– టైటిల్ వేటలో పావొలినితో ఢ
– సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ 2025
వింబుల్డన్ చాంపియన్ ఇగా స్వైటెక్ యూఎస్‌ఏలోనూ జోరు కొనసాగిస్తోంది. సిన్సినాటి ఓపెన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న పొలాండ్ భామ నేడు టైటిల్ పోరులో ఇటలీ అమ్మాయి జాస్మిన్ పావొలినితో తలపడనుంది. సెమీస్‌లో కజకిస్తాన్ స్టార్ ఎలెనా రిబకినా, రష్యా భామ వెరొనికాలకు భంగపాటు తప్పలేదు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్, జానిక్ సినర్‌లు నేడు టైటిల్ వేటలో తాడోపేడో తేల్చుకోనున్నారు.
సిన్సినాటి (యూఎస్‌ఏ)
మహిళల సింగిల్స్ అగ్రశ్రేణి క్రీడాకారిణి, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్ ఇగా స్వైటెక్ (పొలాండ్) సిన్సినాటి ఓపెన్‌లో టైటిల్ పోరుకు చేరుకుంది. సిన్సినాటిలో ఆరంభం నుంచీ అద్భుత ప్రదర్శన కనబరిచిన స్వెటెక్ ఆదివారం జరిగిన సెమీఫైనల్లోనూ అలవోక విజయం సాధించింది. తొమ్మిదో సీడ్, కజకిస్తాన్ అమ్మాయి ఎలెనా రిబకినాపై 7-5, 6-3తో స్వైటెక్ వరుస సెట్లలో విజయం సాధించింది. రిబకినా సైతం సిన్సినాటిలో సూపర్ ఫామ్‌తో మెరువటంతో సెమీఫైనల్ నువ్వా నేనా అన్నట్టు సాగుతుందని అంచనా వేశారు. కానీ ఇగా స్వైటెక్ అదరగొట్టింది. ఏడు ఏస్‌లు మూడు బ్రేక్ పాయింట్లతో రిబకినాను చిత్తు చేసింది. పాయింట్ల పరంగా 70-54తో స్వైటెక్ పైచేయి సాధించింది. ఎలెనా రిబకినా 10 ఏస్‌లు సాధించినా.. ఒక్క బ్రేక్ పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. స్వైటెక్ 13 గేములు గెలుపొందగా.. రిబకినా 8 గేములతో సరిపెట్టుకుంది. తొలి సెట్లో స్వైటెక్ సర్వ్ బ్రేక్ చేసిన ఎలెనా.. 5-5తో గట్టి పోటీనిచ్చింది. కానీ వరుసగా రెండు గేముల్లో నెగ్గిన స్వైటెక్ ఆధిక్యం సాధించింది. రెండో సెట్లో స్వైటెక్ జోరు ముంగిట ఎలెనా నిలువలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో మరో సెమీఫైనల్లో వెరొనికా (రష్యా)పై ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) గెలుపొందింది. మూడు సెట్ల ఉత్కంఠ మ్యాచ్‌లో 6-3, 6-7(2-7), 6-3తో జాస్మిన్ పావొలిని విజయం సాధించింది. తొలి సెట్‌ను 6-3తో అలవోకగా నెగ్గిన పావొలిని.. రెండో సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో సెట్లో మరోసారి రెచ్చిపోయిన జాస్మిన్ పావొలిని 6-3తో సులువుగా ఫైనల్లో బెర్త్ దక్కించుకుంది. 2 ఏస్‌లు, మూడు బ్రేక్ పాయింట్లతో జాస్మిన్ పావొలిని మెరువగా.. 10 ఏస్‌లు, ఓ బ్రేక్ పాయింట్‌తో వెరోనికా సరిపెట్టుకుంది. పాయింట్ల పరంగా 102-83తో జాస్మిన్ పావొలిని ఆధిపత్యం నిలుపుకుంది. వెరోనికా 13 గేములు గెలుపొందగా.. పావొలిని 18 గేములతో మెరిసింది.
