Thursday, June 5, 2025
E-PAPER
Homeఆటలుసెమీస్‌లో స్వైటెక్‌

సెమీస్‌లో స్వైటెక్‌

- Advertisement -

క్వార్టర్స్‌లో స్విటోలినాపై గెలుపు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మట్టికోర్టు మహారాణి ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) పారిస్‌లో రికార్డు టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో వరుసగా నాలుగు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచేందుకు స్వైటెక్‌ సిద్ధమవుతోంది. క్వార్టర్‌ఫైనల్లో ఉక్రెయిన్‌ అమ్మాయి ఎలినా స్విటోలినాపై విజయంతో స్వైటెక్‌ సెమీస్‌కు చేరింది. వరల్డ్‌ నం.1 అరినా సబలెంక (బెలారస్‌) సైతం సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
పారిస్‌ (ఫ్రాన్స్‌) : 24 ఏండ్ల ఇగా స్వెటెక్‌ (పొలాండ్‌) గత ఏడాది ఆఖర్లోనే ఓ నెల రోజుల డోపింగ్‌ నిషేధాన్ని ఎదుర్కొంది. ఈ ఏడాది మట్టికోర్టు సీజన్‌లో ఒక్క టైటిల్‌ సాధించలేదు. అయినా, అచ్చొచ్చిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వైటెక్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తుంది. పారిస్‌లో వరుసగా 26వ విజయం సాధించిన స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఐదో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. 2022, 2023, 2024లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ టైటిల్స్‌ సాధించిన స్వైటెక్‌.. 2020లో తొలిసారి మట్టికోర్టులో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ముద్దాడింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఇగా స్వైటెక్‌ 6-1, 7-5తో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. 3 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన స్వైటెక్‌.. పాయింట్ల పరంగా 72-59తో పైచేయి సాధించింది. ఐదో సీడ్‌ స్వైటెక్‌ 23 విన్నర్లతో రెచ్చిపోగా.. స్విటోలినా ఏకంగా 21 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లకు స్పిన్‌ను జోడించిన స్వైటెక్‌.. వేగంలో వైవిధ్యంతో స్విటోలినాను ముప్పుతిప్పలు పెట్టింది. తొలి సెట్‌లో స్వైటెక్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వని స్విటోలినా.. రెండో సెట్లో కాస్త ప్రతిఘటించింది. 5-4తో మందంజ వేసిన స్విటోలినా మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లేలా కనిపించింది. కానీ అనవసర తప్పిదాలతో స్వైటెక్‌కు అవకాశం ఇచ్చిన స్విటోలినా 101 నిమిషాల్లోనే చేతులెత్తేసింది.
మహిళల సింగిల్స్‌ మరో క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ నం.1, టాప్‌ సీడ్‌ అరినా సబలెంక ఘన విజయం సాధించింది. చైనా క్రీడాకారిణి క్విన్‌వెన్‌ జెంగ్‌పై 7-6(7-3), 6-3తో వరుస సెట్లలో సబలెంక గెలుపొందింది. సుమారు రెండు గంటల పాటు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సబలెంక ఆరు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో సత్తా చాటింది. ఐదు ఏస్‌లు, రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జెంగ్‌.. కీలక తొలి సెట్‌ టైబ్రేకర్‌ను కోల్పోయి ఒత్తిడిలో పడింది. 22 విన్నర్లతో జెంగ్‌ మెరిసినా.. 31 అనవసర తప్పిదాలు చేసి విలువైన పాయింట్లు కోల్పోయింది. బలమైన రిటర్న్‌ షాట్లకు తోడు ర్యాలీలలో జెంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం చూపించిన సబలెంక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో బెర్త్‌ కోసం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వెటెక్‌తో అరినా సబలెంక పోటీపడనుంది.
ఆరంభంలో తీవ్రత కాస్త తక్కువైనా.. ఆఖర్లో పుంజుకున్నాను. సబలెంకతో పోరు ఎప్పుడూ సవాలే. ఎటువంటి కోర్టులోనైనా సబలెంక మంచి ప్లేయర్‌. ఆమెతో ఆడుతున్నప్పుడు షాట్ల ఎంపికలో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. సబలెంకతో మ్యాచ్‌ కఠిన సవాలే కానీ ఆమెతో సమరం నాకు ఆనందాన్ని ఇస్తుంది’
– ఇగా స్వైటెక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -