– సూర్యాపేట జిల్లా నడిగూడెంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘటన
నవతెలంగాణ-కోదాడటౌన్
పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతుల కుమార్తె తనూజ మహాలక్ష్మి (14) మూడేండ్ల కింద కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతిలో అడ్మిషన్ పొందింది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. వ్యక్తిగత కారణాలతో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు ఇంటికి వెళ్లి 7న తిరిగి పాఠశాలకు వచ్చింది. గత ఆదివారం మహాలక్ష్మిని కలిసేందుకు తల్లి వసుంధర రాగా సోమవారం తండ్రి కూడా వచ్చివెళ్లారు. రాత్రివరకు తోటి విద్యార్థినులతో కలిసి చదువుకున్న విద్యార్థిని తరగతి గదిలోని ఫ్యాన్‌కి చున్నీతో ఉరేసుకుని చనిపోవడంతో తోటి విద్యార్థులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాఠశాలను సూర్యాపేట డీఈఓ అశోక్, నడిగూడెం ఎంఈఓ ఉపేందర్‌రావు సందర్శించి విద్యార్థిని మృతికి గల కారణాలను ఆరా తీశారు. విద్యార్థిని మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాఠశాల టీచర్ల ఒత్తిడి వల్లే విద్యార్థిని చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థిని అనుమానాస్పద మృతి
- Advertisement -
- Advertisement -