నవతెలంగాణ-హైదరాబాద్: సిబ్బంది కొరత, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మార్సెయిల్, నాంటెస్, లియోన్ సహా పలు నగరాల్లో పాఠశాలలను దిగ్బంధించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు ‘‘మా చదువుల కోసం ఆగ్రహం’’, ‘‘రాజకీయ నాయకులు ఎక్కడ? మేమున్నామని వారికి తెలుసా?’’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. మంగళవారం సుమారు 1,800 హైస్కూళ్లను దిగ్బంధించినట్లు లేదా ఆ రోజు మూసివేసినట్లు విద్యార్థి సంఘం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
పారిస్ శివారు ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ నిరసనలు రెండు వారాలుగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం అల్లర్ల నియంత్రణ పోలీసులను రంగంలోకి దించింది. సోమవారం ఉత్తర ఫ్రాన్స్‌లో హైస్కూల్ విద్యార్థులు, అల్లర్ల నియంత్రణ పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో 15 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి చేయి కోల్పోయినట్లు ప్రాంతీయ మీడియా వెల్లడించింది. సుమారు 200 నుంచి 250 మంది నిరసనకారులు పోలీసులపై వస్తువులు విసిరారని స్థానికులు తెలిపారు. పోలీసులు ప్రయోగించిన చెదరగొట్టే గ్రెనేడ్‌ను తీసుకున్న అనంతరం అది పేలడంతో బాలుడి చేయి, మోచేయి కింది భాగం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు.
ప్రధాని హామీ
విద్యార్థుల ప్రధాన డిమాండ్లపై స్పందిస్తామని ప్రధానమంత్రి సెబాస్టియన్ లెకార్ను హామీ ఇచ్చారు. గైర్హాజరైన ఉపాధ్యాయుల స్థానంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని నియమించడం, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠశాల సమయాన్ని సమీక్షించడం, మధ్యాహ్న భోజన విరామాన్ని పొడిగించడం వంటి డిమాండ్లను పరిశీలించాలని మంత్రులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. అక్టోబర్ నెలాఖరులోగా తొలి ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రులను ఆదేశించారు.
దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగానికి అదనపు నిధులు కేటాయించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం, బలహీన ఆర్థిక వృద్ధి, బడ్జెట్ లోటును నియంత్రించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విద్యార్థుల నిరసనలు మరింత ఒత్తిడి పెంచుతున్నాయి.
వేలాది మంది అరెస్టు
నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి 6,100 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అరెస్టయిన వారిలో అత్యధికులు మైనర్లేనని పేర్కొంది. 1,483 మంది మైనర్లతో సహా 1,800 మందికి పైగా విచారణను ఎదుర్కొంటున్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘర్షణల్లో కనీసం 715 మంది పోలీసు సిబ్బంది, 215 మంది యువకులు గాయపడినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.





కామెంట్‌లు (0)