నవతెలంగాణ - హైదరాబాద్: పంటలు కాపాడుకునేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ ఖాతా వేదికగా స్పందించారు.
“కళ్ల ముందే ఎండుతున్న పంటలకు నీరివ్వమని అడిగిన రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారింది” అని హరీశ్ రావు విమర్శించారు. వారి చేతగానితనం వల్ల పంటలకు నీరందకపోతే, కడుపు మండి నిలదీసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తారా? అని ప్రశ్నించారు.
“ఇది ప్రజాపాలన కాదు. రైతులను పీడించే పాలన. తప్పు ప్రభుత్వం చేస్తే శిక్ష రైతులు అనుభవించాలా?” అని హరీశ్ రావు నిలదీశారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇది ప్రజాపాలన కాదు.. రైతులను పీడించే పాలన: హరీష్‌రావు
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)