వికసిత్ భారత్ -2047 అంటూ ప్రచారం ఉవ్వెత్తున సాగుతుండగా
జీడీపీలో కేటాయింపులు నానాటికీ తీసికట్టుగా ఉన్నాయి. రీసెర్చ్ అండ్
డెవలప్‌మెంట్ కోసం జర్మనీ, అమెరికా తమ జీడీపీలో మూడు
శాతానికిపైగా కేటాయిస్తుండగా, చైనా 2.24 శాతాన్ని
కేటాయిస్తుంది. మనం మాత్రం 0.64 శాతానికే పరిమితమయ్యాం.
పైగా యువతను టీస్టాల్లో, పకోడీ దుకాణాలో పెట్టుకొమని ఉచిత
సలహాలిచ్చిన మోడీ గారి ఉద్దేశ్యంలో సర్కారు స్వదేశీ వస్తూత్పత్తులకు
అందించే ప్రోత్సాహం ఇదేనేమో!
అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో ప్రధాని మోడీ మరోసారి ‘స్వదేశీ’ రాగమందుకున్నారు. స్వదేశీ వస్తువుల వాడకాన్ని గర్వంగా భావించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని ‘వోకల్ ఫర్ లోకల్’ విధానం, ‘ఆత్మనిర్భర్ భారత్’ దేశాభివృద్ధికి తోడ్పడతాయని నొక్కిచెప్పారు. మనకు అవసరమైన ప్రతి వస్తువూ స్వదేశంలో తయారైనదే అయి ఉండాలంటూ ”స్వదేశీ మన జీవిత మంత్రంగా మారాలి” అని నొక్కిచెప్పారు. కొన్ని వారాల్లో పండుగల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ భారత్‌లో తయారైన వస్తువులనే కొనాలని సూచించారు. ప్రధాని తీరు చూస్తుంటే ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..’ ఉంది. దేశ సార్వభౌమాధికారాన్నే సవాల్ చేస్తూ ట్రంప్ నిర్ణయాలు ప్రకటిస్తుంటే చేతులు కట్టుకుని కూర్చుని…అగ్రరాజ్యానికి జీ హుజూర్ అంటూ సాగిలపడ్డారే తప్ప ఎదురు మాట్లాడింది లేదు. ఇప్పుడేమో ‘స్వదేశీ’ పాట పాడుతున్నారు.
‘పేరు గొప్ప…ఊరు దిబ్బ’ అన్న చందంగా మారిన మోడీ సర్కారు పథకాల్లో మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లు కూడా చేరి పోయాయి. దేశీయ కంపెనీలను, ఉత్పత్తులను ప్రోత్సహించ డానికి తెచ్చిన ఈ పథకం లక్ష్యాన్ని చేరకపోగా.. ఉన్న పరిశ్రమలకు తాళాలు వేసే పరిస్థితి నెలకొన్నది. పదకొండేండ్లలో దేశవ్యాప్తంగా సుమారు పది లక్షలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయన్నది పచ్చి వాస్తవం. ఆరంభ శూరత్వం తప్ప ఆచరణకు ఆమడ దూరం మన కేంద్రపాలకుల విధానాలు. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు.. కుప్పలుతెప్పలుగా ఆర్భాటపు ప్రకటనలు, స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. అయితే, అందులో ఏ ఒక్కటీ విజయం సాధించిన దాఖలాలు లేవు.
‘ఇవాళ భారతదేశంలో గొప్ప స్టార్టప్‌లు ఏమి ఉన్నాయి? మన శ్రద్ధంతా ఫుడ్ డెలివరీ యాప్స్‌కే పరిమితం. నిరుద్యోగులను చౌకగా దొరికే కూలీలుగా తయారు చేసి, వారిచేత ధనవంతులకు ఇంటిపట్టునే భోజనం అందేలా చేస్తున్నామంతే’ అంటూ స్వయంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల స్టార్టప్ మహాకుంభ్‌లో వ్యాఖ్యలు చేయ్యడం మన ఏలికల చేతకానితనాన్ని సూచిస్తున్నాయి. ఈ దుస్థితికి కారణమెవరు? స్టార్టప్ కంపెనీల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మనమే మూడో స్థానంలో ఉన్నాం. అయినా, భారతావని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన నూతన ఆవిష్కరణలు వెనుకపట్టు పడుతున్నాయి.
డీప్ టెక్, సెమీ కండక్టర్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి రంగాల్లో యువత స్టార్టప్‌లు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు మాత్రమే చేస్తుంది కానీ ఆ దిశగా ఏమైనా ప్రోత్సహిస్తుందా? అంటే అదీ లేదు. వికసిత్ భారత్ -2047 అంటూ ప్రచారం ఉవ్వెత్తున సాగుతుండగా జీడీపీలో కేటాయింపులు నానాటికీ తీసికట్టుగా ఉన్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం జర్మనీ, అమెరికా తమ జీడీపీలో మూడు శాతానికిపైగా కేటాయిస్తుండగా, చైనా 2.24 శాతాన్ని కేటాయిస్తుంది. మనం మాత్రం 0.64 శాతానికే పరిమితమయ్యాం. పైగా యువతను టీస్టాల్లో, పకోడీ దుకాణాలో పెట్టుకొమని ఉచిత సలహాలిచ్చిన మోడీ గారి ఉద్దేశ్యంలో సర్కారు స్వదేశీ వస్తూత్పత్తులకు అందించే ప్రోత్సాహం ఇదేనేమో!
కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఆర్భాట ప్రచారమంతా ఉత్తదేనని తేటతెల్లమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన తయారీ రంగం గతంలో ఎన్నడూ చూడని గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఉత్పాదక రంగంలో వృద్ధిరేటు ఏకంగా పన్నెండు నెలల కనిష్ఠతకు చేరుకోవడమే ఇందుకు రుజువు. కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఉత్పత్తిలో పెరుగుదల కనిపించకుండా పోయిందని జనవరిలో హెచ్‌ఎస్‌బీసీ సర్వే తేల్చిచెప్పింది. దేశంలో నమోదైన 5.93 కోట్ల సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో 577 పరిశ్రమలే దీని ద్వారా లబ్ధిపొందాయి. కేటాయింపులు, అమలుకు మధ్య ఉన్న హస్తమశకాంతర వ్యత్యాసమే రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ రంగాన్ని వెంటాడుతోంది. సెమీ కండక్టర్ల రంగంలో ఓ ఔత్సాహికుడు తన స్టార్టప్‌కు పన్ను రాయితీలివ్వాలన్న అభ్యర్థనను తిరస్కరించింది ఇదే మోడీ సర్కార్. ఈ పరిస్థితులు స్టార్టప్‌లకు ప్రోత్సాహకరంగా ఉంటాయా ప్రధాని గారూ? మనదేశంలో భారీ పెట్టుబడులు, అతి పెద్ద మార్కెట్ ఉన్నా, కొత్త సాంకేతికతల ఆవిష్కరణలను ప్రోత్సహించే, వినియోగించే వాతావరణమే లేదు. అది కల్పించకుండా కేవలం మాటలతో ఈ దేశయువతను బురిడీ కొట్టించడంలో మన ప్రధానిని మించిన వారు లేరు. దేశంలో ప్రతిభ, మార్కెట్, పెట్టుబడులు ఉన్నాయి. కావాల్సిందల్లా సరైన నిర్ణయాలు, అమలు చేయాలన్న చిత్తశుద్ధే!