నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన పోలం రాజేందర్ (23) బయ్యారం వైపు వెళ్తున్న సమయంలో కాటారం జెన్‌కో పంప్ హౌస్ ఎదురుగా ఉన్న గేట్ వాల్ సంపులో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



