస్టు 22లోగా నివేదికను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తొలగిం పునకు గురైన ఓటర్ల జాబితాను ప్రచురించాల్సిన బాధ్యత ఈసీకి ఏర్పడింది.
సర్ దుమారం
బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పని చేస్తు న్నదని ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియకు సంబం ధించి ఇప్పటికీ అనేక లోపాలు బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ తోసిపుచ్చుతున్నది. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వివరణలు ఇస్తున్న విషయం విదితమే. ఇక ‘ఓట్ చోరీ’ పేరుతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
సుప్రీం కొరడా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES