వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఏదైనా కారం పొడి, కాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది నువ్వుల కారం, పల్లీల కారం, కొబ్బరి కారం వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. అలాగే కొందరు కాకరకాయ కారాన్ని కూడా తయారు చేస్తుంటారు. ఏదైనా రుచిగా చేస్తే ఇంటిల్లిపాదీ వద్దనకుండా కమ్మగా తినేస్తారు. అంతేకాదు ఈ పొడులను నెల రోజుల పాటు తాజాగా నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అలాంటి రుచికరమైన కారం పొడుల తయారీ గురించి ఈరోజు తెలుసుకుందాం…
కాకరకాయ కారం
కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు – 800 గ్రాములు, పల్లీలు – అరకిలో, నూనె – డీప్ ఫ్రైకి తగినంత, కరివేపాకు – రెండు గుప్పెళ్లు, కారం – రుచికి తగినంత, చింతపండు – పెద్ద నిమ్మకాయంత, జీలకర్ర – అరటీస్పూన్, వెల్లుల్లి పాయలు – రెండు(రెబ్బలైతే 40), ఉప్పు – టేస్ట్‌కి సరిపడా
తయారీ విధానం: ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత రౌండ్ షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే కాయలపై ఉండే గరుకు భాగాన్ని లైట్‌గా తొలగించి కూడా వాడుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. కట్ చేసిన కాకరకాయ ముక్కలను బాగా వేయించుకోవాలి. ముక్కలను మంచిగా వేయించుకున్నాక వాటిని ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని బాగా ఆరనివ్వాలి. తర్వాత అదే నూనెలో పల్లీలను వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో కరివేపాకును వేసుకుని క్రిస్పీగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని కాకరకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు, టేస్ట్‌కి సరిపడా కారం, చింతపండు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
అలాగే వెల్లుల్లి, వేయించుకున్న కరివేపాకును కొద్దిగా వేసుకుని ఒకసారి కలిపి అన్నింటినీ మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకుని ఒకవేళ చాలకపోతే మీ టేస్ట్‌కి తగినవిధంగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆపై అందులో మిగిలిన పల్లీలు, కరివేపాకు వేసుకుని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు. అంతే చేదు లేకుండా నోరూరించే కమ్మని ‘కాకరకాయ కారం’ మీ ముందు ఉంటుంది. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే దాదాపు నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది.
ఇడ్లీ పొడి
కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు – అర కప్పు, శనగపప్పు – అర కప్పు, నువ్వులు – పావు కప్పు, జీలకర్ర – టీస్పూను, మిరియాలు – టీస్పూను, నూనె – టీస్పూను, బ్యాడిగీ మిర్చి – ఎనిమిది, ఎండుమిర్చి – పది, కరివేపాకు – గుప్పెడు, పుట్నాల పప్పు – రెండు టేబుల్ స్పూన్లు, ఇంగువ – పావు టీస్పూను, ఉప్పు – సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – పది.
తయారీ విధానం: కరివేపాకును శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి తడి పోయేలా ఆరబెట్టుకోవాలి. కరివేపాకు పూర్తిగా ఎండిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మినప్పప్పు వేసి కలుపుతూ లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మినప్పప్పు వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లోకి శనగపప్పు వేసి దోరగా వేయించి ప్లేట్‌లోకి వేసుకోవాలి. అనంతరం నువ్వులు కూడా వేసి చిటపటలాడే వరకు దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేయించి తీసుకోవాలి. అదే పాన్‌లోకి నూనె వేసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో బ్యాడిగీ మిర్చి, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి.
మిర్చి వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. చివరగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి క్రిస్పీగా మారే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పదార్థాలు అన్నీ చల్లారేవరకు పక్కన ఉంచాలి. చల్లారిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, నువ్వులు, జీలకర్ర మిశ్రమం, ఎండుమిర్చి, కరివేపాకును మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అలాగే పుట్నాల పప్పు, ఇంగు వ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఓసారి గ్రైండ్ చేసుకో వాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి పప్పులను బరక గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పొడి వేడి తగ్గిన తర్వాత గాలి, తేమ లేని డబ్బాలో స్టోర్ చేసు కుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పొడి రెడీ.
