Thursday, November 13, 2025
E-PAPER
Homeమానవిమధురగాయని సుశీలమ్మ

మధురగాయని సుశీలమ్మ

- Advertisement -

‘జోరు మీదున్నావు తుమ్మెద ఈ జోరు ఎవరి కోసమే తుమ్మెద’ మర్చిపోకముందు ‘ఝుమ్మంది నాదం సై అంది పాదం’ అంటూ అందరి చెవుల్లో ఆమె ఇప్పటికీ ఝమ్మంటూ మోగుతూనే ఉంటారు. పలు భాషలలో యాభై వేలకు పైగా పాటలు పాడి దక్షిణాది గానకోకిలగా సంగీత ప్రియుల మదిలో నిలిచిపోయారు. మధురమైన, గమ్మత్తైన ఆమె స్వరానికి పద్మభూషణ్‌ సైతం వరించింది. అలాంటి మధుర గాయని సుశీలమ్మ పుట్టిన రోజు సందర్భగా మానవిలో..

1935 నవంబరు 13న సుశీల విజయనగరంలో జన్మించారు. ఈమె తండ్రి ముకుందరావు, క్రిమినల్‌ లాయర్‌గా పనిచేసేవారు. తల్లి శేషావతారం గృహిణి. సంగీత కుటుంబంలో జన్మించినందువల్ల చిన్న వయసులోనే శాస్త్రీయ సంగీతలో శిక్షణ పొందారు. తండ్రి తన కుమార్తె ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి కావాలని కోరుకునేవారు. సుశీల తన పాఠశాలలో జరిగే అన్ని సంగీత పోటీలలో పాల్గొనేవారు. ఏదో ఒక బహుమతి గెలుచుకునేవారు. ఆ బహుమతులతో ఇల్లంతా నిండిపోయేది. విజయనగరం మహారాజా సంగీత, నృత్య కళాశాల నుంచి ఆమె సంగీతంలో డిప్లొమా తీసుకున్నారు. ఆమె కన్నా పదేండ్ల ముందే కళా రంగంలోకి వచ్చిన లతా మంగేష్కర్‌ పాటలు ఆమెను ఎంతో ఆకర్షించేవి. 1950లో రేడియోలో నిర్వహించిన ఒక పోటీలో సుశీల పాడిన పాట ఆమె సంగీత ప్రస్థానానికి నాందిగా చెప్పాలి.

సినీ రంగ ప్రవేశం
ఆల్‌ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు సుశీలమ్మలోని ప్రతిభను గుర్తించి తన మొదటి చిత్రమైన ‘పెట్ర తాయి’ అనే తమిళ సినిమాలో పాడించారు. 1952లో సంగీత పరిశ్రమలోకి ప్రవేశించిన సుశీలమ్మ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1960లో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఇతర భాషల్లోకి కూడా విస్తరించారు. ఇలా 1956 నుండి 1980 వరకు ఆమె పాడుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 50 వేలకు పైగా పాటలు పాడి ప్రేక్షకుల హృదయంలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఒరియా, సంస్కృతం, తుళ్లూ, సింహాళ మొదలైన భాషల్లో ఆమె పాడారు.

కళారంగానికి సేవలు
1956కు ముందు సుశీలమ్మ చిన్న చిన్న పాత్రలకే పాడేవారు. ఆ తర్వాత సావిత్రి నటించిన ‘తోడికోడళ్లు’ చిత్రంలో ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నది’ అనే పాటతో ఆమె పెద్ద హిట్‌ అయ్యారు. సుశీలమ్మ ఏ భాషలో పాట పాడినప్పటికీ పదాలను ఉచ్చరించడంలో తగు జాగ్రత్త వహించేవారు. నేటి గాయకులలో చాలామందిలో మనం అలాంటి పద ఉత్సారణలు చూడలేము. 1969, 71 ,77, 82, 83 ఏడాదులకు గాను ఆమె వరుసగా ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వం 68,80,89,91ల్లో ఆమె ప్రతిభను గుర్తించి వివిధ బిరుదులు, బహుమతులు, అవార్డులతో సత్కరించింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కూడా సొంతం చేసుకున్నారు. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కూడా ఆమె పేరిట ఉంది. 2008లో ఆమె ఒక ట్రస్టును ప్రారంభించారు. సంగీతకారులకు నెలవారీ పింఛను అందించడం, ప్రతి నవంబరులో నిధుల సేకరణకు సంగీత కచేరి నిర్వహించడం చేస్తున్నారు. అలాగే జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.

మధురాతి మధురం
కెవి మహదేవన్‌ నుండి ఇళయరాజా వరకు అంటే ఆ తరం నుండి ఈ తరం వరకు ఎన్నెన్నో గీతాలు సుశీలమ్మ గొంతు నుండి జాలువారాయి. ‘ఆఖరిపోరాటం’ చిత్రంలో ‘తెల్లచీరకు తకధిమీ తకధిమీ’ పాట ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోయింది. జోల పాట అనగానే గుర్తొచ్చేది ‘లాలి లాలి లాలి లాలి వటపత్ర సాయికి వరహాల లాలి’ అనే స్వాతి ముత్యంలోని పాట ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా వేలకు వేల పాటలు. ఏ పాట విన్నా మధురాతి మధురం. 1985 నుండి జానకమ్మ, వాణి జయరాం, దక్షిణాది చలనచిత్ర పాటల కేంద్రాన్ని ఆక్రమించుకోవడంతో, జేఎస్‌ చిత్ర తన కెరియర్‌ ప్రారంభించడంతో సుశీల నెమ్మదిగా తన దృష్టిని సినిమాల నుండి తేలికపాటి సంగీతం వైపు మళ్లించారు. 1984 నుండి 1999 వరకు చలనచిత్ర పాటలను పాడటం కొనసాగించారు. 1980 తర్వాత చిత్రాలలో పాడటం తనకు తానుగానే తగ్గించుకున్నారు.

ఆదరించిన మహానుభావులు
సుశీలమ్మను సినీ గాయనిగా పెండ్యాల పరిచయం చేశారు. పాటను భావగర్భి తంగా ఎలా పాడాలో ఘంటసాల నేర్పారు. సాలూరి, కె.వి.మహదేవన్‌ లాంటి సంగీత దర్శకులు మధురమైన పాటలు పాడే అవకాశం ఇచ్చారు. సినీ స్వర్ణయుగంలో మహానుభావుల దగ్గర పాడటం తనకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తారు సుశీలమ్మ. తెలుగు సినిమాల్లో వీణ పాటలతో ఆమె ఎంతో గుర్తింపు పొందారు. 1961లో ‘భార్య భర్తలు’ చిత్రం కోసం లలిత సంగీతానికి ఆద్యుడైన సాలూరి రాజేశ్వర రావు స్వరాలు సమకూర్చి ‘ఏమని పాడెదనో ఈ వేళ’ పాటలను సుశీలమ్మతో పాడించి వీణ పాటకు నాంది పలికారు.

  • పాలపర్తి సంధ్యారాణి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -