తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై మృతదేహం లభ్యం
ఇది హత్య అంటూ మృతుని సోదరుడు ఆరోపణ
తిరుపతి : పరకామణి కేసులో కీలక సాక్షి, నిందితుడు, టిటిడి మాజీ ఎవిఎస్‌ఒ సతీష్‌కుమార్ (52) అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందారు. శుక్రవారం ఉదయం తాడిపత్రి-గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి జూటూరు రైల్వేస్టేషన్ల అప్‌డౌన్ ట్రాక్‌ల మధ్య విగత జీవుడై ఉన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జిఆర్‌పి రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆయన పరకామణి కేసులో విచారణ నిమిత్తం గురువారం రైల్లో తిరుపతికి బయల్దేరినట్లు సమాచారం. సంఘటనా స్థలాన్ని ఐజి షిమోషీ, ఎస్‌పి జగదీష్, రైల్వే పోలీసులు పరిశీలించారు. గుత్తి సిఆర్‌పి సిఐ అజరుకుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 2023 ఏప్రిల్‌లో తిరుమలలో పరకామణి సందర్భంగా విదేశీ డాలర్లను దొంగతనం చేస్తుండగా పరకామణి ఉద్యోగి రవికుమార్‌ను అప్పట్లో టిటిడి ఎవిఎస్‌ఒగా ఉన్న సతీష్‌కుమార్ పట్టుకొని తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.
ఆ తర్వాత ఈ కేసు లోక్‌అదాలత్‌లో రాజీ అయ్యింది. కొందరు వైసిపి నాయకులు, టిటిడి ఉన్నతాధికారులు, పోలీసుల ఒత్తిడి ఇందుకు కారణమని, రాజీ వ్యవహారంలో సతీష్‌కుమార్ కీలకంగా వ్యహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరకామణి కేసును తిరగదోడింది. సతీష్‌కుమార్‌పైనా కేసు పెట్టింది. ఈ కేసులో ఆయనే కీలక సాక్షిగా కూడా ఉన్నారు. సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్నార్ బృందం కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల ఆరున సతీష్‌కుమార్‌ను తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో విచారించింది. ఈ నెల 14న (శుక్రవారం) మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. టిటిడిలో సంచలనంగా మారిన పరకామణి కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నందునే కేసును తారుమారు చేయడానికి హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సతీష్‌కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ.
హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారు : మృతుని సోదరుడు
తన అన్నను హత్య చేసి ట్రాక్ పక్కన పడేశారని, ఇది ముమ్మాటికి హత్యే అని మృతుడు సతీష్ కుమార్ తమ్ముడు హరి ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
సిబిఐతో దర్యాప్తు జరిపించాలి : టిటిడి బోర్డు మెంబర్ ఎమ్మెస్ రాజు
ఈ మృతిపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని టిటిడి పాలకమండలి సభ్యులు, మడకశిర శాసనసభ్యులు ఎంఎస్.రాజు ప్రభుత్వాన్ని కోరారు. పరకామణి చోరీ కీలక పాత్రధారులు, సూత్రధారులు ఈ కేసు నుండి బయటపడేందుకు కీలక సాక్షిగా ఉన్న సతీష్‌కుమార్‌ను హత్య చేసి, తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేశారని ఆరోపించారు.
సమగ్ర విచారణ జరపాలి : సిఐటియు
సతీష్‌కుమార్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని, హత్యా లేదా ఆత్మహత్య అనేది ప్రజలకు తెలియజేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి కోరారు. పరకామణి అవినీతి వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముందు నుంచి కోరుతున్నామని పేర్కొన్నారు.
ఇది వైసిపి పనే : శాఫ్ చైర్మన్ రవినాయుడు
పరకామణి చోరీ కేసును పక్కదారి పట్టించేందుకు, అసలు నిందితులను కాపాడేందుకు వైసిపి కుట్రపన్ని సతీష్‌కుమార్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేసిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి, పరకామణి కేసుల్లో ఇతర సాక్ష్యులకు పోలీసులు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది ప్రభుత్వ హత్యే : భూమన కరుణాకర్‌రెడ్డి
ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే. పరకామణి కేసులో రెండు నెలలుగా సతీష్‌కుమార్‌ను వేధించడంతో ఈ బతుకు నాకెందుకంటూ సహచరులకు చెప్పి బాధపడ్డాడని తెలిపారు. సతీష్‌కుమార్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
సతీష్‌కుమార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి హత్యగా అనుమానం
సతీష్‌కుమార్ మృతదేహానికి అనంతపురంలోని సర్వజన ఆస్పత్రిలో ఫొరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం పూర్తయింది. మృతదేహంపై వెనుకవైపు మాత్రమే గాయాలు ఉండడంతో ఇది హత్యగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. రైల్లోనే సతీష్‌కుమార్ తల వెనుక బలంగా కొట్టి కిందకు తోసేసినట్టు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. అనంతపురం చేరుకున్న సిఐడి డిజి రవిశంకర్ పోలీసు గెస్ట్ హౌసులో అధికారులతో సమీక్షించారు. ఎసి బోగిలోని ప్రయాణికుల జాబితాను రప్పించి పోలీసులు విచారణ చేస్తున్నారు.



