– సెమీఫైనల్ బెర్త్‌పై భారత్ గురి
– నేడు కరీబియన్లతో నాకౌట్ పోరు
– బ్యాటర్లు, బౌలర్ల నిలకడపై ఫోకస్
సూపర్8 ఆఖరు అంకానికి చేరుకోగా.. డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇండియా సెమీఫైనల్ బెర్త్ వేటలో కరీబియన్లతో నాకౌట్ సమరానికి సై అంటోంది. భారత్, విండీస్ బ్యాటింగ్ లైనప్‌లు పవర్ హిట్టర్లతో బలోపేతంగా కనిపిస్తుండగా.. బౌలింగ్ విభాగంలో ఆతిథ్య జట్టుదే తిరుగులేని పైచేయి. ఈడెన్‌గార్డెన్స్‌లో బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా మెరిస్తే దర్జాగా సెమీస్‌కు చేరుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. భారత్, వెస్టిండీస్ సూపర్8 పోరు నేడు.
నవతెలంగాణ-కోల్‌కతా
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత్ ఆఖరు వరకు ఎదురుచూడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. దక్షిణాఫ్రికా చేతిలో దారుణ ఓటమి, జింబాబ్వేపై భారీ విజయాలు సాధించిన భారత్, వెస్టిండీస్ నేడు సెమీఫైనల్ బెర్త్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. సూపర్8 గ్రూప్-1 ఆఖరు మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ నెలకొంది.
ఆ ఒక్కటి అధిగమిస్తే..
2024 టీ20 ప్రపంచకప్ నెగ్గిన తర్వాత భారత్ తలపడిన జట్లలో విండీస్ ఒకటి. ఈ రెండు జట్లు చివరగా 2013లోనే ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ను ఓడించిన విండీస్.. ఆ తర్వాత విజేతగా నిలిచింది. తాజా ప్రపంచకప్‌లో ఇటు భారత్‌తో పాటు విండీస్ ప్రయాణం ఒకే విధంగా సాగింది. గ్రూప్ దశలో అజేయ రికార్డు.. సూపర్8లో ఒకే తరహా ప్రదర్శన. సెమీస్ రేసులో మెరుగైన బౌలింగ్‌తో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ ఆఫ్ స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ మాయజాలంతో భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేసేందుకు విండీస్ సిద్ధమవుతోంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దూబెలు ఎడమ చేతి వాటం బ్యాటర్లు. ఆఫ్ స్పిన్‌ను ఆడటంలో వీళ్లందరూ అనూహ్యంగా ఇబ్బంది పడుతున్నారు. వరుసగా నిరాశపరిచిన అభిషేక్ శర్మ 26 బంతుల్లో అర్థ సెంచరీ సాధించినా.. అది అతడి కెరీర్‌లో రెండో నెమ్మదైన ఫిఫ్టీ. నేటి మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే రోస్టన్ ఛేజ్‌ను ప్రయోగించి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుకు ముకుతాడు వేయాలని కరీబియన్ల ఆలోచన. జింబాబ్వేతో మ్యాచ్‌లోనే ఆఫ్ స్పిన్ బలహీనత నుంచి బయటపడినట్టు కనిపించిన భారత్.. నేడు ఈడెన్‌గార్డెన్స్‌లో ఆఫ్ స్పిన్‌ను ఎదురుదాడి చేసే అవకాశం లేకపోలేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివం దూబెలు మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరవచ్చు. అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రాలతో కలిసి హార్దిక్ పాండ్య పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. ఈడెన్‌గార్డెన్స్‌లో మాయ చేసేందుకు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ సిద్ధమవుతున్నారు.
పిచ్, వాతావరణం
కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌కు బ్యాటింగ్‌కు అనుకూలం. నేటి మ్యాచ్‌కు ఎర్ర మట్టి పిచ్‌ను సిద్ధం చేశారు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండనుంది. మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవు. 1983 తర్వాత ఈ గ్రౌండ్‌లో విండీస్ చేతిలో భారత్ ఓటమెరుగదు.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
వెస్టిండీస్ : బ్రాండన్ కింగ్, షారు హౌప్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్‌మయర్, రోవ్‌మాన్ పావెల్, రోస్టన్ ఛేజ్, రూథర్‌ఫోర్డ్, షెఫర్డ్, జేసన్ హౌల్డర్, మాథ్యూ ఫోర్డె, మోటీ, షమ్రా జోసెఫ్.
టీ20 ప్రపంచకప్‌లో నేడు
జింబాబ్వే X దక్షిణాఫ్రికా
వేదిక : న్యూఢిల్లీ , టైమ్ : మ|| 3
భారత్ X వెస్టిండీస్
వేదిక : కోల్‌కతా, టైమ్ : రా|| 7
స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం..