తోటకూర నువ్వుల కారం
కావాల్సిన పదార్థాలు: తోటకూర – 10 నుంచి 12 కట్టలు, నూనె – మూడ్నాలుగు టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి – నాలుగు, ఉల్లిగడ్డలు – రెండు(మీడియం సైజ్‌వి), పసుపు – అరటీస్పూను, కరివేపాకు – కొద్దిగా, ఎండుకొబ్బరి పొడి – రెండు టేబుల్ స్పూన్లు, ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర – టీస్పూను, తెల్ల నువ్వులు – నాలుగైదు టేబుల్ స్పూన్లు, కారం – రుచికి తగినంత, ఉప్పు – టేస్ట్‌కి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – 20.
తయారీ విధానం: తోటకూరను తీసుకుని వేరు భాగాన్ని కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడకట్టి మీడియం సైజ్‌లో తరుక్కోవాలి. స్టవ్ మీద కడాయిలో ధనియాలు, జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోవాలి. అవి లైట్‌గా వేగాక తెల్ల నువ్వులు జత చేసి అన్నింటినీ మరీ మాడిపోకుండా చక్కగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మూడ్నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు(జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు) వేసుకుని ఆవాలు చిటపటమనే వరకు వేయించాలి. తర్వాత ఎండుమిర్చి తుంపలు, సన్నని ఉల్లిగడ్డ తరుగు వేసుకుని ఉల్లిగడ్డలు కాస్త సాఫ్ట్‌గా మారేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత పసుపు, కరివేపాకు వేసి మరికాసేపు వేయించాలి. అనంతరం ముందుగా కట్ చేసి శుభ్రంగా చేసి పెట్టుకున్న తోటకూరను జత చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఆపై మూతపెట్టి వాటర్ ఏమి పోయకుండా లో ఫ్లేమ్‌లో ఆవిరి మీదనే మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ తోటకూరను బాగా మగ్గించుకోవాలి. ఈలోపు నువ్వుల కారం ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాల మిశ్రమం, రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం గ్రైండ్ చేసుకున్న ఆ పొడిలో పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కచ్చాపచ్చాగా నలిగే వరకు లైట్‌గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న తోటకూర మిశ్రమం బాగా మగ్గితే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల కారం మిశ్రమాన్ని జత చేసి బాగా కలపాలి. చివర్లో ఎండుకొబ్బరి పొడి వేసి మరోసారి బాగా కలిపి ఒకట్రెండు నిమిషాలు వేయించుకోవాలి. అంతే, వేడివేడి అన్నంలోకి అదుర్స్ అనిపించే ‘తోటకూర నువ్వుల కారం వేపుడు’ రెడీ అవుతుంది.
పల్లీ కారం పొడి
కావాల్సిన పదార్థాలు: పల్లీలు – రెండు కప్పులు, నూనె – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – కప్పు, చింతపండు – చిన్న నిమ్మకాయ సైజంత, జీలకర్ర – టేబుల్ స్పూను, కారం – అర కప్పు, ఉప్పు – సరిపడా, వెల్లుల్లి రెబ్బలు – అర కప్పు
తయారీ విధానం: కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి తడిపోయేంతవరకు కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత మంటను లో టూ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి కలుపుతూ దోరగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లోకి నూనె వేసి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యేంతవరకు కలుపుతూ వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఫ్రై చేసిన పల్లీలు వేసుకోవాలి. అందులోకి చింతపండు రెమ్మలను విడివిడిగా వేసుకుని మరో మూడు నిమిషాల వేయించుకోవాలి. పదార్థాలన్నీ మగ్గిన తర్వాత చివరగా జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
జీరా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా అందులోకి కారం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు వెల్లుల్లి రెబ్బలను సెపరేట్ చేసుకుని వాటి పొట్టును లైట్‌గా తీసి పెట్టుకోవాలి. మిక్సీజార్‌లోకి చల్లారిన పల్లీ మిశ్రమాన్ని వేసి ఓసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. పొడి పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పల్లీ కారం పొడి రెడీ.