రాజీవ్ రామ్ అదిరే
సిన్సినాటి ఓపెన్‌లో అమెరికా ఆటగాడు రాజీవ్ రామ్ చరిత్ర సష్టించాడు. 41 ఏండ్లలో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ సాధించిన రాజీవ్ రామ్.. ఈ ఘనత సాధించిన రెండో అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఈ ఏడాదే డానియల్ నెస్టర్ 42 ఏండ్లలో వయసులో ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. సిన్సినాటి ఓపెన్‌లో ఆదివారం జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్లో రాజీవ్ రామ్, నికోల మెక్టిక్ (క్రోయేషియా) జోడీ 4-6, 6-3, 10-5తో ఇటాలియన్ జోడీ లొరెంజో ముసెటి, లొరెంజో సొనెగోపై మూడు సెట్ల పోరులో గెలుపొందారు. తొలి సెట్లో ఓడిన రాజీవ్ రామ్ జోడీ… ఆ తర్వాత రెండో సెట్‌ను అలవోకగా సొంతం చేసుకుంది. టైబ్రేకర్‌లో 10-5తో పైచేయి సాధించి చాంపియన్‌గా నిలిచారు. మహిళల డబుల్స్ ఫైనల్లో గాబ్రియెల, ఎరిన్‌లు 6-4, 6-3తో హన్యు, అలెగ్జాండ్రలపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకున్నారు.
నేడు టైటిల్ పోరు
డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్ ఫైనల్ నేడు జరుగనుంది. ఇటలీ అమ్మాయి జాస్మిన్ పావొలిని గతంలో రెండు డబ్ల్యూటీఏ 1000 టైటిల్స్ సాధించింది. ఈ ఏడాది మేలో ఇటాలియన్ ఓపెన్, గత ఏడాది దుబారు చాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌కు చేరిన జాస్మిన్ విజేతగా నిలిచింది. కెరీర్‌లో మూడోసారి డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న పావొలిని… సిన్సినాటిలో సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్న తొలి ఇటాలియన్ అమ్మాయిగా నిలిచింది. ఇగా స్వైటెక్ నేడు కెరీర్ 11వ డబ్ల్యూటీఏ 1000 టైటిల్ కోసం పోటీపడనుంది. ఇటీవల వరుస టోర్నమెంట్లలో సూపర్ ఫామ్‌లో ఉన్న పొలాండ్ స్టార్‌ను జాస్మిన్ పావొలిని నిలువరిస్తుందేమో చూడాలి.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నం.1 జానిక్ సినర్ (ఇటలీ), వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాస్ (స్పెయిన్) తలపడనున్నారు. టెన్నిస్ చరిత్రలో వరుసగా నాలుగు మెగా ఫైనల్స్‌లో (గ్రాండ్‌స్లామ్స్, మాస్టర్స్ 1000) తలపడుతున్న మూడో జోడీగా సినర్, అల్కరాస్ నిలిచారు. గతంలో ఫెడరర్-నాదల్, జకోవిచ్-నాదల్‌లు సైతం వరుసగా నాలుగు మేజర్ ఫైనల్స్‌లో ఢకొీట్టారు. సినర్, అల్కరాస్ ముఖాముఖి రికార్డులో స్పెయిన్ స్టార్ కార్లోస్ పైచేయి సాధించాడు. మూడుసార్లు టైటిల్ పోరులో తలపడగా అల్కరాస్ 2 నెగ్గగా.. సినర్ ఒకటి గెలుపొందాడు. ఓవరాల్‌గా 8-5తో అల్కరాస్‌దే పైచేయిగా నిలిచింది. ఈ ఏడాది జరిగిన మూడు ఫైనల్స్‌లో ఇటాలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లో సినర్‌పై అల్కరాస్ గెలుపొందగా.. వింబుల్డన్‌లో అల్కరాస్‌ను సినర్ ఓడించాడు. యుఎస్ ఓపెన్‌లోనూ ఈ ఇద్దరు టైటిల్ వేటలో తలపడతారనే అంచనాలు ఉండగా… అంతకుముందు సిన్సినాటిలోనే తాడోపేడో తేల్చుకునేందుకు ప్రపంచ టాప్-2 అథ్లెట్లు సిద్ధమవుతున్నారు.