Wednesday, January 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం పనుల నిలిపివేత

మేడారం పనుల నిలిపివేత

- Advertisement -

– భక్తుల సౌకర్యార్ధమే.. : అధికారులు ొ జాతర అనంతరం మరో నెలరోజులు కొనసాగింపు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులను నెలరోజుల పాటు నిలిపివేశారు. ఆది, సోమవారాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు కేబినెట్‌ భేటీ, బహిరంగసభ అనంతరం ఈ పనులను అధికార యంత్రాంగం నిలిపివేసింది. సోమవారం గద్దెలు, ప్రాంగణం పునర్మిర్మాణ పనుల పైలాన్‌ను ఆవిష్కరించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం విదితమే. సీఎం పర్యటన నేపథ్యంలో రాత్రింబవళ్లు పనులు చేసి గద్దెలు, ప్రాంగణం, ప్రాకారం పనులను కొలిక్కి తీసుకువచ్చినా, మరో నెల రోజుల పాటు చేయడానికి పనులు మిగిలిపోయి ఉన్నాయి. ఈలోపు జాతర సమీపించడం, భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పనులు కొనసాగిస్తే భక్తులకు తీవ్ర ఆటంకం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావించిన అధికారులు.. పనులను వెంటనే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. జాతర ముగిసే వరకు గద్దెలు, ప్రాకారం వద్ద పనులు జరగవు. జాతర ముగిశాక మరో నెల రోజుల్లో పనులను పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు.

మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, ప్రాంగణం పునరుద్ధరణ పనులను సరిగ్గా రెండున్నర నెలల్లోనే ఈ దశకు చేర్చామని సంబంధిత గుత్తేదారు స్పష్టం చేశారు. అక్టోబర్‌లో అగ్రిమెంట్‌ చేసుకున్నాక పనులను ప్రారంభించామని వివరించారు. రూ.101 కోట్ల ఈ పునర్నిర్మాణ పనులకు యుద్ధప్రాతిపదికన ఏకకాలంలో అన్ని పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా నుంచి వైట్‌ గ్రానైట్‌, శాండ్‌ స్టోన్‌ తెప్పించి ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, వారి ఇలవేల్పులు, జీవన విధానం ప్రతిబింబించేలా శిల్పులతో చెక్కించి సీఎం పర్యటన నాటికి భారీ రాతి స్తంభాలను నిలబెట్టగలిగారు. సీఎం సందర్శించేనాటికి గద్దెలు, ప్రాకారాన్ని ఒక రూపానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.

మిగిలిపోయిన పనులు
ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై ఆదివాసీ గుర్తులు పూర్తిస్థాయిలో అన్నింటిపై అమర్చలేకపోయారు. మెయిన్‌ ద్వారం వద్ద, మరో ద్వారం పైన మాత్రమే అమర్చగలిగారు. మరో 6 రాతి ద్వారాలపై మరిన్ని నిగిషీలను అమర్చాల్సి ఉంది. అదేవిధంగా భారీ రాతి స్తంభాలపై పలు బొమ్మల పాలిషింగ్‌ పనులు సైతం నిలిచిపోయాయి. రాతి స్తంభాలపై అడ్డంగా అమర్చిన భారీ దిమ్మలపై పలు దిమ్మలను అమర్చాల్సి ఉంది. ఒక్కో రాతి ద్వారంపై అడ్డంగా మూడు దిమ్మ ముక్కలను అమర్చారు. వాటి మధ్య గ్యాప్‌లు కనపడుతున్నాయి. వాటిని సరిచేసి అతికించాల్సి ఉంది. గద్దెల ప్రాంగణంలో పరిచిన వైట్‌ గ్రానైట్‌ను పాలిషింగ్‌ చేసే పనులు సైతం పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ పనులన్నీ పూర్తి కావడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. జాతర ముగిశాక పారిశుద్ధ్యం పనులు ముగిశాకే మిగతా పెండింగ్‌ పనులను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండు, మూడు నెలలు పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -