నవతెలంగాణ-హైదరాబాద్: 22ఎ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు ఏడు కీలక ఉత్తర్వులు ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా జీఓ 59 దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. 500 చదరపు గజాలలోపు జీఓ 59 పెండింగ్ దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇస్తూ.. మెమో నెం.48030 జారీ చేసినట్లు తెలిపారు.
జీఓ 59 అమలులో అక్రమాలకు తావులేదని.. నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. గతంలో జీఓ 59 అమలులో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జారీ చేసిన కన్వేయన్స్ డీడ్స్ కేసులను కూడా సమగ్రంగా పరిశీలించాలన్నారు. 22-ఎపై శరవేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే 22-ఎ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. 22-ఎకు సంబంధించిన 10-12 సమస్యలను ఫాస్ట్‌ట్రాక్‌లో ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. జీఓ118, జీఓ 76లకు అనుగుణంగా స్పష్టమైన మెమోలు జారీ చేసినట్లు చెప్పారు.






కామెంట్‌లు (0)