Tuesday, March 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం11మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌

11మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్‌

- Advertisement -

రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై హౌస్‌ కమిటీ వేయాలని డిమాండ్‌
మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు
గంటపాటు చైర్మెన్‌ పోడియం వద్ద ఆందోళన
వివిధ బిల్లులకు సంబంధించిన ప్రతులు, పుస్తకాలు చించివేత
సస్పెన్షన్‌కు మంత్రి తీర్మానం
ఎనిమిది బిల్లులకు శాసనమండలి ఆమోదం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శాసనమండలి కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని, సభా సంప్రదాయాలకు భంగం కలిగిస్తున్నారని 11 మంది బీఆర్‌ఎస్‌ సభ్యులను చైర్మెన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి సస్పెండ్‌ చేశారు. బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన సోమవారం ఒక రోజు ఈ సస్పెన్షన్‌ వర్తిస్తుందని వెల్లడించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. అక్రమ మైనింగ్‌ విషయంలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ వ్యవహారంపై సభా సంఘం వేయాలనీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సభ్యులు సభా మర్యాదను పాటించాలనీ, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని చైర్మెన్‌ పదేపదే విజ్ఞప్తి చేసినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గలేదు. వివిధ బిల్లులకు సంబంధించిన పేపర్లు, పుస్తకాలను చించి చైర్మెన్‌ వైపు విసిరేశారు. అడ్డుకునేందుకు మార్షల్స్‌ ప్రయత్నించినప్పటికీ సభ్యులు బల్లలు ఎక్కి తమ నిరసనను కొనసాగించారు.

దాంతో వారిని బలవంతంగా కిందికి దింపడంతో తిరిగి పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు. ఈ దశలో మార్షల్స్‌కు, బీఆర్‌ఎస్‌ సభ్యులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఈ అంశంపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. సభ సజావుగా సాగేందుకు బీఆర్‌ఎస్‌ సభ్యులు సహకరించాలని కోరారు. సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని మండలి ఛైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం కోరారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న మంత్రి శ్రీధర్‌బాబు పెద్దల సభ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్‌ చేయాలని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో సోమవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను మండలి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు చైర్మెన్‌ ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు సభను వీడాలని చైర్మెన్‌ కోరినప్పటికి నిరసన కొనసాగించడంతో తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో పాటు పలువురు సభ్యులను మార్షల్స్‌ బలవంతంగా సభ నుంచి బయటకు తీసుకెళ్లారు.

సస్పెన్షన్‌కు గురైన సభ్యుల వివరాలు
మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్‌, ఎల్‌. రమణ, రవీందర్‌రావు, మధుసూదన్‌, వాణీదేవి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎం.కోటిరెడ్డి, యాదవరెడ్డి, సుంకరి రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి.

ఎనిమిది బిల్లుల ఆమోదం
బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన సోమవారం శాసనమండలి ఎనిమిది బిల్లులను ఆమోదించింది. తెలంగాణ రెగ్యూలేషన్‌ ఆఫ్‌ అపాయిమెంట్స్‌ థర్డ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2026, ”తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, జవాబుదారితనం, పర్యవేక్షణ బిల్లు-2026”, గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ బిల్లు-2026, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ రిపీల్‌ బిల్లు-2026, పంచాయతీ రాజ్‌ థర్డ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు-2026, గిగ్‌ వర్కర్స్‌ రిజిస్ట్రేషన్‌ బిల్లు-2026, తెలంగాణ వ్యాట్‌ బిల్లు, అడ్వకేట్స్‌ ప్రొటక్షన్‌ బిల్లు-2026లను స్వల్పకాలిక చర్చ అనంతరం సభ ఆమోదించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -