ఉదయం 9.30 గంటలకు మఖ్దూం భవన్‌కు భౌతికకాయం
ప్రజల సందర్శనార్దం మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే
నివాళులర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి,
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వామపక్ష నేతలు
అనంతరం గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర
వైద్యకళాశాలకు భౌతికకాయాన్ని అప్పగించనున్న సీపీఐ నేతలు, కుటుంబ సభ్యులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ అగ్రనేత, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అంతిమయాత్రను ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమారుడు నిఖిల్ అమెరికా నుంచి రావాల్సి ఉన్నందున భౌతికకాయాన్ని కొండాపూర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలోగల మార్చురీలో ఉంచారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు అక్కడి నుంచి హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు భౌతికకాయాన్ని తరలిస్తారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం మూడు గంటల వరకు అక్కడే ఉంచుతారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతోపాటు వామపక్షాలు, ఇతర పార్టీలకు చెందిన నేతలు సురవరం భౌతికకాయానికి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి అధికారిక లాంఛనాలతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత సురవరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన భౌతికకాయాన్ని సీపీఐ నేతలు గాంధీ వైద్య కళాశాలకు అప్పగిస్తారు.
ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
సురవరం మరణం ప్రజాస్వామ్య హక్కులకు తీరని లోటని పేర్కొంటూ సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరపున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రెండు దఫాలు పార్లమెంట్ సభ్యుడిగా సురవరం శ్రామికవర్గాల తరపున తన వాణిని బలంగా వినిపించారని స్మరించుకున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల తరపున, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. వర్గ పోరాటాలను ముందుకు నడిపించేందుకు ఆయన నిర్విరామంగా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, పాలకవర్గాలే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో, మతోన్మాదం పెచ్చరిల్లుతున్న సందర్భంలో సురవరం లాంటి నేతను కోల్పోవటం సీపీఐకేగాక దేశానికి, వామపక్ష ఉద్యమాలకు, ప్రజాస్వామ్య హక్కులకు తీరని నష్టమని వెస్లీ పేర్కొన్నారు. శ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం, వారి హక్కుల సాధనకోసం, లౌకిక ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాలను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి, మతోన్మాద రాజకీయాలను ఓడిరచడమే సురవరానికి నిజమైన నివాళి అని ఆయన తెలిపారు.- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
జూలకంటి సంతాపం
సురవరం మరణం పట్ల సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఒక ప్రకటనలో తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి మొదలుకుని పార్లమెంటేరియన్ దాకా ఆయన దేశానికి, ప్రజలకు ఎనలేని సేవలందించారని పేర్కొన్నారు. నల్లగొండ ఎంపీగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని నివాళులర్పించారు.
సీపీఐ నేతల నివాళులు…
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఎంపీగా సురవరం ప్రజలకు, దేశానికి చేసిన సేవలను ఆ పార్టీ నేతలు స్మరించుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మెన్ కే శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతోపాటు పలువురు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు… సురవరం చిత్రపటానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు.
అత్యంత సౌమ్యుడు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎదగటం సురవరం వ్యక్తిత్వానికి, పనితనానికి నిదర్శనమని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారికి సురవరం గర్వకారణమైన వ్యక్తి అని కొనియాడారు. అత్యంత సౌమ్యుడు, మృదుస్వభావి అయిన సురవరం మరణం పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, సీపీఐ సానుభూతిపరులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారు : ఎన్.రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సురవరం మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వ్యక్తి సురవరమని పేర్కొన్నారు. నిరంతరం పేదల పక్షాన్నే పోరాడిన గొప్ప నేత సురవరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంతాపం ప్రకటించారు.
కోదండరెడ్డి సంతాపం, చామల నివాళి
సురవరం మరణం పట్ల రాష్ట్ర రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. యువజన సంఘాల్లో పని చేసే నాటి నుంచే తాను, సురవరం మంచి స్నేహితులమని పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నాయకులుగా తామిద్దరమూ కలిసి పనిచేసిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. సురవరం భౌతిక కాయాన్ని సందర్శించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఉద్యమాల్లో చురుకైన పాత్ర : సీఐటీయూ
రాష్ట్రంలో జరిగిన అనేక ప్రజాతంత్ర, కార్మికోద్యమాల్లో సురవరం చురుకైన పాత్ర పోషించారని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో పాలకులు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలు జరగాల్సిన తరుణంలో సురవరం మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మికోద్యమానికి తీవ్ర నష్టమని పేర్కొంటూ వారు సంతాప ప్రకటన విడుదల చేశారు.
సీఎంకు ధన్యవాదాలు : కూనంనేని
సురవరం అంతిమయాత్రను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలంటూ తాము సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని కూనంనేని తెలిపారు. ఆయన వెంటనే దానికి అంగీకరించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.