Wednesday, September 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండెక్కన్‌ సిమెంట్స్‌లో కార్మికుని మృతిపై అనుమానాలు!

డెక్కన్‌ సిమెంట్స్‌లో కార్మికుని మృతిపై అనుమానాలు!

- Advertisement -

నిజ నిర్ధారణ కోసం వచ్చిన సీఐటీయూ నాయకులకు అనుమతి నిరాకరణ
పోలీస్‌ పహారాలోనే కర్మాగారం

నవతెలంగాణ- పాలకీడు
సూర్యాపేట జిల్లా పాలకీడు మండల పరిధిలోని భవానిపురం డెక్కన్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఇంకా పోలీసు పహారాలోనే ఉంది. ఆదివారం రాత్రి జరిగిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుడు నవీన్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి మంగళవారం సీఐటీయూ జిల్లా నాయకులు ఘటనా స్థలానికి వెళ్లగా.. పోలీసులు పరిశ్రమలోకి అనుమతించలేదు. పరిశ్రమ యాజమాన్యం కార్మిక సంఘంతో చర్చించడానికి సుముఖత చూపినా.. పోలీసులు అనుమతించకపోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. పరిశ్రమ బయట ఉన్న కొంతమంది ఇతర రాష్ట్రాల వలస కూలీలను కలిస్తే.. వారు నాయకులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాంట్రాక్టర్‌ కనీస వేతనాలు ఇవ్వడం లేదని, భద్రత, నివాసం, ప్రమాద బీమా లాంటివి ఏవీ ఇవ్వడని, తమ ప్రాణాలకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పరిశ్రమలో జరిగిన కార్మికుని మృతి దురదృష్టకరమన్నారు.

పరిశ్రమ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ముందు చూపు లేకపోవడంతోనే ఘర్షణ వాతావరణం నెలకొందని తెలిపారు. నివాస ప్రదేశంలో కాలుజారి పడటంతో కార్మికునికి ప్రమాదం జరిగిందని, మరోవైపు పని ప్రదేశంలోనే ప్రమాదం జరిగి మృతిచెందాడని.. ఇలా రెండు వాదనలు బలంగా వినపడుతున్నాయని తెలిపారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా అని ప్రశ్నించారు. వాస్తవాలను తెలుసుకోవడానికి వచ్చిన తమను పరిశ్రమ ప్రాంగణంలోకి, కనీసం కాంట్రాక్ట్‌ కార్మికులు నివాసముండే ప్రదేశాన్ని కూడా చూడనివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. యాజమాన్యం, కార్మికులతో జరిగిన వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి వచ్చామని స్పష్టం చేశారు. సిమెంట్‌ పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టర్లతో చేతులు కలిపి వలస కూలీల శ్రమను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా.. ఘర్షణ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కార్మికులు ఎంత మంది? వారిని ఎక్కడ ఉంచారన్న సమాచారం ఇవ్వకపోవడం ఏంటని నాయకులు ప్రశ్నించారు. వలస కార్మికులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయని, దీనిపై జిల్లా ఎస్పీ స్పందించాలని కోరారు. సిమెంట్‌ పరిశ్రమల్లో 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై లేదా అని ప్రశ్నించారు. తక్కువ వేతనాలకు కూలీలు వస్తున్నారనేదే చూడకుండా, కాంట్రాక్టర్లతో కార్మిక చట్టాలు అమలు చేయించాలని డిమాండ్‌ చేశారు. త్వరలో ఈ ఘటనపై వాస్తవాలను పోలీసులు ఆధారాలతో బయట పెట్టకపోతే అన్ని కార్మిక సంఘాలతో కలిసి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిమెంట్‌ క్లస్టర్‌ వర్కర్స్‌ యూనియన్‌ కన్వీనర్‌ ఒట్టేపు సైదులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, నాయకులు అనంత ప్రకాష్‌, యాకూబ్‌, డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షులు నన్నెపంగ రమేశ్‌, మాజీ జెడ్పీటీసీ ముషం నర్సింహ, మాజీ ఎంపీటీసీ దొంగరి వెంకటయ్య, స్థానిక నాయకులు పురుషోత్తం రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -