ప్రతిపక్షాలకూ సమాన అవకాశాలు ఇవ్వాలి : కాంగ్రెస్ చీఫ్ విప్, ఎంపీ సురేశ్ జన్
విశ్వాస్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. మంగళవారం కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్ మాట్లాడుతూ ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ సురేశ్ ప్రతిపాదనకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేత ధర్మేంద్ర యాదవ్ మద్దతు ఇచ్చారు. ట్రెజరీ బెంచ్‌లు కూడా హుందాగా వ్యవహరించాలని ధర్మేంద్ర యాదవ్ అన్నారు. సభా వ్యవహారాలను సజావుగా నడిపేందుకు లక్ష్మణ రేఖ గీయాల్సి వస్తుందని మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని, ప్రతిపక్షాలకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని సురేశ్ కోరారు. అయితే ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్లకార్డులను ప్రదర్శించరాదని, కృత్రిమ మేధ (ఏఐ) జనరేటెడ్ ఫొటోలను వాడవద్దని సభ్యులను బిర్లా కోరారు. ఎనిమిది మందిపై సస్పెన్షన్ రద్దు తీర్మానాన్ని సభ ఆమోదించింది. సస్పెన్షన్ రద్దు అయిన ఎంపీల్లో సీపీఐ(ఎం)కు చెందిన ఎస్.వెంకటేశన్, కాంగ్రెస్ ఎంపీలు గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబ్బి ఈడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మానికం ఠాగూర్, ప్రశాంత్ పడోల్, డిన్ కురియకోస్ ఉన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆ ఎనిమిది మంది ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. దీంతో బడ్జెట్ సమావేశాల మొదటి విడతలో ఫిబ్రవరి 3న సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలు 43 రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాల రెండో విడత సమావేశాలకు హాజరుకానున్నారు.
ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
- Advertisement -
- Advertisement -



