నవతెలంగాణ-హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎన్నికల భవన్ కు వరకు శాంతియుత నిరసన కూడా వ్యక్తం చేశాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఇండియా బ్లాక్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు భద్రతను పెంచింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞనేష్ కుమార్ భద్రతను ('Z+' స్థాయి) మరింత పటిష్టం చేసేందుకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అదనపు రిజర్వ్ సిబ్బందిని మోహరించిందని అధికారులు తెలిపారు. న్యూ మోతీ బాగ్ కాలనీలోని ఆయన నివాసం, ఎన్నికల కమిషన్ కార్యాలయం, ఆయన వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ అదనపు CISF సిబ్బందిని మోహరించారు.
ప్రధానమంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు అందించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) భద్రత తర్వాత దేశంలో రెండవ అత్యున్నత భద్రతా కేటగిరీ అయిన జెడ్+ భద్రత జ్ఞానేష్ కుమార్‌కు ఇప్పటికే ఉంది.






కామెంట్‌లు (0)