నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ సీనియర్ నాయకులు,జాతీయ ప్రధాన మాజీ కార్యదర్శి,పార్లమెంట్ మాజీ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ సలీం మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుండే వామపక్ష భావజాలంతో పెరిగారు అని, విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ జాతీయస్థాయి కమ్యూనిస్టు గా ఎదిగారని కొనియాడారు.
ఎన్నో విద్యార్థి యువజన ప్రజా ఉద్యమాలలో తనదైన ముఖ్య భూమిక పోషించి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కై పాటు పడ్డారని అన్నారు.విద్యార్థి రంగంలో, కమ్యూనిస్టు పార్టీలో అంచలంచలు గా ప్రజలతో మమేకమై పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా వెలకట్టలేని సేవలు అందించారని అన్నారు.ఒక పర్యాయం ఎమ్మెల్యేగా,రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై పేద ప్రజల గొంతును ప్రజా దర్బారులో వినిపించిన ఘనత ఆయనకు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి జాతీయస్థాయిలో తీరని లోటు అని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే ఆయనకు మనం నిజంగా అర్పించే నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ,అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్,సహాయ కార్యదర్శి జక్కం బలరాం, మహిళా నాయకులు చీపుల సత్యవతి, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు చల్లా రమాదేవి,వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు సూర్య కుమారి,ఎస్.కె రసూల్ బీ,ఏఐటీయూసీ నాయకులు ఉప్పెర్ల ముత్తు,దూరం పోషియ్య,సత్యనారాయణ,వాసు,రమేష్ ,సిద్ధి వెంకటేశ్వర నగర్ వాసులు మరియు సిపిఐ పార్టీ శ్రేణులు,ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.