Sunday, November 2, 2025
E-PAPER
Homeప్రత్యేకంవిలక్షణ నటి టబు

విలక్షణ నటి టబు

- Advertisement -

హైదరాబాద్‌లో పుట్టి ముంబైలో సెటిల్‌ అయిన టబు.. పాన్‌ ఇండియా సినీ ప్రియులకు పరిచయం అవసరంలోని పేరు. నాలుగు దశాబ్దాలుగా వెండి తెర మీద నటిగా రాణిస్తున్న టబు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లోనూ నటిగా యువతలో ఆమె సంపాదించుకున్న క్రేజ్‌ అంతా ఇంత కాదు. టబు హిందీ, తెలుగు, కన్నడం, తమిళ భాషలలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి మెప్పించి.. భాష ఏదైనా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. నాజూకు రూపంతో సినీ ప్రియుల్ని కట్టి పడేసి, టాలీవుడ్‌తో మొదలుపెట్టి హాలీవుడ్‌ వరకు దిగ్విజయంగా సినీ మజిలీ కొనసాగించింది.

తెలుగులో నాగార్జున సరసన ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమాతో మంచి బ్రేక్‌ సంపాదించిన టబు.. మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలతో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. ఐదు పదుల వయసు దాటినా కూడా తన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టి పడేస్తున్న టబు ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది. ఇప్పటికీ ఆమె చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో దశ్యం 3 సినిమాతో పాటు.. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్‌ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తుంది. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు దక్కించుకున్న తబుస్సమ్‌.. అలియస్‌ టబు నవంబర్‌ 4 న తన 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా సోపతి పాటకుల కోసం అందిస్తున్న వ్యాసం.

టబు అసలు పేరు తబుస్సుమ్‌ హష్మి. ఆమె 1971, నవంబరు 4న హైదరాబాద్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది. తండ్రి పాకిస్తాన్‌ నటుడు జమాల్‌ హష్మి, తల్లి రిజ్వానా. ఆమె ఓ స్కూల్‌ టీచర్‌. ఆమె బాల్యంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. అధ్యాపకులైన అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగింది. ”1975-76 ప్రాంతంలో హైదరాబాద్‌లో అమ్మమ్మతో, కజిన్స్‌తో కలసి సాయంత్రాల్లో సినిమా చూడటం, వీధి చివర దోశలు తినటం, అమ్మమ్మతో సంభాషించేప్పుడు సినిమాల కంటే ఉర్దూ కవిత్వమే డామినేట్‌ చేసేది” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది టబు. హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలోని సెంట్‌ ఆన్స్‌ హై స్కూల్‌లో చదువుకొంది. కొంత కాలం తర్వాత టబు అమ్మమ్మతో కలసి హైదరాబాద్‌ నుంచి మనాలి వెళ్లిపోయింది. వారి పూర్వీకులు అంతా చదువుకున్నవాళ్లే కావడంతో అమ్మమ్మ దగ్గర పుస్తకాల నుంచి ఉర్దూ కవిత్వం వరకూ చదువుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకుంది. 1983లో బొంబాయి వెళ్ళిన టబు అక్కడ సెయింట్‌ జేవీయర్స్‌ కళాశాలలో రెండేండ్లు చదువుకుంది.

సినిమాలలోకి
1982లో బొంబాయిలో చదువుకుంటున్న టబు 11 ఏళ్ల వయసులో ‘బజార్‌’ అనే చిత్రంలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత 1985లో దేవానంద్‌ కూతురిగా పధ్నాలుగేళ్ల వయసులో ‘హమ్‌ నౌజావాన్‌’ చిత్రంలో నటించింది. 1987లో నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించిన ”రూప్‌ కి రాణి చోరోంకా రాజా, ప్రేమ్‌”, ఈ రెండు సినిమాలలో బోనీ కపూర్‌ తమ్ముడు సంజయ్ కపూర్‌తో కలిసి నటించింది. అయితే 1991లో టబు తొలిసారి కథానాయికగా వెంకటేష్‌తో కలిసి తెలుగులో ‘కూలి నంబర్‌ 1’ చిత్రంలో నటించగా, 1994లో హిందీలో టబు కథానాయికగా నటించిన తొలి చిత్రం ‘పెహ్లా పెహ్లా ప్యార్‌’. అయితే, ఆమె కెరీర్‌లో ఒక మలుపు తిరిగింది అజయ్ దేవగన్‌తో కలిసి నటించిన యాక్షన్‌ చిత్రం ‘విజయపథ్‌’.

ఈ చిత్రానికి ఆమె ఉత్తమ మహిళ అరంగేట్రం కేటగిరీలో ఫిలింఫేర్‌ అవార్డును అందుకుంది. తర్వాత బాక్సాఫీస్‌ విజయం సాధించిన హకీకత్‌, రిషి కపూర్‌, రవీనా టాండన్‌లతో కలిసి ”సాజన్‌ కి బాహౌన్‌ మే” చిత్రాలు విడుదల అయ్యాయి. 1996లో టబు నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలయ్యాయి, వాటిలో రెండు ”సాజన్‌ చలే ససురల్‌, జీత్‌” చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి. ‘జీత్‌’ తర్వాత టబు తమిళంలో కతిర్‌ దర్శకత్వం వహించిన ‘కాదల్‌ దేశం’ (తెలుగులో ప్రేమదేశం) చిత్రంతో ఆమె దక్షిణాదిలో పాపులర్‌ అయింది. ఇదే ఏడాది పంజాబ్‌ తిరుగుబాటు బాధిత యువతి పాత్ర పోషించిన ‘మచ్చిస్‌’ చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కించుకుంది. తెలుగులో నాగార్జున సరసన నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ చిత్రం విడుదలై అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా, ఆమె నటనకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును గెలుచుకుంది.

1997లో ఇండో,పాక్‌ మద్య 1971లో జరిగిన లోంగేవాలా యుద్దం చుట్టూ జరిగిన సంఘటనల ఆధారంగా జె. పి. దత్తా నేతత్వంలో వచ్చిన ‘బోర్డర్‌’ చిత్రంలో టబు సన్నీ డియోల్‌ భార్య పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమె పాత్ర క్లుప్తంగా ఉన్నప్పటికీ, ఇది 1997లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది. 1997లో టబు విరాసత్‌,” మణిరత్నం తమిళ చిత్రం ‘ఇరువర్‌’ లో నటించింది. ఈ చిత్రంలో మోహన్‌ లాల్‌, ప్రకాశ్‌రాజ్‌, ఐశ్వర్య రాయ్, గౌతమి నటించారు. టబు కమల్‌ హాసన్‌ సరసన నటించిన తమిళ చిత్రం ”అవ్వాయ్ షణ్ముఘి” తోపాటు 1998లో ఈ చిత్ర రీమేక్‌ ”చాచి” చిత్రంలో కూడా నటించింది. ఇదే ఏడాది చివరలో టబు తెలుగులో ‘ఆవిడా మా ఆవిడే” చిత్రంలో నటించింది. 1999లో టబు ‘హు తు తు’ తోపాటు రెండు విజయవంతమైన సమిష్టి చిత్రాలలో నటించింది. 2000లో వచ్చిన ‘ఆస్తిత్వా’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

2001లో వచ్చిన ‘చాందిని బార్‌’ చిత్రంలో బార్‌ డాన్సర్‌గా నటించడం ద్వారా టబు కు రెండవ జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది 2007లో నటించిన కామెడీ చిత్రం ‘చీనీకమ్‌’ అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. విశాల్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహించిన షేక్స్పియర్‌ అనుసరణలైన ‘మక్బూల్‌, హైదర్‌’ చిత్రాలు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను గెలుచుకున్నాయి. 2012లో మొదటి హాలీవుడ్‌ చిత్రం ‘ది నేమ్‌సేక్‌, లైఫ్‌ ఆఫ్‌ పై’ చిత్రాలు అమెరికన్‌ సినిమాల్లోకి విస్తరించి, టబు కు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2017లో బాలీవుడ్‌ లో వాణిజ్య పరంగా గొప్ప విజయాన్ని సాధించిన గోల్‌మాల్‌ ఎగైన్‌, 2022లో భూల్‌ భూలైయా-2 చిత్రాలు టబుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ”బివి నంబర్‌ 1, హమ్‌ సాత్‌-సాత్‌ హై”, ఈ రెండు చిత్రాలు వరుసగా ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలుగా నిలిచాయి. 2018లో టబు, మనోజ్‌ బాజ్‌పారు సరసన నటించిన త్రిల్లర్‌ సినిమా ‘మిస్సింగ్‌’. ఈ సినిమాలోని ఏకైక పాట, ”సో జా రే” అనే లాలిపాటకు ఆమె తన గాత్రాన్ని అందించింది. దీని తర్వాత రణబీర్‌ కపూర్‌ నటించిన ‘సంజు’లో ప్రత్యేక పాత్ర పోషించింది.

టబు కెరీర్‌లో ఒక మలుపు శ్రీరామ్‌ రాఘవన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధున్‌’, దీనిలో ఆమె ఆయుష్మాన్‌ ఖురానాకు సమాంతరంగా ప్రధాన పాత్ర పోషించింది. 2019లో ‘దే దే ప్యార్‌ దే’, అలీ అబ్బాస్‌ జాఫర్‌ చిత్రం ‘భారత్‌’ లో నటించింది. ఆ తర్వాత 2020లో తెలుగు సినిమా అలా వైకుంఠపురములో.. తల్లిగా నటించింది. దీని తర్వాత ఆమె టెలివిజన్‌, స్ట్రీమింగ్‌ రెండింటిలోనూ ‘సయీదా బేగం’ అనే గజల్‌ గాయనిగా నటించింది, 2022లో ఆధ్యాత్మిక సీక్వెల్‌ ‘భూల్‌ భూలైయా-2’ టబు కవల సోదరీమణులుగా నటించిన ద్విపాత్రాభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తరువాత, అభిషేక్‌ పాఠక్‌ దర్శకత్వం వహించిన థ్రిల్లర్‌ సీక్వెల్‌ ‘దశ్యం-2’ లో మీరా పాత్రను ఆమె తిరిగి పోషించింది. 2023లో వచ్చిన థ్రిల్లర్‌ సినిమా ‘కుట్టే’, ‘భోలా’, ‘ఖుఫియా’ లలో పోలీస్‌ అధికారి పాత్రలలో నటించింది. 2024లో కరీనా కపూర్‌ ఖాన్‌, కతి సనన్‌లతో కలిసి ‘క్రూ’ చిత్రంలో నటించింది.

ఈ చిత్రంలో ఈ ముగ్గురూ ఎయిర్‌ హౌస్టెస్‌ పాత్రలో నటించారు. తరువాత దేవ్‌గన్‌తో రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘ఔరోన్‌ మే కహాన్‌ దమ్‌ థా’ చిత్రంలో నటించింది. టబు ఇంతవరకు నటించిన చిత్రాలలో ప్రేమ్‌, విజయపథ్‌, కాదల్‌ దేశం (తెలుగులో ప్రేమదేశం), కూలీ నెంబర్‌ 1, జీత్‌, నిన్నే పెళ్ళాడతా, మాచిస్‌, విరాసత్‌, హు తు తు, కండుకొండెన్‌ కండుకొండెన్‌(తెలుగులో ప్రియురాలు పిలిచింది), ఇరువర్‌ (తెలుగులో ఇద్దరు), ఆస్తిత్వ, చాచి 420, చెన్నకేశవరెడ్డి, చాందినీ బార్‌, పాండురంగడు, మక్బూల్‌, అందరివాడు, ‘మీనాక్షి- ఎ టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌, లైఫ్‌ ఆఫ్‌ పై, హైదర్‌, అలా వైకుంఠపురంలో.., దశ్యం, భూల్‌ భూలైయా-2, అందాధూన్‌.. ఇటీవల వచ్చిన ‘క్రూ’ చిత్రం వరకూ ఆమె ఈ చిత్రాలలో పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. అందుకే ఆమె నటనకు జాతీయస్థాయిలో క్రేజ్‌ ఏర్పడింది.

అంతర్జాతీయ చిత్రాలలో..
టబు బాలీవుడ్‌లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ తన నటనతో మెప్పించి, ప్రేక్షకులను అలరించింది. మీరానాయర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంగ్ల చిత్రం ‘ది నేమ్‌ సేక్‌ లో కీలక పాత్ర పోషించింది. 2012లో విడుదలైన ‘లైఫ్‌ ఆఫ్‌ పై’ లోనూ ఓ కీలక పాత్ర పోషించి అలరించింది. టబు హిందీలో చేసిన ‘చీనీకమ్‌’ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆదరణను చూరగొంది. ఆ చిత్రానికి అమెరికా, ఇంగ్లాండ్‌లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

తెలుగు సినిమాల్లోకి
టాలీవుడ్‌ అగ్రహీరోలైన చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్‌.. ఇలా అందరితో కలిసి నటించింది. ఆమె కెరియర్లో ఎక్కువగా నటించింది హిందీ చిత్రాల్లోనే అయినప్పటికీ కొన్ని తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది. తెలుగులో కథానాయికగా టబు తన స్నేహితురాలైన దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా వెంకటేశ్‌ హీరోగా వచ్చిన ‘కూలీ నెంబర్‌ 1’ చిత్రంతో పరిచయమైంది. 1991లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో వెంకీ పక్కన తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తెలుగులో ఎక్కువగా నటించింది మాత్రం నాగార్జున కాంబినేషన్లోనే. వీరి జోడికి హిట్‌ పెయిర్‌ టాక్‌ వచ్చింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు అందాలకు టాలీవుడ్‌ లో ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరింత పెరిగింది. ఈయనతో ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలో నటించింది. ‘కూలీ నెంబర్‌ 1’ తోపాటు ”నిన్నే పెళ్ళాడుతా, ప్రేమ దేశం, చెన్నకేశవరెడ్డి, షాక్‌, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి, అలా వైకుంఠపురంలో” తదితర చిత్రాల్లో నటించి అలరించింది.

షబానా అజ్మీ మేనకోడలు..
ప్రముఖ నటీమణి షబానాఅజ్మీ, ప్రముఖ ఫోటోగ్రాఫర్‌, నటుడు బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. టబు సినిమాలపై ఆసక్తితో చిన్నతనంలోనే రైలు ఎక్కి బొంబాయి చేరుకుంది. ‘బజార్‌’ అనే హిందీ చిత్రంతో బాలనటిగా చిన్న పాత్ర పోషించింది టబు. ఆ తర్వాత ‘హమ్‌ నే జవాన్‌’ లోనూ మెరిసింది. ఈ సినిమాలోని నటన ద్వారా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సోదరి ఫరా
బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందిన ‘ఫరా నాజ్‌’ 80వ దశకంలో అందం, అభినయంతో ఇండిస్టీని ఏలిన హీరోయిన్‌. ఫరా నాజ్‌, టబుకు స్వయానా సోదరి. చిత్ర పరిశ్రమలోకి బలమైన ఎంట్రీ ఇచ్చిన ఫరా తన అద్భుతమైన అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. డైరెక్టర్‌ యష్‌ చోప్రా తెరకెక్కించిన ”ఫసాలే” సినిమాతో నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 80వ దశకంలో వరుసగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది. 2005 లో ‘శిఖర్‌’ సినిమా తర్వాత ఫరా మరో సినిమా చేయలేదు. 2005 నుంచి సినీరంగానికి దూరంగా ఉండిపోయింది ఫరా.

చిరంజీవి, బాలకృష్ణకు తల్లిగా, భార్యగా
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేము. వారు చేసే పాత్రలు కూడా కాస్త విచిత్రంగానే ఉంటాయి. హీరోల సరసన ఆడిపాడిన హీరోయిన్లు.. అదే హీరోకు తల్లి పాత్రలు చేయడం వింతగా ఉంటుంది. కాని కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ ఇద్దరు హీరోలకు తల్లిగా భార్యగా నటించిన సందర్భాలు ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ ఈ ఇద్దరికి అటువంటి రేర్‌ కాంబినేషన్‌ ఎదురయ్యింది. అటు చిరంజీవి సినిమాలో, ఇటు బాలకృష్ణ సినిమాలో వీరికి తల్లిగా, భార్యగా టబు నటించింది. మెగాస్టార్‌తో కలిసి ‘అందరివాడు’ సినిమాలో నటించింది టబు. ఆ సినిమాలో యాక్టింగ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ అది. కాగా టబు బాలకృష్ణ కాంబినేషన్లో రెండు సినిమాల్లో నటించింది. ‘పాండురంగడు’ సినిమాలో ఆమె గ్లామర్‌ కు ఫుల్‌ స్కోప్‌ ఉన్న క్యారెక్టర్లో నటించి.. ఆడియెన్స్‌కు వేడి పుట్టించింది. ఆ తర్వాత ‘చెన్నకేశవ రెడ్డి’లో నటించి మెప్పించింది.

రొటీన్‌కు భిన్నంగా…
టబు ‘కొత్త పాత్రలు వస్తే వదులుకునేది కాదు. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించేది. చిన్నప్పటి నుంచీ ఇదే తీరు. ‘మక్బూల్‌’, ‘చాందినీ బార్‌’, ‘హైదర్‌’ లాంటి చిత్రాలలో నటించేందుకు దోహదం చేసింది. ఎవరైనా దర్శకుడు మంచి కథనంతో వచ్చి ‘మీరైతే సరిపోతారు ఈ పాత్రకు’ అనడాన్ని గొప్ప విషయంగా భావించేది. ఆమె కోసమే పాత్రలు రాసే రచయితలున్నారు. ఇప్పటి వరకూ 92 చిత్రాల దాకా నటించిన టబు, అన్ని చిత్రాల స్క్రిప్టును చదివి ఒకే చేసేది. 1990లలో టబు రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేసిన సందర్భాలెన్నో. ఏడాదికి పన్నెండు చిత్రాలు విడుదలయ్యేవి.

అవార్డులు
టబు ”మాచిస్‌, చాందిని బార్‌” చిత్రాలకు ఉత్తమ నటిగా రెండుసార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ”విరాసత్‌, హు తు తు, అస్తిత్వా, చీనీ కమ్‌, భూల్‌ భూలైయ్య” చిత్రాలకు ఉత్తమ నటిగా, ”హైదర్‌” చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా, ”విజరుపథ్‌” చిత్రానికి ఉత్తమ మహిళా అరంగేట్రం విభాగంలో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను ఆమె అందుకుంది. 2011లో సినిమా రంగానికి ఆమె చేసిన కషికి గాను భారత దేశంలోని నాలుగవ అత్యున్నత పౌర పురస్కారమయిన ”పద్మశ్రీ”తో సత్కరించింది. టబు ఇవే కాకుండా ‘ఐఫా’ పురస్కారాలతోపాటు పలు అవార్డులను గెల్చుకుంది.

కరీనా కపూర్‌, కృతి సనన్‌తో కలసి టబు ఎయిర్‌హౌస్టెసగా ‘క్రూ’ చిత్రంలో నటించింది. ఈ కామెడీ ఫిల్మ్‌లో టబు నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టబు ఇండిస్టీలోకి వచ్చి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది… అంటే ఎవరూ నమ్మరు. అయినా ఇప్పటికీ నటిగా ఆమె ఏమాత్రం తగ్గలేదు. ‘మేల్‌ ఓరియంటెడ్‌ ఇండిస్టీలో ఓ ముగ్గురు కథానాయికలు కలసి వందకోట్ల వసూళ్లను సాధించడం ఒక రికార్డు.

‘చాందిని బార్‌’ నుంచి ఇటీవల వచ్చిన ‘అంధాధున్‌’ వరకు టబు ఎప్పటికప్పుడు తనని నిరూపించుకుంటూనే ఉంది. తాము రాసుకున్న పాత్రలకు టబు మాత్రమే న్యాయం చేయగలదు అని నమ్మిన దర్శకులు, రచయితలు ఉండటమే కాకుండా.. ఆమె కోసమే కథలు రాసుకున్న దర్శకులు కూడా ఉన్నారు.

సరోజాదేవి కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన సినిమా ‘పాండురంగ మహత్యం’. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్టీఆర్‌ స్వీయ నిర్మాణంలో తెరెక్కిన ఈ సినిమాలో ఈమె పుండరీకుడిని తన మైకంలో పడేసే వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. అదే సినిమాను కొన్నేళ్ళ తర్వాత బాలకష్ణ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పాండురంగడు’ గా రీమేక్‌ అయింది. ఈ చిత్రంలో అదే వేశ్య పాత్రను టబు వేయడం విశేషం.

చిత్రపరిశ్రమలో ఎక్కువ ముద్దుపేర్లు ఉన్న నటిగా టబు ఘనత సాధించింది. వందకుపైగా ముద్దు పేర్లు.. కలిగిన టబు ని టాబ్స్‌, టబ్స్‌, టబ్బీ, టాబ్లర్‌, టాబ్లోరోన్‌ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆమె ఈమెయిల్‌ కూడా టాబ్లోరోన్‌ పేరుతో ఉండడం విశేషం.

కెరీర్‌ ఆరంభంలో టబు చేసిన సినిమాలు ఫ్లాప్‌ అవడంతో ఆమెకు కష్టాలు తప్పలేదు. బోనీ కపూర్‌ నిర్మించిన ‘ప్రేమ్‌’ సినిమాతో టబుకు తొలిసారిగా బాలీవుడ్‌లో మంచి సూపర్‌ హిట్‌ లభించింది. ఆ సినిమా నిర్మాణం కోసం 8 ఏళ్లు పట్టింది. కానీ ఎంతో ఓపిగ్గా చేసినందుకుగాను ఆ సినిమానే టబుకు లక్‌ తీసుకొచ్చింది. 1994లో వచ్చిన ‘విజరుపథ్‌’ అనే చిత్రం తర్వాత టబు ఇక తిరిగి వెనక్కి చూసుకోలేదు. కాగా బాలీవుడ్‌ ప్రముఖులు షబానా ఆజ్మీ, జావేద్‌ అఖ్తర్‌, ఫరాన్‌ అక్తర్‌, బాబా ఆజ్మీ, ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌, ప్రముఖ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ తదితరులాంత టబుకు సమీప బంధువులే. టబు సోదరి ఫరా నాజ్‌ కూడా బాలీవుడ్‌ లో ప్రముఖ సినీ నటిగా కొనసాగింది.

  • డా. పొన్నం రవిచంద్ర,
    సీనియర్‌ జర్నలిస్టు, సినీ విమర్శకులు
    9440077499
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -