తన ‘అత్యాచారాలను’ సరిదిద్దుకోడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ ‘స్థిరంగా’ కొనసాగగలదని, అందువలన దాని ఉనికికి సమాజం నుండి ఏ సవాలూ ఎదురయ్యే పరిస్థితి తలెత్తకుండా చేయవచ్చునని ఆర్థికవేత్తల్లో ఒక అభిప్రాయం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అభిప్రాయం మార్క్సిస్టు అవగాహనకు పూర్తిగా భిన్నమైనది. పెట్టుబడిదారీ వ్యవస్థలోని ‘అత్యాచారాలకు’ ముగింపు ఆ పెట్టుబడిదారీ వ్యవస్థను దాటి కొత్తవ్యవస్థను నిర్మించు కోవడం ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని మార్క్సిస్టులు భావిస్తారు. సరిదిద్దబడి, ఆ కారణంగా ‘స్థిరంగా కొనసాగే’ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే ఒక ఊహాజనిత విచిత్ర జంతువును మనకు చూపిస్తూనే వున్నారు. అది కేవలం ఊహాజ నితమే అన్నది పదే పదే స్పష్టం ఔతున్నప్పటికీ ఆ విచిత్ర జంతువు చిత్రాన్నే మార్చి మార్చి మళ్లీమళ్లీ చూపిస్తున్నారు.
ఇంగ్లీషు ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ పెట్టుబడిదారీ వ్యవస్థలోని ఈ ‘అత్యాచారం’ భారీస్థాయిలో పనుల్లోంచి తొలగించబడడంతో కలిగే నిరుద్యోగం రూపంలో ఈ వ్యవస్థలో అన్ని వేళలా కొనసాగుతూ ఉండడమేనని భావించాడు. ఆర్థిక మాంద్యం సమయంలో ఈ నిరుద్యోగం పలు రెట్లు పెరుగుతుందని, కాని తక్కిన సాధారణ సమ యాల్లో కూడా అది కొనసాగుతుందని గమనించాడు. దీన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని డిమాండ్‌ను (కొనుగోలు శక్తిని) మరింత పెంచడం కోసం జోక్యం చేసుకోవాలని అతడు ప్రతిపాదించాడు. ఆ తర్వాత కీన్స్ సూచిం చిన మార్గంలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని వ్యవస్థను ‘సరిదిద్దినట్టు’ అందరూ భావించారు. కాని దానితో పెట్టుబడి దారీ వ్యవస్థ సరిదిద్దబడలేదు సరికదా మళ్లీ గణనీయంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ కొత్త పరిస్థితుల్లో ఇక ప్రభుత్వం జోక్యం కల్పించుకోగలిగినది కూడా స్వల్పమే.
ఇక మూడవ ప్రపంచపు దేశాల సమాజాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి భారీ మోతాదులో పేదరికం పెరుగుదలకు దారి తీసింది. అత్యధికులకు సమాజంలోని వనరులు (పెట్టుబడి) అందుబాటులో లేకుండా పోయిన ఈ పరిస్థితిని సరిదిద్దడానికి, ఇంకా చెప్పాలంటే వారికి ఎక్కువ వనరులను అందుబాటులోకి తేవడానికి, మైక్రో రుణాలను అందించడం పరిష్కారం అని ప్రతిపాదించారు. అప్పుడు ఈ వ్యవస్థను కూలదోయవలసిన అవసరం తలెత్తదని వాళ్లుచెప్పారు. ఈ భావనను బాగా ఉత్సాహంగా ముందుకు తెచ్చినది ప్రపంచ బ్యాంక్. వెనకబడ్డ కుటుం బాలు పేదరికాన్ని అధిగమించడానికి కావలసిన పెట్టుబడులు వారిని కొల్లగొట్టని రీతిలో (అధిక వడ్డీల రూపంలో) మామూలుగా లభించడం లేదని, అందుకనే వారు తమ జీవన పరిస్థితులను మెరుగు పరుచుకోలేకపోతున్నారని ప్రపంచ బ్యాంక్ చెప్పింది. ఎవరికి వారు కుటీర స్థాయి సంస్థలను ఏర్పాటు చేసుకోడానికి వీలుగా స్వయం-సహాయ బృందాలుగా ఏర్పడాలని సూచించింది. ఆ బృందాలకు తేలికగా ఉండే నిబంధనలపై సంస్థాగత రుణాలను అందించ వచ్చునని, అప్పుడు ఆ బృందాలలోని పేదలు చొరవ తీసుకోగలుగుతారని, చిన్నచిన్న వ్యాపారాలను స్థానికంగా ప్రారంభించి పేదరికం నుండి బయట పడగలుగుతారని చెప్పింది.
