Sunday, June 1, 2025
E-PAPER
Homeఆటలుప్రీ క్వార్టర్స్‌లో స్వైటెక్‌

ప్రీ క్వార్టర్స్‌లో స్వైటెక్‌

- Advertisement -

సబలెంక, ముసెటి ముందంజ
ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ ఫేవరేట్స్‌ ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌), అరినా సబలెంక అలవోక విజయాలతో ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపారు. బెలారస్‌ భామ, వరల్డ్‌ నం.1 సబలెంక మూడో రౌండ్లో 6-2, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ దూకుడు ముంగిట సెర్బియా అమ్మాయి ఓల్గా తేలిపోయింది. ఓ ఏస్‌ సహా ఐదు బ్రేక్‌ పాయింట్లతో రెచ్చిపోయిన సబలెంక పాయింట్ల పరంగా 65-49తో తిరుగులేని జోరు చూపించింది. మాజీ వరల్డ్‌ నం.1, ఐదో సీడ్‌ ఇగా స్వైటెక్‌ సైతం వరుస సెట్లలో చెమట పట్టకుండా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. రోమానియా అమ్మాయి జాక్వలిన్‌ క్రిస్టీపై 6-2, 7-5తో ఇగా స్వైటెక్‌ మూడో రౌండ్లో గెలుపొందింది. మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. అమెరికా భామ ఆమంద అనిసిమోవ 7-6(7-4), 6-4తో వరుస సెట్లలో క్లారా టౌసన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందింది. రెండు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన ఆమంద నాల్గో రౌండ్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ క్రీడాకారిణి డయానపై రష్యా ప్లేయర్‌ సమ్సోనోవ 6-2, 6-3తో విజయం సాధించింది. ఎనిమిదో సీడ్‌ చైనా ప్లేయర్‌ క్విన్‌వెన్‌ జెంగ్‌ 6-3, 6-4తో విక్టోరియా మోకోపై పైచేయి సాధించగా..ఆసీస్‌ అమ్మాయి డరియా కసట్కినా 6-4, 6-2తో లియోలియపై గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపింది.
పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు,ఎనిమిదో సీడ్‌ లోరెంజో ముసెటి 4-6, 6-4, 6-3, 6-2తో అర్జెంటీనా ఆటగాడు మరియానో నవొనెపై నాలుగు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన ముసెటి వరుసగా మూడు సెట్లలో విజయం సాధించాడు. మూడు ఏస్‌లు, ఎనిమిది బ్రేక్‌ పాయింట్లతో సత్తా చాటిన ముసెటి పాయింట్ల పరంగా 134-113తో పైచేయి సాధించాడు. మరో మ్యాచ్‌లో 12వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 6-3, 3-6, 7-6(9-7), 3-6, 6-3తో ఐదు సెట్ల మహా సమరంలో కారెన్‌ కచకోవ్‌ (రష్యా)పై గెలుపొందింది. 8 ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించిన టామీ పాల్‌ మూడో సెట్లో కీలక టైబ్రేకర్‌లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఐదు ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించిన కారెన్‌ పాయింట్ల పరంగా 164-160తో టామీ పాల్‌పై పైచేయి సాధించినా..భంగపాటుకు గురయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -