బీఆర్‌ఎస్‌లోనే ఉంటే…నేటి ఎల్పీ సమావేశానికి వస్తారా?
పార్టీ మారినట్టు ఆధారాల్లేవన్న స్పీకర్
బీఆర్‌ఎస్ శాసనసభ్యులేనని చెప్పిన సీఎం
అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు అంగీకరించారు : కేటీఆర్
నేడు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ కార్యవర్గం కూడా…
భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్‌ఎల్పీ, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ శనివారం మధ్యాహ్నమే నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇంకోవైపు ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి (గద్వాల), టి ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి) పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాల్లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈనెల 17న తీర్పును వెల్లడించారు. వారిపై ఉన్న అనర్హత పిటిషన్లను కొట్టేశారు. దీంతో వారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే పరిగణించబడతారు. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ల), ఎం సంజయ్ కుమార్ (జగిత్యాల), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) అనర్హత పిటిషన్లపై త్వరలోనే తీర్పును వెల్లడించే అవకాశమున్నది.
ఆ పదిమంది ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగే బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పుడు బంతి ఎమ్మె ల్యేల కోర్టులోనే ఉన్నది. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా మంటూ చెప్తున్నా ఆ పార్టీ కార్యక్రమాల్లో వారు పాల్గొనడం లేదు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశానికి హాజరు కాకుంటే పార్టీ మారినందునే రాలేదని బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు చెందిన వారేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటిం చారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు స్పీకర్ బులెటిన్ విడుదల చేసినపుడు బీఆర్‌ఎస్ సభ్యులుగానే పరిగణించబడుతున్నారని గుర్తు చేశారు. వారిని కలుపుకుని సంఖ్య ఆధారంగా ఎక్కువ సమయం కావాలంటూ హరీశ్‌రావు స్పీకర్‌ను అడుగుతారని చెప్పారు. అయితే స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేయడాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వ్యాఖ్యానించింది. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాలా సార్లు బహిరంగంగా ప్రకటించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై తాము న్యాయ పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు.
కృష్ణా, గోదావరి జలాల హక్కులపై బీఆర్‌ఎస్ పోరాటం
బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ఆది వారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభంకానుంది. ఇందులో పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్టు తెలిసింది. ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణ కోసం పోరాటానికి సిద్ధం కావాలని భావిస్తున్నట్టు తెలిసింది. కృష్ణా, గోదావరి జలాలను రక్షించుకోవడానికి ఉద్యమ కార్యాచరణ రూపొందించే అవకాశమున్నది.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భావిస్తున్నది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి బీఆర్‌ఎస్ గట్టిపోటీ ఇచ్చింది. 3,511 (27.64 శాతం) సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అధిక స్థానాల్లో విజయం సాధించడంతో ఆ పార్టీలో జోష్ వచ్చింది. ఇదే స్ఫూర్తితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశమున్నది. పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలపై పోరాటం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించనుంది.



