Magazines

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

1 గంట క్రితం

Batukamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 
భీంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సంప్రదాయ పూల పండుగ బతుకమ్మ సంబరాలు ఘనంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్. సతీష్ అధ్యక్షతన, వైస్ ప్రిన్సిపాల్, WEC ఇంచార్జ్ డాక్టర్ బి. సుమలత పర్యవేక్షణలో, NSS (జాతీయ సేవా పథకం), WEC (మహిళా సాధికారత విభాగం) సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి కళాశాల ప్రాంగణంలో ఉంచారు. సంప్రదాయ వస్త్రధారణలో బతుకమ్మల చుట్టూ చేరి, బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ సందడి చేశారు.


కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్. సతీష్ మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళా శక్తికి ప్రతీక అని పేర్కొన్నారు. మన సంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో నేటి యువతరం ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్ మరియు WEC ఇంచార్జ్ డాక్టర్ బి. సుమలత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, శక్తికి ప్రతీక అని అన్నారు. కళాశాలలో WEC (మహిళా సాధికారత విభాగం) ద్వారా విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, స్వావలంబన పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారత దిశగా విద్యార్థినులు విద్యతో పాటు సామాజిక బాధ్యత, ఐకమత్యం, సాంస్కృతిక విలువలను అలవర్చుకోవాలని, ఇలాంటి కార్యక్రమాల లక్ష్యం కూడా అదేనని పేర్కొన్నారు.


తదనంతరం NSS కో-ఆర్డినేటర్ కె. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ... బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, ప్రకృతిని ఆరాధించే గొప్ప సంస్కృతికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. NSS స్వచ్ఛంద సేవకులు సేవాభావంతో పాటు సాంస్కృతిక విలువలను కూడా పెంపొందించుకోవాలని అన్నారు. పండుగలు సామాజిక బంధాలను బలపరుస్తాయని, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణహిత పద్ధతుల్లో పండుగలు జరుపుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఉత్తమంగా బతుకమ్మలను పేర్చిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. చివరగా బతుకమ్మలను నిమజ్జనం చేసి, ప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్