నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నమెంట్, 2026 ఫిబ్రవరి 7వ తేదీన ప్రారంభమై మార్చి 8న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఇటీవలే 2024లో ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నీలో అడుగుపెట్టనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొననుండగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లను ఒకే గ్రూప్‌లో చేర్చడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జయ్ షా, 2024 టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ, 2025 మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ షెడ్యూల్‌ను లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ క్రికెట్‌కు మరింత ఆదరణ తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
టోర్నమెంట్ ఫార్మాట్, గ్రూపుల వివరాలు
ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే 20 జట్లను 5 జట్ల చొప్పున మొత్తం 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ ఎయిట్’ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ ఎయిట్‌లో కూడా జట్లను రెండు గ్రూపులుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ దశలో ప్రతి గ్రూప్‌లోనూ టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి.
ప్రకటించిన వివరాల ప్రకారం… గ్రూప్ ‘A’లో భారత్, పాకిస్థాన్, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘B’లో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు చరిత్రలో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఇటలీ జట్టు కూడా ఉంది. మిగిలిన గ్రూపుల వివరాలను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది.
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్, కీలక వేదికలు
భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న ముంబైలో యూఎస్‌ఏతో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఇక అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్ ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా జరగనుంది. పాకిస్థాన్ ఆడే లీగ్ మ్యాచ్‌లన్నీ భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంకలోని కొలంబో లేదా కాండీ నగరాల్లోనే జరగనున్నాయి.
భారత్ సూపర్ ఎయిట్ దశకు చేరితే అహ్మదాబాద్, చెన్నై, కోల్‌కతాలో మ్యాచ్‌లు ఆడుతుంది. ఒకవేళ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది.
ఫైనల్‌పై ప్రత్యేక నిబంధన
టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఖరారైంది. అయితే, దీనిపై ఐసీసీ ఒక కీలక నిబంధన విధించింది. ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరిన పక్షంలో, తుది సమరాన్ని అహ్మదాబాద్ నుంచి కొలంబోకు మారుస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సెమీఫైనల్స్ కోల్‌కతా, ముంబైలో జరగనుండగా, పాకిస్థాన్ లేదా శ్రీలంక సెమీస్‌కు చేరితే వేదికల్లో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. 2016 తర్వాత భారత్ మళ్లీ టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.