ఈ ప్రపంచబ్యాంక్ ప్రతిపాదనలో కొట్టొచ్చినట్టు కనిపించే లోపం ఒకటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్త మయ్యే అరాచక ధోరణులను అదుపు చేయడానికి ప్రభుత్వ జోక్యం పెరగాలని ఎక్కడా ఆ ప్రతిపాదనలో లేదు. ఒకప్పుడు బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా సంస్థాగత రుణాలమీద అంతవరకూ గుత్తసంస్థలకు మాత్రమే ఉన్న అవకాశాలకు కోతపెట్టి కొంతవరకూ వ్యవసాయానికి, చిన్న చిన్న వ్యాపారులకు మళ్లించారు. ఆ విధమైన ప్రభుత్వ జోక్యం వలన పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న అరాచక పద్ధతి, పెట్టుబడి కేంద్రీకరణ కొంతవరకు వెనక్కి తగ్గాయి.
మైక్రో రుణాల గురించి ప్రపంచబ్యాంక్ చేసిన ప్రతిపాదనలో బ్యాంకుల జాతీయీకరణ వంటిది కాని, వేరే ఇతరత్రా పద్ధతుల ద్వారా గాని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఎక్కడా లేదు. మైక్రో రుణాల ద్వారా ఇప్పుడున్న పెట్టు బడిదారీ చట్రం లోపలే పేదరికం, నిరుద్యోగం అంతరిస్తాయని ప్రపంచబ్యాంక్ భావించింది (నిజానికి ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల దృష్టిలో పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎటువంటి అరాచక ధోరణులూ వుండనే వుండవు). అందుచేత ప్రపంచబ్యాంక్ ఈ ప్రతిపాదన ద్వారా ”గాదిలో ధాన్యం గాదిలోనే ఉండాలి కాని బిడ్డలు మాత్రం కుంచాల్లా గుండ్రంగా ఎదిగిపోవాలి” అన్న చందాన ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ మాత్రం యథాతథంగానే చెక్కు చెదరకుండా ఉండాలి కాని పేదరికాన్ని మాత్రం లేకుండా చేయాలి అని వాళ్లు కోరుకుంటున్నారు. అది కూడా ఇంతవరకూ నిరుద్యోగులుగా ఉన్నవారికి పెట్టుబడిదారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడం ద్వారా కాదు, ఆ పేదలే మైక్రోరుణాల ద్వారా వారి పేదరికాన్ని వారే అధిగమించేయాలి!
కాని అన్ని చోట్లా కలిగిన అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కడైనా మైక్రో సంస్థలు పేదవారికి తోడ్పడగలిగాయి అంటే అక్కడల్లా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే తప్ప పెట్టుబడిదారీ వ్యవస్థను ఏ నియంత్రణా లేకుండా విచ్చలవిడిగా విడిచిపెట్టడం వలన కాదు. ఈ సందర్భంలో మనకు కేరళలోని కుటుంబశ్రీ పథకం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సహకార సంస్థలు ఏర్పడి పలు రకాల ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనగలిగాయి. అయితే, ఆ మాదిరిగా ప్రభుత్వ జోక్యం అనేది ఏదీ లేకుండానే మైక్రో రుణాల ద్వారా ఏర్పడే చిన్న చిన్న సంస్థలు పేదరికాన్ని నిర్మూలిస్తాయని ప్రపంచబ్యాంక్ ప్రచారం చేస్తోంది. ఆ పాటనే కొందరు ఆర్థిక నిపుణులు కూడా అందుకున్నారు. పెట్టుబడిదారుల మీద మాత్రం ఎటువంటి అదుపూ ఉండదు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వేల మంది మహిళలను సర్వే చేసి వారి మైక్రో రుణాల అనుభవాలు ఏవిధంగా ఉన్నాయో బహిరంగ విచారణ ద్వారా వారినే సాక్షులుగా పిలిచి వివరించమని కోరింది. ఈ ఏడాది ఆగస్టు 23, 24 తేదీల్లో ఆ విచారణ న్యూఢిల్లీలో జరిగింది.
ఆ విచారణలో వెల్లడైన విషయాలు:
మొదటిది: ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులతో సహా అన్ని వాణిజ్య బ్యాం కులూ ఏ పూచీకత్తులు, డాక్యుమెంట్లు, లేకుండా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడలేదు. అటువంటి పూచీకత్తులను గాని డాక్యుమెంట్లను గాని సమర్పించడం పేద మహిళలకు అసాధ్యమైన పని. అందుచేత పేద కుటుంబాలలోని మహిళలు దాదాపు ఈ సంస్థల నుండి రుణాలను పొందలేక దూరంగానే ఉండిపోవలసి వచ్చింది.
రెండవది: ఇవే బ్యాంకులు పెట్టుబడిదారుల పెత్తనంలో ఉండే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు, మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలను ఇచ్చాయి. ఈ సంస్థలు మధ్యవర్తులుగా వ్యవహరించాయి. ఇవి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీలకు రుణాలు తీసుకున్నాయి. వాటిని పేద లబ్ధిదారులకు అత్యధిక రేటు వడ్డీలకు (అంటే 21 నుండి 26 శాతం దాకా) రుణాలుగా ఇచ్చాయి. అంతకన్నా ఘోరం ఏమంటే, ఈ విధంగా నాన్ బ్యాంకింగ్ సంస్థలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణాలు ఇవ్వడాన్ని వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించడం !
మూడవది: ఈ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ముందు రుణాలను సులువుగా అంది స్తున్నట్టు వ్యవహరించి పెద్దగా డాక్యుమెంట్ల గురించి పట్టుబట్టకుండానే, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్ల ఆధారం గానే రుణాలు ఇచ్చాయి. ఒకసారి రుణం తీసుకున్నాక, ఆ తర్వాత నెలవారీ వాయిదాలను చెల్లించమని ఆ మహిళలను వేధించడం, వారిని నీచంగా మాట్లాడడం, కొన్ని సందర్భాలలో భౌతిక దాడులకు దిగడం కూడా చేస్తున్నాయి.
నాలుగవది: పిల్లల చదువుకయ్యే డబ్బును సమకూర్చుకోవడం కోసమో, ఉన్నట్టుండి జబ్బు పడితే వైద్యాని కయ్యే ఖర్చును భరించడం కోసమో ఎక్కువమంది మహిళలు రుణాలు తీసుకున్నారు. ఇటువంటి ఖర్చుల వలన సమీప భవిష్యత్తులో వారి ఆదాయాలు పెరిగే అవకాశం కనిపించదు. అప్పుడు ఆ అప్పును తిరిగి తీర్చడం కష్టం ఔతుంది. దానికి తోడు చాలా దారుణంగా ఉన్న వడ్డీ రేట్ల వలన ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దీని ఫలి తంగా రుణగ్రహీతలు వేరు వేరు సంస్థల నుండి రుణాలను చాలా ఎక్కువ వడ్డీలకు తీసుకోవలసి వస్తోంది. అంతకు ముందు తీసుకున్న అప్పును చెల్లు వేయడానికి కొత్త అప్పు తీసుకుంటున్నారు. ఈ విధంగా వారు ఒక పెద్ద అప్పుల ఊబిలోకి దిగబడి పోతున్నారు. దానినుండి బయటపడే మార్గం ఏదీ వారికి కనిపించడం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మైక్రో రుణాలు పేదరికం నుండి విముక్తి పొందడానికి దారి చూపుతాయని ప్రపంచ బ్యాంక్ చెప్పినది కాస్తా వారిని మరింత పేదరికం లోకి నెట్టే సాధనాలుగా మారిపోయాయి.
పేదరికాన్ని తొలగించేబదులు, వారిని మరింత పేదరికంలోకి నెట్టే ఈ వైపరీత్యం వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థ నడక లోనే నిబిడీకృతమై వుంది. ఇలా పేదరికాన్ని తగ్గించే బదులు మరింత పెంచేవిధంగా మైక్రో రుణాలు పని చేయడం రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది: పెట్టుబడిదారీ వ్యవస్థ పనిలో స్థూల ఆర్థిక పర్యవసానాలు పలు రూపాల్లో కనిపిస్తాయి. విద్య, వైద్యం వంటి సేవలను ప్రయివేటీకరించడం, దాని ఫలితంగా ఆ సేవలు మరింత ఎక్కువ ఖరీదు కావడం, దాని ఫలితంగా ఆ సేవలను పొందడానికి అప్పులు చేయవలసిరావడం, ఆ అప్పులను తీర్చలేక పోవడం-ఇదంతా ఒక పక్కన జరుగుతూ వుంటుంది. మరో పక్క వినిమయ సరుకుల ఉత్పత్తి రంగాలలో ఏర్పడిన మాంద్యం (ఇటువంటి మాంద్యాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో అనివార్యంగా ఏర్పడతాయి) ఉపాధి అవకా శాలను తగ్గించి వేస్తుంది. దాని ఫలితంగా ఆదాయాలు తగ్గుతాయి. అప్పుడు వారు అప్పులు చేయవలసి వస్తుంది. ఇది పేదలు అప్పుల ఊబిలో దిగబడిపోవడానికి రెండో దారి. అందుచేత పేదలను పేదరికం నుండి విముక్తి చేయడానికి రంగ ప్రవేశం చేసిన మైక్రో రుణ వ్యవస్థ ఈ పెట్టుబడిదారీ చట్రం లోపల ఇరుక్కుని దాని అసలు లక్ష్యం నుండి దారి తప్పుతుంది. ఎందుకంటే సూక్ష్మ (మైక్రో) స్థాయిలో పనిచేసే ఈ రుణవిధానం స్థూల (మాక్రో) స్థాయిలో పైన వ్యక్తమౌతున్న ధోరణులను అడ్డుకోలేదు (అంటే విద్య,వైద్యం వంటి సేవల ప్రయివేటీకరణ వంటి ధోరణులను).
పేదరికాన్ని తొలగించి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను స్థిరంగా కొనసాగేట్టు చేయడానికి రంగంలోకి వచ్చిన ఈ మైక్రో రుణవ్యవస్థను పెట్టుబడిదారీ వ్యవస్థ విడిచిపెట్టదు. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ రంగంలో లాభం వచ్చే అవ కాశం ఉంటుందో దాన్ని వెతుక్కుంటూ, దాని వాసన పట్టుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు మైక్రో రుణవ్యవస్థ పేదమహిళలకు తక్కువ వడ్డీలకు రుణాలివ్వడానికి వచ్చింది. కాని ఆ చౌకవడ్డీలను పెట్టుబడి దారులు నడిపే నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్,మైక్రో ఫైనాన్స్ సంస్థలు కాజేస్తాయి.ఆ ధనాన్నే పేదలకు రుణాలుగా ఇచ్చి అధిక వడ్డీలను గుంజుతాయి. లాభం వచ్చే అవకాశం ఉందన్న వాసన పట్టగానే, అది బడా ఫైనాన్స్‌రంగం కానీయండి, మిలిటరీ పరికరాల ఉత్పత్తి రంగం కానీయండి లేదా మరేదైనా రంగం కానీయండి, దేనినీ పెట్టుబడిదారీ వ్యవస్థ విడిచిపెట్టదు. ఆఖరికి తనను కాపాడేందుకు ప్రవేశించిన మైక్రో ఫైనాన్స్ రంగాన్ని సైతం అది విడిచిపెట్టదు.
ఒక ధృవం దగ్గర సంపదను, రెండో ధృవం దగ్గర పేదరికాన్ని అనునిత్యమూ సృష్టించే సహజ స్వభావం ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను సరిదిద్ది, అది స్థిరంగా కొనసాగేట్టు చేయవచ్చునని అనుకోవడం కేవలం కల్పన మాత్రమే. మైక్రో ఫైనాన్స్ వంటి ఎన్ని వ్యవస్థలను రంగం మీదకు తెచ్చి వాటి ద్వారా ఈ వ్యవస్థకు ‘స్థిరత్వం’ తీసుకురావాలని ప్రయత్నించినా, వాటన్నింటినీ భ్రమాన్వితంగా మార్చివేసేది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్